rangareddy collectorate
-
ఆరేళ్ల తర్వాత ధిక్కరణ పిటిషన్ విచారణార్హం కాదు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఏడాదిలోగా మాత్రమే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2009లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ 2015లో దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్, రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులకు సింగిల్ జడ్జి జస్టిస్ అమర్నాథ్గౌడ్ ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వీరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 383 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమి తమదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ల అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 2015లో వారు కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో చేపట్టిన నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేసేందుకు యంత్రాంగం దృష్టిసారింది. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 12న పునాదిరాయి వేశారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి 11 నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. కొలువుదీరనున్న 36 శాఖలు అత్యాధునికి హంగులతో సువిశాలంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో 36 శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం లక్ష చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఆయా శాఖలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఇప్పటికే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 500 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ తదిత సౌకర్యాలు కల్పించనున్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఈఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ చెప్పారు. దీని నిర్మాణ పనులపై ఆయన మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 90 శాతం నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పది శాతం పనులను నాలుగు నెలల్లో ముగిస్తామన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, డీఆర్ఓ ఉషారాణి పాల్గొన్నారు. -
రైతుబంధుపై ఆందోళన వద్దు
బషీరాబాద్: మీ సేవలో ఆధార్ లింక్ చేసుకున్న రైతులందరికీ త్వరలో పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ తెలిపారు. రైతుబంధు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. బషీరాబాద్ మండలం జలాల్పూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు హాజరైన కలెక్టర్ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. నీళ్లపల్లి అటవీ ప్రాంతం లోని భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో రైతుబంధు సాయం అందుతుందని చెప్పారు. ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధా ర్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. జలాల్పూర్లో చెం చులు తమకు పాసుపుస్తకాలు రాలేదని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేప చేదు ఉమామహేశ్వరి, వీఆర్ఓ పెంటప్ప, రైతులు పాల్గొన్నారు. బడిబాటను విజయంవంతం చేయాలి... వికారాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14 నుంచి 19వరకు అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 14న వికారాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఏడీ భరత్ కుమార్, అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్‌గౌడ్, డీడబ్ల్యూఓలు జ్యోత్స్న, హన్మంతరావు, చైల్డ్‌లైన్ సభ్యులు పాల్గొన్నారు. బషీరాబాద్ ఎందుకు వెనకబడింది.. బషీరాబాద్: మరుగుదొడ్ల నిర్మాణంలో బషీరాబాద్ మండలం ఎందుకు వెనకబడిందని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరుకు మండలంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని రాధాకృష్ణ సమావేశ మందిరంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, ఎంపీపీ కరుణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని ఓడీఎఫ్‌గా మార్చడానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరిష్కరించుకోవాలనితెలిపారు. ఇసుక సమస్య లేకుండా తహసీల్దార్ అనుమతులు ఇస్తారని చెప్పారు. గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఉద్యమంలా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. ఈ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రవి, ఎంపీడీఓ అనురాధ, ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఎస్ఐ మహిపాల్‌రెడ్డి, ఉపాధి, వెలుగు అధికారులు పాల్గొన్నారు. -
నో ప్లాస్టిక్.. సేవ్ ఎన్విరాన్మెంట్
జీడిమెట్ల: భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించాలంటే మొక్కలను నాటడమే మార్గమని జీడిమెట్ల ఐలా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్‌ఎమ్‌ఐఏ సర్వీస్ సొసైటీ, టీఎస్ఐఐసీ, ఐలా ఆధ్వర్యంలో 500మందితో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి పీసీబీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కుమార్ పాఠక్, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, టీఎస్ఐఐసీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విజయరెడ్డి, ఐలా చైర్మన్ సదాశివరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న చెట్లను నరికివేయవద్దని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భూమిని కాపాడుకోవాలని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేయాలని వారు సూచించారు. కలిసికట్టుగా కార్యక్రమాలు భేష్ ప్రతి సంవత్సరం జీడిమెట్లలోని అన్ని సొసైటీలు కలిసికట్టుగా నెలరోజుల పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం భేష్ అని మేడ్చల్ జిల్లా ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కుమార్ పాఠక్ అన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలను నాటి వాటిని పెంచడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయని ఈ సందర్భంగా ఆయన వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఐలా కార్యవర్గ సెక్రటరీ సాయికిషోర్, ఎ.ఎల్.ఎన్.రెడ్డి, ఫేజ్–3 ప్రోగ్రాం ఇంచార్జ్ విజయ కుమార్ నంగానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్‌కు బాటలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఐదేళ్ల స్వపరిపాలనలో రాష్ట్రం ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసిందని శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప సభాపతి.. జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వేదిక వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి రాచకొండ కమిషనరేట్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పద్మారావు మాట్లాడుతూ... అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కూడా సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలియజేశారు. మరింత అంకితభావం, నీతి నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తే అమరవీరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. ప్రజలందరూ సుఖః శాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సామాజిక భరోసా సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకం కింద జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నామని, 1.73 లక్షల మందికి ప్రతినెలా రూ.20.20 కోట్లు ఖర్చుచేస్తున్నామని పద్మారావు చెప్పారు. . కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా గతేడాది ఆరు వేల పేద కుటుంబాలకు రూ.44 కోట్లు అందజేశాం, ప్రతిపేదవాడూ కడుపు నిండా భోజనం చేసేందుకు రూపాయికి కిలో చొప్పున జిల్లాలో 5.24 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొన్నటి విద్యాసంవత్సరంలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, శంకర్పల్లి, ఫరూఖ్‌నగర్‌లో ఒకటి చొప్పున కేజీబీవీలను వినియోగంలోకి తెచ్చాం, 243 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 75 వేల మంది విద్యార్థులకు డిజిటల్ విధానంలో విద్యాబోధన చేస్తున్నాం. ఫలితంగా బడుల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడిందన్నారు. వసతిగృహాలు, బడుల్లో చదువుతున్న 1.04 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.181 కోట్ల ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందించాం. 16 ఎస్సీ, 9 చొప్పున బీసీ, మైనారిటీ, గిరిజన గురు కులం ద్వారా 11,400 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని పద్మారావు పేర్కొన్నారు. రైతులకు అండగా.. రైతుబంధు పథకం కింద తొలి విడతగా 2.47 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.257 కోట్లు అందజేశాం. రబీ సీజన్లో 2.18 లక్షల మందికి రూ.237 కోట్లను పెట్టుబడి సాయం కోసం ఖర్చుచేశాం. అలాగే రైతు బీమా పథకం కింద 489 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించి బాసటగా నిలిచాం. రూ.35,200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 350 గ్రామాల పరిధిలోని 3.77 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా 1.14 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ‘రికార్డు’ ప్రక్షాళన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వంద రోజుల్లోనే జిల్లాలోని 2.42 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాం. 81 రోడ్ల మరమ్మతుల పనులు రూ.1,186 కోట్ల వ్యయంతో చేపట్టాం. ముచ్చర్లలోని ఫార్మాసిటీ అనుసంధానం కోసం కందుకూరు నుంచి యాచారం వరకు రూ.146 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు జోరుగా సాగుతున్నా యి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యం తో 191 గ్రామ పంచా యతీలు, ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశాం. 60 గిరిజన తండాలు గ్రామ జీపీలుగా అవతరించాయి. 418 జీపీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాం. రూ.30 కోట్ల జిల్లా పరిషత్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డ్వాక్రా, అంగన్వాడీ భవనాలు, తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టినట్లు సభాపతి వివరించారు. ఆర్థిక చేయూత గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో తొలివిడతగా జిల్లాలోని 11,277 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. గంగపుత్రులు, ముదిరాజ్‌ల స్వాలంబన కోసం 534 చెరువుల్లో సుమారు కోటి చేప విత్తనాలు వేశాం. మహిళా సాధికారిత కింద ఈ ఏడాది 6,930 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.282 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాం. ఉపాధి హామీ పథకం కింద రూ.112 కోట్లు ఖర్చు చేసి 46 లక్షల పనిదినాలు కల్పించాం. 797 మంది నిరుద్యోగ యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పద్మారావు పేర్కొన్నారు. లబ్ధిదారులకు అందజేత రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 9 ప్రభుత్వ శాఖల పరిధిలోని లబ్ధిదారులకు ఉపసభాపతి చేతుల మీదుగా ఆస్తుల పంపిణీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 20 స్వయం సహాయక సంఘాలకు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 13 మందికి ట్రాన్స్పోర్ట్ హైరింగ్ వాహనాలు, హాజింగ్ శాఖ తరఫున ఐదుగురికి ఇళ్ల పట్టాలు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురికి వెండింగ్ వాహనాలు, ఉద్యానశాఖ ద్వారా ఆరుగురికి డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 20 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, హియరింగ్ ఎయిడ్స్, గిరిజన అభివృద్ధి శాఖ తరఫున ఆటోలు, ఫొటో అండ్ వీడియోగ్రాఫ్ యూనిట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్ నిధిని అందజేశారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఉప సభాపతి పద్మారావు ఓదార్చారు. బిడ్డల త్యాగం ఊరికే పోదని.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబసభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీష్, డీఆర్ఓ ఉషారాణి, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు సీపీ సుధీర్‌బాబు, డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్, డీఈఓ సత్యనారాయణ రెడ్డి ప్రజాప్రతనిధులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి పెద్దపీట కేసీఆర్ కిట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకంలో భాగంగా రూ.20.58 లక్షలను అందజేశాం. కంటి వెలుగు కార్యక్రమం కింద 8.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. 2.52 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామన్నారు. -
రైతు బంధు పై రభస
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దున్నేవారికి కాకుండా భూమి ఉన్నవారికే పెట్టుబడి సాయం అందుతోందని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 20శాతం మంది రైతుల దరికి ఇంకా ‘రైతుబంధు’ చేరలేదని వ్యాఖ్యానించింది. శనివారం చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకంపై వాడీవేడి చర్చ సాగింది. సభ ప్రారంభంకాగానే.. మంచాల, కందుకూరు జెడ్పీటీసీ సభ్యులు మహిపాల్, జంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటికీ, సగం మందికి ఇంకా లబ్ధి చేకూరలేదనే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన అధికారపక్ష సభ్యులు.. సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాలో నగదు జమ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోకుండా అడ్డగోలుగా మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. రెవెన్యూతోనే తలనొప్పి.. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల వ్యవహారాన్ని సమావేశం ఆక్షేపించింది. రెవెన్యూ అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పకడ్బందీగా రికార్డులను సరిదిద్దకపోవడం.. ఉద్దేశపూర్వకంగా పాస్‌బుక్కులను జారీచేయకపోవడంతో చాలామంది రైతులకు రైతుబంధు రాకుండా పోయిందని సభ్యులు విమర్శించారు. అభ్యంతరాలులేని భూములకు కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, శంషాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాలో నిధులు జమ కాకున్నా జమ అయినట్లు సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని, ఇలా రైతులను మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. సాంకేతిక సాకులతో రైతుబంధు పథకాన్ని వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. రైతుబంధుతో సంపన్నులకే లబ్ధి చేకూరిందని, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలో ఇంకా నయాపైసా జమ కాలేదని మంచాల జెడ్పీటీసీ సభ్యుడు మహిపాల్ అన్నారు. శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సిములు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ సాకుతో ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు జరగడంలేదని, పాస్‌పుస్తకాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. తాజాగా పాస్‌పుస్తకాలు అందినవారికి త్వరలోనే రైతుబంధు సాయం అందుతుందని, పాత బకాయిలు మాత్రం ఇచ్చే అంశంపై స్పష్టత లేదని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. క్షమాపణ చెబుతున్నా.. ‘అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది. కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం కింద ప్రతి రైతుకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాంకేతిక కారణాలతో కొంతమందికి ఇంకా సాయం అందలేదు. నగదు పంపిణీలో ఆలస్యమైనందుకు సర్కారు తరుఫున క్షమాపణలు చెబుతున్నా’ అని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. మేమే అక్రమార్కులమా? మొయినాబాద్ మండలంపై మీరు(డీపీఓ) కక్షగట్టారు. 111 జీఓ పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల లేఅవుట్ల జోలికి వెళ్లకుండా మావే కూల్చుతున్నారంటే మీ ఉద్దేశమేమిటో తెలుస్తోంది. ఎమ్మెల్యేతో మీరు మిలాఖత్ అయ్యారు. అజీజ్‌నగర్‌లో బడాబాబులు నిర్మించిన విల్లాలను టచ్ చేయకుండా.. 200 గజాల స్థలంలో ప్లాట్లు కొన్నవారిని వేధిస్తున్నారు అని మొయినాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాపచంద్రలింగం తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. హిమాయత్‌సాగర్ బొడ్డున హరీష్‌రావు, ఎమ్మెల్యే వివేకానంద నిర్మించిన భవనాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. సభ్యుడి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేధించిన డీపీఓ పద్మజారాణి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం తప్ప వివక్ష పాటిస్తున్నామనడం సరికాదన్నారు. అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా తొలగిస్తామని, అజీజ్‌నగర్ విల్లాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. సీనరేజీ సుంకం ఇవ్వరా? హైకోర్టు తీర్పు ఇచ్చినా సీనరేజీ సెస్సు ఇవ్వకపోవడం ఏమిటని చేవెళ్ల జెడ్పీటీసీ చింపుల శైలజ ప్రశ్నించారు. 2012–13 నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.520 కోట్లను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా కౌంటర్ దాఖలు చేయాలని భావించడం చూస్తే స్థానిక సంస్థలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ అంశంపై కలెక్టర్ లోకేశ్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిఖ శాఖ పరిధిలో ఉందని, త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. జిల్లా ఖనిజ నిధి కింద అభివృద్ధి పనులు చేసేందుకు వెసులుబాటు ఉందని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి, వికారాబాద్ జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, మల్లారెడ్డి, వివేకానంద, మహేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రోహిత్‌రెడ్డి, ఆనంద్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. విజేతలకు సన్మానం ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి సన్మానించారు. శాలువా, పూలమాలలతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారుల సంఘం ఆకాక్షించింది. -
ఎన్నికలకు రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నాం. ఓటర్ల తుది జాబితా విడుదలతో కీలకఘట్టం ముగిసింది. ఇక ఎన్నికల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాం అని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ లోకేశ్‌కుమార్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీశ్, డీఆర్ఓ ఉషారాణితో కలిసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 27.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, డిసెంబర్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే 3,073 పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. తాజాగా పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా మరో 150 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు నాటికి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నందున.. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితాపై రాజకీయపక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, ఈవీఎంల పనితీరుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఈవీఎంను నిశితంగా పరిశీలించి.. పనితీరును రూఢీ చేసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పర్యవేక్షణా బృందాలను నియమించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో రూ.27 లక్షల నగదును పట్టుకున్నామని, ఈ నగదుపై ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఎన్నికల ధన ప్రవాహం నియంత్రించేందుకు ప్రత్యేక సంచార బృందాలను కూడా రంగంలోకి దించామని తెలిపారు. కోడ్ ధిక్కరించినట్లు తేలినా ప్రచార వ్యయం అడ్డగోలుగా చేస్తున్నా తక్షణమే సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీచేస్తామని చెప్పారు. ఒకేచోట కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపును ఒకే కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు సుమారు 14వేల మంది సిబ్బంది అవసరమని గుర్తించగా, ఇప్పటివరకు 12వేల మందిని ఎంపిక చేశామని, వీరికి దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా 340 రోహింగ్యాల ఓట్లు మయాన్మార్‌కు చెందిన 340 మంది రోహింగ్యాలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించామని కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు గుర్తించిన పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇదిలావుండగా, జిల్లావ్యాప్తంగా 140 మంది శతాధిక ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. జాబితా ముసాయిదా ప్రచురించేనాటికి 896 మంది ఉండగా ఇందులో 47 మంది చనిపోయారని, 709 మంది వయస్సును సరిదిద్దడంతో కేవలం 140 మంది మాత్రమే శతాధిక వృద్ధులున్నట్లు తేలిందని వివరించారు. కొత్తగా 48వేల దరఖాస్తులు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గత నెల 25వ తేదీతో ముగిసినా కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా గడువు ఉన్నదని, ఇప్పటివరకు 48వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వాస్తవానికి నామినేషన్ల రోజు వరకు నమోదు వీలున్నప్పటికీ పాలనాపరమైన సౌలభ్యం దృష్ట్యా పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. తద్వారా దరఖాస్తులను సులువుగా పరిష్కరించే వీలు కలుగుతుందని చెప్పారు. -
బీ రెడీ..!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇక జాగ్రత్తగా ఉండాలి. వీరిపై అధికార యంత్రాంగం నిఘా వేయనుంది. ముందస్తు ఎన్నికలకు అధికారులు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు. కలెక్టర్ లోకేశ్‌కుమార్ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. ఇక ప్రతి అంశాన్ని యంత్రాంగం నిశితంగా పరిశీలించనుంది. అభ్యర్థులు ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు తప్పవు. సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’కు పార్టీలే కాదు.. అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతోంది. ఎన్నికల గంట మోగడమే తరువాయి నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రచార సరళి, అభ్యర్థుల కదలికలు, ప్రలోభాలపై నిఘా పెట్టడానికి అధికార బలగాలను మోహరించింది. ఈమేరకు కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మానవ వనరుల నిర్వహణ, ఓటింగ్ యంత్రాల నిర్వహణ, రవాణా, శిక్షణ, సామగ్రి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలన, పరిశీలకులు, నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణ తదితర అంశాలకు సంబంధించి 16 విభాగాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడంలో ఈ అధికారులు కీలక భూమిక పోషించనున్నారు. కేవలం నోడల్ అధికారులే కాకుండా.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలు, పెయిడ్ న్యూస్, ప్రకటనలను అనునిత్యం గమనించేందుకు ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ’ని నియమించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఇద్దరు ప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో డీఆర్ఓ, డీఈఓ కూడా సభ్యులుగా వ్యవహరించనున్నారు. రంగంలోకి ఫ్లయింగ్స్క్వాడ్లు ఎన్నికల ప్రవర్తనా నియమాళిపై డేగ కన్ను వేయడానికి జిల్లావ్యాప్తంగా 24 మందితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ప్రతి సెగ్మెంట్‌కు తహసీల్దార్‌తో కూడిన ఇద్దరు సభ్యుల బృందం ఈ వ్యవహారాలను పరిశీలించనుంది. జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోకి వచ్చే షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో ఈ బృందాలను కోడ్ అమలు తీరును కనిపెట్టనున్నాయి. కేంద్ర ఎన్నికల పరిశీలకులకు సహాయకులుగా కూడా వీరిని నియమించారు. నిఘా నీడలో.. రాజకీయ పార్టీల ప్రచార సరళి, బహిరంగ సభలపై నిఘా వేయడానికి నియోజకవర్గానికో టీమ్‌ను రంగంలోకి దించారు అధికారులు. వీడియోగ్రాఫర్‌తో కూడిన ఈ బృందం ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ప్రతి క్రతువును చిత్రీకరించనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు స్టార్ క్యాంపెయినర్ల బహిరంగ సభలను కూడా వీడియోలో బంధించనుంది. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తేలినా.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా.. కవ్వింపు చర్యలకు పాల్పడినా నిక్షిప్తమయ్యే ఫుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. -
కలెక్టరేట్లో ప్రమాదం.. ఉవ్వెత్తున మంటలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొద్ది సేపట్లోనే మంటల తీవ్రత బాగా పెరిగింది. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.