సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ పది స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువుచేశాయి. విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడిన టీఆర్‌ఎన్‌ను మాత్రం ఢీకొనలేకపోయాయి. గత ఎన్నికల్లో వరంగల్ జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి టీఆర్‌ఎస్ మంచి ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాలు జయశంకర్ బూపలపల్లి జిల్లాలోనివే కావడం విశేషం.
భూపాలపల్లిలో స్పీకర్ మధుసూధనాచారి ఓడిపోవడం టీఆర్‌ఎస్ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో మధుసూదనాచారి హోరాహోరీగా పోరాడి చివరికి 14877 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇక ములుగులో మంత్రి చందులాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కచేతిలో 22671 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. టీఆర్‌ఎస్ గట్టి అభ్యర్థులపై కాంగ్రెస్ గెలవడంతో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ మాత్రం తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు సాధించగా ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయింది.
ఎస్టీ రిజర్వుడు గిరిజన ప్రాంతం అయిన మహబూబాబాద్‌లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఓటమి చెందారు. తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెండోసారి విజయం సాధించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామలో వరుసగా రెండోసారి ఓటమిచెందారు. పాలకుర్తి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 52857 మోజార్టీతో గెలిచారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామలోను, డాక్టర్ తాటికొండ రాజయ్య ఘన్‌పూర్ లో విజయఖేతనం ఎగరేశారు.
వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో మూడు (వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట) నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ మంత్రి కొండా సురేఖ పరకాల స్థానం నుంచి పోటీ చేసి చల్లా ధర్మరెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైయ్యారు.
నియోజకవర్గం | అభ్యర్థి పేరు | 2018 |
జనగామ | ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి | టీఆర్‌ఎస్ |
స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్పీ) | డాక్టర్ తాటికొండ రాజయ్య | టీఆర్‌ఎస్ |
పాలకుర్తి | ఇ.దయాకరరావు | టీఆర్‌ఎస్ |
డోర్నకల్ (ఎస్టీ) | డీఎస్ రెడ్యానాయక్ | టీఆర్‌ఎస్ |
మహబూబాబాద్ (ఎస్టీ) | బానోతు శంకర్ నాయక్ | టీఆర్‌ఎస్ |
నర్సంపేట | పెద్ది సుదర్శన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
పరకాల | చల్లా ధర్మారెడ్డి | టీఆర్‌ఎస్ |
వరంగల్ వెస్ట్ | దాస్యం వినయభాస్కర్ | టీఆర్‌ఎస్ |
వరంగల్ ఈస్ట్ | నన్నపనేని నరేందర్ | టీఆర్‌ఎస్ |
భూపాలపల్లి | గండ్ర వెంకటరమణా రెడ్డి | కాంగ్రెస్ |
ములుగు (ఎస్టీ) | డి అనసూయ (సీతక్క) | కాంగ్రెస్ |
Comments
Please login to add a commentAdd a comment