ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్న అభ్యర్థులు
గుంటూరు వెస్ట్: భారీ బందోబస్తు, కఠిన ఆంక్షలు, ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య గురువారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు ఏడు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ముందుగా స్క్రీనింగ్, ఎత్తు, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్ తడిగా ఉండడంతో పొన్నూరు రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది అభ్యర్థులు కనీసం విద్యార్హత, కోవిడ్ నెగిటివ్, నో రిస్క్ సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. వారికి 29న హాజరు కావాలని మరో అవకాశం కల్పించారు.
18 ఏళ్లలోపు యువకులు తల్లిదండ్రుల వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని రావాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరిని అనర్హులుగా ప్రకటించారు. కొందరు దళారులు స్టేడియం వద్ద అభ్యర్థులను మభ్యపెడుతున్న విషయాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. పూర్తిగా ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో ఎటువంటి సిఫార్సులు ఉండవని, దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రాత పరీక్షను పాస్ చేస్తామని చెబుతున్నాయని, దీనిని నమ్మవద్దని వారు కోరుతున్నారు. ఈ నెల 30 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment