BR Stadium
-
రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) రాష్ట్రంలోనే తొలి టెన్నిస్ అకాడమీని అందుబాటులోకి తెస్తోంది. క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉండేలా గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఆధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ సామర్థ్యంతో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనిని మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక శిక్షణకు ప్రణాళిక.. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుల వరకు అకాడమీలో తక్కువ ఖర్చుతో శిక్షణ పొందేలా ప్రణాళికను రూపొందించింది. దేశ, విదేశాలకు చెందిన కోచ్‌ల సహకారంతో అకాడమీని నిర్వహించనుంది. రోజు వారీ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ కోసం వచ్చే వారికి శాప్ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది. ప్రస్తుతం అకాడమీలో రెండు సింథటిక్ కోర్టులు అందుబాటులో ఉండగా వీటికి అదనంగా మరో నాలుగు ‘క్లే’ కోర్టులను తయారు చేస్తోంది. క్రీడాకారుల సౌలభ్యం కోసం ఫ్లడ్ లైట్లతో పాటు జిమ్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్ ట్రాక్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కోచ్‌లనూ తయారుచేసేలా.. ఈ అకాడమీ ద్వారా ఉత్తమ క్రీడాకారులతో పాటు ఉత్తమ కోచ్‌లను కూడా శాప్ తయారుచేయనుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆరు వారాలు/ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది పూర్తి చేసిన వారికి స్పోర్ట్స్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి కోర్సులు చేయాలనుకునే వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారికి శాప్ టెన్నిస్ కోచ్ ఫౌండేషన్ కోర్సు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి.. అసిస్టెంట్ కోచ్‌లుగా ఉపాధి కల్పించనుంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ శిక్షణ శాప్ దేశ చరిత్రలోనే తొలిసారిగా సొంతంగా స్పోర్ట్స్ లీగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఒక్క టెన్నిస్‌లోనే 39 టోర్నమెంట్లు నిర్వహించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది టెన్నిస్ క్రీడాకారులను రిజిస్టర్ చేశాం. క్రీడాకారుల అవసరాలను గుర్తించి తొలిసారిగా టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు టెన్నిస్ కోచింగ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శాప్ ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుబాటులోకి రాబోతోంది. ఎక్కడెక్కడికో వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తీసుకుంటున్న ట్రైనింగ్‌ను.. గుంటూరులోనే తక్కువ ఖర్చుతో అందిస్తాం. శాప్ లీగ్స్‌ను వేగంగా పూర్తి చేయాలి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాప్ లీగ్స్ ఫేజ్–2 పోటీలను వేగంగా పూర్తి చేయాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. శాప్ లీగ్స్ నిర్వహణపై సోమవారం వారిద్దరూ.. కోచ్‌లు, అధికారులకు పలు సూచనలు చేశారు. 19 విభాగాల్లో క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అనంతరం టోర్నీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ (చదవండి: సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్ జారీ) -
ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
గుంటూరు వెస్ట్: భారీ బందోబస్తు, కఠిన ఆంక్షలు, ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య గురువారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు ఏడు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ముందుగా స్క్రీనింగ్, ఎత్తు, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్ తడిగా ఉండడంతో పొన్నూరు రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది అభ్యర్థులు కనీసం విద్యార్హత, కోవిడ్ నెగిటివ్, నో రిస్క్ సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. వారికి 29న హాజరు కావాలని మరో అవకాశం కల్పించారు. 18 ఏళ్లలోపు యువకులు తల్లిదండ్రుల వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని రావాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరిని అనర్హులుగా ప్రకటించారు. కొందరు దళారులు స్టేడియం వద్ద అభ్యర్థులను మభ్యపెడుతున్న విషయాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. పూర్తిగా ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో ఎటువంటి సిఫార్సులు ఉండవని, దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రాత పరీక్షను పాస్ చేస్తామని చెబుతున్నాయని, దీనిని నమ్మవద్దని వారు కోరుతున్నారు. ఈ నెల 30 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తారు. -
నేటి నుంచి మెగా ఆర్మీ రిక్రూట్మెంట్
గుంటూరు వెస్ట్: మెగా ఆర్మీ రిక్రూట్మెంట్కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారు. కఠినమైన శారీరక, రాత పరీక్షలను దాటితేగానీ ఉద్యోగం సంపాదించే వీలుండదు. ఆర్మీ అధికారులు అభ్యర్థులకు ముందుగానే తేదీల వారీగా అడ్మిట్ కార్డులు ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది గుంటూరుకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిలకు సంబంధించిన 150 మంది ఆర్మీ అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టెప్ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు లైజనింగ్ అధికారిగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అభ్యర్థులు మాస్క్‌తోపాటు శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. పోలీసుల పటిష్ట ఏర్పాట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది సాయుధులైన పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ల నేతృత్వంతో రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఫ్లడ్లైట్స్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బంది కలిగితే పొన్నూరు రోడ్డులో అదనపు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ క్రమశిక్షణతో మెలగాలి ఆర్మీ అధికారులతో కలిసి మన జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా యువతకు లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు గుర్తించాలి. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా అదనపు ఏర్పాట్లు చేశాం. – వివేక్‌యాదవ్, కలెక్టర్ -
‘క్రీడా’విహీనం
* ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదిక * ప్రస్తుతం దీనావస్థలో * నిధులున్నా పనులు సాగని వైనం బీఆర్ స్టేడియానికి పునర్ వైభవం వచ్చేనా అని క్రీడాకారులు సందేహిస్తున్నారు. ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పోటీల నిర్వహణకు వేదికైన స్టేడియం పరిస్థితి ప్రస్తుతం దీనావస్థలో ఉంది. అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరూ స్టేడియం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. మూడేళ్ల కిందట బీఆర్ స్టేడియంలో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరుచేసినా నేటికీ ఒక్క పనీ చేసిన దాఖలాల్లేవని క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు స్పోర్ట్స్ : ఏపీలో అతి పెద్ద శాప్ క్రీడా మైదానం, రాజధాని నగరంలోని ప్రతిష్టాత్మకమైన స్డేడియం అధ్వానస్థితికి చేరుకుంటున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. నాడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికైనా బ్రహ్మనందరెడ్డి స్డేడియం నేడు ఎలాంటి పోటీల నిర్వహణకూ వీలులేని విధంగాSమారింది. 22 ఎకరాల స్థలం ఉన్న స్టేడియం అభివృద్ధికి మూడేళ్ళ కిందట రూ.8.28 కోట్లు మంజూరయ్యాయి. నేటికి అభివృద్ధికీ నోచుకోకపోవటం బాధాకరమని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న స్డేడియంను అభివృద్ధి చేసి క్రీడాపరికరాలు, శిక్షకులను, క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకొస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారయ్యే అవకాశం ఉంది. గతంలో జాతీయ, అంతర్జాతీయ వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలలో అనేక మంది ప్రాతినిధ్యం వహించారు. అలాంటి క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. అంతర్జాతీయ క్రీడలకు వేదిక... బీఆర్ స్డేడియం పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు వేదికగా నిలిచింది. ఇండియా– శ్రీలంక క్రికెట్ మ్యాచ్, ఏషియన్ అథ్లెటిక్స్ సెలక్షన్ మీట్ నిర్వహించిన చరిత్ర ఉంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, పీటీ ఉషా, రీతు అబ్రహం, బహుదూర్ ప్రసాద్, బల్వీందర్ సింగ్, దృతీచంద్, అన్నావి వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు బీ.ఆర్ స్డేడియంలో కాలు మోపిన ఘటనలూ ఉన్నాయి. ఏషియన్ సెలక్షన్లలో పీటీ ఉషా 400 మీటర్ల పరుగులో రికార్డ్ స్పష్టించిన చరిత్ర ఉంది. నత్తనడకన సాగుతున్న పనులు... 8 కోట్లకు పైగా నిధులు మంజూరు అయి మూడేళ్ళ గడుస్తున్న అ«భివృధ్ధికి నోచుకోలేదు. పరిపాలన భవనం నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుంటే, సింథటిక్స్ టెన్నిస్ కోర్టు నిర్మాణం పనులు చివరి దశలో నిలిపివేశారు. సింథటిక్ ట్రాక్ పరిస్థితి ఏంటి..? సింథటిక్ ట్రాక్ కోసం మూడేళ్ల కిందట కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు అమోదం లభించింది. అయితే నిర్మాణానికి నోచుకోలేదు. స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి, మౌలిక వసతులు కల్పిస్తే ఒలింపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని క్రీడాకారులు, క్రీడాభిమానులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు.