సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్‌ను అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే రాష్ట్రంలో పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఎదురైందనే చర్చ కమలనాథుల్లో సాగుతోంది. పార్టీ విస్తరణకు తగ్గట్టుగానే గెలిచే సీట్లు, మద్దతుదారుల ప్రభావం ఎక్కడెక్కడ అధికంగా ఉంది.. ప్రభావం చూపే అంశాలేమిటీ.. పార్టీపరంగా అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలేమిటీ.. అనే అంశాలను లోతుగా పరిశీలించి సరైన కార్యాచరణను సిద్ధం చేసుకోకపోవడం వల్లే నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ కమిటీ నుంచి సహాయ, సహకారాలు, మద్దతు అందినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయామనే భావన వ్యక్తమవుతోంది. దాదాపు పది సీట్ల వరకు గెలుచుకోలేకపోయినా, గతంలో గెలిచిన ఐదు స్థానాల్లోనైనా నిలబెట్టుకోలేక, చివరకు ఒక్క సీటుకే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి మద్దతుగా ఉన్న వర్గాలు కూడా ఫలితాల పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోగా, ప్రత్యర్థి పార్టీగా పరిగణించే ఎంఐఎం గతంలోని ఏడుసీట్లను మళ్లీ నిలబెట్టుకోవడం బీజేపీ మద్దతుదారులకు కొరుకుడు పడడంలేదు. క్షేత్రస్థాయిల్లోని రాజకీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తదనుగుణంగా పావులు కదపడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానమైన ఎన్నికల అంశాలన్నీ పక్కకు పోవడం, చంద్రబాబు ప్రచారంతో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ చర్చనీయాంశం చేయడం, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం వంటి వాటిని ముందే ఊహించలేకపోయినట్టు ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.
1983లోనూ ఇలాంటి స్థితే...
ఈ ఎన్నికల్లో 118 స్థానాల్లో (భువనగిరి సీట్లో మినహా) పోటీ చేసి 103 చోట్ల అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతం అయినా పెరుగుతుందనే ఆశలు సైతం నెరవేరకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. రాజకీయపార్టీగా బీజేపీ ఏర్పడి ఉమ్మడి ఏపీలో సొంతంగా ఎదుగుతున్న క్రమంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఇప్పుడు కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన చూపుతుందని, మంచి సంఖ్యలోనే సీట్లు గెలుస్తుందని నాయకులతోపాటు అభిమానులు ఆశించారు. అయితే, ఫలితాలు భిన్నంగా వచ్చి మూడు సీట్లకే బీజేపీ పరిమితమైంది. బీజేపీకి తక్కువ సీట్లు రాగా ఆ ఎన్నికల్లోనే ఏఐఎంఐఎం ఏకంగా ఐదుసీట్లను గెలుచుకోవడం మద్దతుదారులకు మింగుడుపడటంలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచే సీట్లు పెరగడానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులతోపాటు అభిమానుల మద్దతు కూడా కారణమని చెబుతున్నారు. మళ్లీ అలాంటి పరిణామాలు పునరావృతమయ్యేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవేం ఫలితాలు..!
Published Sun, Dec 16 2018 2:28 AM | Last Updated on Sun, Dec 16 2018 2:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment