క్యార్తకర్తల సంబరాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓటర్లు కేసీఆర్ మీద నమ్మకంతోనే ‘కారు’ గుర్తుకు ఓటేసి భారీ విజయాన్ని అందించారు. ఓటమి పాలవుతారని భావించిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అభివృద్ధి, రైతు ఎజెండా, జనాకర్షక పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు.. కూటమితో జట్టు కట్టటం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. పేదలు, పల్లెలు ‘కారుకు’ అండగా నిలబడ్డాయి. తొలి ఓటు వేసిన నవ యువత, మలి ఓటు వేసిన వృద్ధులు, రైతులు పూర్తిగా కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటించారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్‌ఎస్), వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ (టీఆర్‌ఎస్), వరంగల్ పశ్చిమలో వినయ్‌భాస్కర్ (టీఆర్‌ఎ??స్), వర్ధన్నపేటలో అరూరి రమేష్ (టీఆర్‌ఎస్), నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి (టీఆర్‌ఎస్) పరకాలలో చల్లా ధర్మారెడ్డి (టీఆర్‌ఎస్), జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్‌ఎస్), స్టేషన్ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య (టీఆర్‌ఎస్), డోర్నకల్‌లో రెడ్యానాయక్ (టీఆర్‌ఎస్), మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్ (టీఆర్‌ఎస్ ) విజయం సాధించారు. భూపాపల్లిలో స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగులో మంత్రి చందూలాల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించారు. మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,(కాంగ్రెస్).. భద్రాచలంలో పొదెం వీరయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు.
రెడ్యానాయక్ ఆరోసారి..
డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డీఎస్.రెడ్యానాయక్ ఆరో సారి విజయం సాధించారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన రెడ్యానాయక్ 1989లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచారు. 1994, 1999, 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెడ్యా.. టీడీపీ అభ్యర్థి జయంత్‌నాథ్‌నాయక్‌పై 19140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 కాంగ్రెస్ నుంచే గెలుపొందిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో తొలిసారి కారు గుర్తుతో పోటీ చేసిన రెడ్యా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రునాయక్‌పై 17,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
పరకాలలో ఫైర్ బ్రాండ్ ఓటమి
కేటీఆర్‌తో విభేదించి సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. ఆమెను అత్యంత సునాయాసంగా ఓడించారు. కూటమి పొత్తుల్లో భాగంగా పరకాల నుంచి పోటీ చేసిన కొండాసురేఖ ఆది నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గట్టి పోటీదారుగా ఉన్న సురేఖ ఏ రౌండ్‌లోనూప్రభావం చూపలేకపోయారు. కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి 46,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
రాజయ్య, వినయ్ నాలుగోసారి..
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య రాజకీయ పరిశీలకుల అంచనాలకు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య, టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై 35,790 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. 2004లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయన ఆయన ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డిపై 39,059 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.
ఆ ఇద్దరికి ‘సన్’స్ట్రోకే..
భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారికి , ములుగు అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్‌కు సన్‌స్ట్రోక్ తాకినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మధుసూదనాచారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. సన్‌స్ట్రోక్‌ను ముందుగానే పసిగట్టిన ఆయన ఆరు నెలలుగా కుమారులను నియోజకవర్గానికి దూరంపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 15,635 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. ఇక ములుగు నుంచి చందూలాల్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. కూమారుడి అనుమతి లేకుండా సాధారణ ప్రజలు నేరుగా చందూలాల్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి చందూలాల్‌పై 22,671 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు.
అరూరి రమేష్ రికార్డు మెజార్టీ
వర్ధన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో హరీశ్‌రావు తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్మేగా అరూరి రికార్డు సృష్టించారు. ఆయన టీజేఏస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. దేవయ్యకు 32,012 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లోనూ రమేష్‌కు 86 వేల మెజార్టీ వచ్చింది. ఈఎన్నికల్లో ఆయన రికార్డును ఆయనే బద్దలుకొట్టడం విశేషం.
ఎర్రబెల్లి డబుల్ హ్యాట్రిక్
ఎర్రబెల్లి దయాకర్‌రావు వరుసగా ఆరు విజయాలను నమోదు చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1952 నుంచి 2018 వరకు కొనసాగిన శాసనసభ సభ్యుల ఎన్నికల్లో వరుసగా ఓటమి లేకుండా గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్‌రావు రికార్డు సాధించారు. 1994లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజేశ్వర్‌రావు మీద 22,175 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి పోటీ చేసి అప్పటి పాత చెన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావును వరుసగా రెండు సార్లు ఓడించారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4386 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పి.రామేశ్వర్‌రెడ్డిని ఓడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment