స్టేడియంలో డ్రోన్ కెమెరాల పని తీరును పరిశీలిస్తున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
గుంటూరు వెస్ట్: మెగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారు. కఠినమైన శారీరక, రాత పరీక్షలను దాటితేగానీ ఉద్యోగం సంపాదించే వీలుండదు. ఆర్మీ అధికారులు అభ్యర్థులకు ముందుగానే తేదీల వారీగా అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్ ద్వారా జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది గుంటూరుకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిలకు సంబంధించిన 150 మంది ఆర్మీ అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టెప్ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు లైజనింగ్ అధికారిగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అభ్యర్థులు మాస్క్‌తోపాటు శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు.
పోలీసుల పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది సాయుధులైన పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్‌ల నేతృత్వంతో రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఫ్లడ్‌లైట్స్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బంది కలిగితే పొన్నూరు రోడ్డులో అదనపు ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్
క్రమశిక్షణతో మెలగాలి
ఆర్మీ అధికారులతో కలిసి మన జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా యువతకు లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు గుర్తించాలి. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా అదనపు ఏర్పాట్లు చేశాం.
– వివేక్‌యాదవ్, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment