సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే లోక్‌సభ ఎన్నికలలోనూ కారు జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. 14 స్థానాల పరిధిలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించగా, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ (కూటమి) స్వల్ప ముందంజలో ఉంది. ఇక, యథావిధిగా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 4.5 లక్షల పైచిలుకు ఓట్లతో మజ్లిస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, జాతీయ పార్టీగా బీజేపీ పరిస్థితిని ఈ ఎన్నికలు పాతాళంలోకి నెట్టాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిం చడం లేదు. అయితే, జాతీయ అంశాల ఆధారంగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతం జరిగితే తప్ప 14 చోట్ల టీఆర్‌ఎస్, 1–2 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లిస్ గెలుపు దిశగా పయనిస్తాయని అసెంబ్లీ ఫలితాలు చెబుతున్నాయి.
రెండంటే రెండే!
అసెంబ్లీ ఎన్నికలలో పేలవ ప్రదర్శన చూపిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పోలయిన ఓట్లను పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది కూడా గుడ్డిలో మెల్ల అనే రీతిలో ఖమ్మంలో 38వేలు, మహబూబాబాద్‌లో 9వేల ఓట్లు మాత్రమే టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ పోలయ్యాయి. ఇక, కొంత మెరుగ్గా భువనగిరిలో 58 వేలు, పెద్దపల్లిలో 88వేలు, నల్లగొండ లోక్‌సభ పరిధిలో లక్ష ఓట్లు టీఆర్‌ఎస్ కన్నా వెనుకంజలో ఉంది. ఏ లెక్కన చూసినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనీసం టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో కూడా టీఆర్‌ఎస్ మరింత మెరుగైన ప్రదర్శన కనపర్చింది. ఈ రెండు చోట్లా.. కాంగ్రెస్ కన్నా టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లే పోలయ్యాయి.
పాపం.. బీజేపీ
బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఏ ఒక్క లోక్‌సభ స్థానం పరిధిలో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కన్నా తక్కువగా కేవలం 1.72లక్షల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి. మిగిలిన స్థానాల్లో పరిశీలిస్తే ఆదిలాబాద్, చేవెళ్ల, హైదరాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరి స్థానాల్లో మాత్రమే లక్ష ఓట్ల కన్నా ఎక్కువ బీజేపీకి పోలయ్యాయి. ఇక, అత్యల్పంగా ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి బీజేపీకి 9,764 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment