సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) రాష్ట్రంలోనే తొలి టెన్నిస్ అకాడమీని అందుబాటులోకి తెస్తోంది. క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉండేలా గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఆధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ సామర్థ్యంతో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనిని మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రత్యేక శిక్షణకు ప్రణాళిక..
గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుల వరకు అకాడమీలో తక్కువ ఖర్చుతో శిక్షణ పొందేలా ప్రణాళికను రూపొందించింది. దేశ, విదేశాలకు చెందిన కోచ్‌ల సహకారంతో అకాడమీని నిర్వహించనుంది. రోజు వారీ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ కోసం వచ్చే వారికి శాప్ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది. ప్రస్తుతం అకాడమీలో రెండు సింథటిక్ కోర్టులు అందుబాటులో ఉండగా వీటికి అదనంగా మరో నాలుగు ‘క్లే’ కోర్టులను తయారు చేస్తోంది. క్రీడాకారుల సౌలభ్యం కోసం ఫ్లడ్ లైట్లతో పాటు జిమ్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్ ట్రాక్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
కోచ్‌లనూ తయారుచేసేలా..
ఈ అకాడమీ ద్వారా ఉత్తమ క్రీడాకారులతో పాటు ఉత్తమ కోచ్‌లను కూడా శాప్ తయారుచేయనుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆరు వారాలు/ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది పూర్తి చేసిన వారికి స్పోర్ట్స్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి కోర్సులు చేయాలనుకునే వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారికి శాప్ టెన్నిస్ కోచ్ ఫౌండేషన్ కోర్సు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి.. అసిస్టెంట్ కోచ్‌లుగా ఉపాధి కల్పించనుంది.
తక్కువ ఖర్చుతో అత్యుత్తమ శిక్షణ
శాప్ దేశ చరిత్రలోనే తొలిసారిగా సొంతంగా స్పోర్ట్స్ లీగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఒక్క టెన్నిస్‌లోనే 39 టోర్నమెంట్లు నిర్వహించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది టెన్నిస్ క్రీడాకారులను రిజిస్టర్ చేశాం. క్రీడాకారుల అవసరాలను గుర్తించి తొలిసారిగా టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు టెన్నిస్ కోచింగ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శాప్ ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుబాటులోకి రాబోతోంది. ఎక్కడెక్కడికో వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తీసుకుంటున్న ట్రైనింగ్‌ను.. గుంటూరులోనే తక్కువ ఖర్చుతో అందిస్తాం.
శాప్ లీగ్స్‌ను వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాప్ లీగ్స్ ఫేజ్–2 పోటీలను వేగంగా పూర్తి చేయాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. శాప్ లీగ్స్ నిర్వహణపై సోమవారం వారిద్దరూ.. కోచ్‌లు, అధికారులకు పలు సూచనలు చేశారు. 19 విభాగాల్లో క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అనంతరం టోర్నీల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
– ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ
(చదవండి: సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్ జారీ)
Comments
Please login to add a commentAdd a comment