కొంగర్‌కలాన్‌లో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవన సముదాయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో చేపట్టిన నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేసేందుకు యంత్రాంగం దృష్టిసారింది. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 12న పునాదిరాయి వేశారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి 11 నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది.
కొలువుదీరనున్న 36 శాఖలు
అత్యాధునికి హంగులతో సువిశాలంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో 36 శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం లక్ష చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఆయా శాఖలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఇప్పటికే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 500 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ తదిత సౌకర్యాలు కల్పించనున్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఈఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ చెప్పారు. దీని నిర్మాణ పనులపై ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 90 శాతం నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పది శాతం పనులను నాలుగు నెలల్లో ముగిస్తామన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ ఉషారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment