Tennis Academy
-
రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) రాష్ట్రంలోనే తొలి టెన్నిస్ అకాడమీని అందుబాటులోకి తెస్తోంది. క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉండేలా గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఆధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ సామర్థ్యంతో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనిని మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక శిక్షణకు ప్రణాళిక.. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుల వరకు అకాడమీలో తక్కువ ఖర్చుతో శిక్షణ పొందేలా ప్రణాళికను రూపొందించింది. దేశ, విదేశాలకు చెందిన కోచ్‌ల సహకారంతో అకాడమీని నిర్వహించనుంది. రోజు వారీ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ కోసం వచ్చే వారికి శాప్ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది. ప్రస్తుతం అకాడమీలో రెండు సింథటిక్ కోర్టులు అందుబాటులో ఉండగా వీటికి అదనంగా మరో నాలుగు ‘క్లే’ కోర్టులను తయారు చేస్తోంది. క్రీడాకారుల సౌలభ్యం కోసం ఫ్లడ్ లైట్లతో పాటు జిమ్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్ ట్రాక్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కోచ్‌లనూ తయారుచేసేలా.. ఈ అకాడమీ ద్వారా ఉత్తమ క్రీడాకారులతో పాటు ఉత్తమ కోచ్‌లను కూడా శాప్ తయారుచేయనుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆరు వారాలు/ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది పూర్తి చేసిన వారికి స్పోర్ట్స్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి కోర్సులు చేయాలనుకునే వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారికి శాప్ టెన్నిస్ కోచ్ ఫౌండేషన్ కోర్సు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి.. అసిస్టెంట్ కోచ్‌లుగా ఉపాధి కల్పించనుంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ శిక్షణ శాప్ దేశ చరిత్రలోనే తొలిసారిగా సొంతంగా స్పోర్ట్స్ లీగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఒక్క టెన్నిస్‌లోనే 39 టోర్నమెంట్లు నిర్వహించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది టెన్నిస్ క్రీడాకారులను రిజిస్టర్ చేశాం. క్రీడాకారుల అవసరాలను గుర్తించి తొలిసారిగా టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు టెన్నిస్ కోచింగ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శాప్ ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుబాటులోకి రాబోతోంది. ఎక్కడెక్కడికో వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తీసుకుంటున్న ట్రైనింగ్‌ను.. గుంటూరులోనే తక్కువ ఖర్చుతో అందిస్తాం. శాప్ లీగ్స్‌ను వేగంగా పూర్తి చేయాలి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాప్ లీగ్స్ ఫేజ్–2 పోటీలను వేగంగా పూర్తి చేయాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. శాప్ లీగ్స్ నిర్వహణపై సోమవారం వారిద్దరూ.. కోచ్‌లు, అధికారులకు పలు సూచనలు చేశారు. 19 విభాగాల్లో క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అనంతరం టోర్నీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ (చదవండి: సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్ జారీ) -
మెరుగైన శిక్షణ అందించడమే నాదల్ లక్ష్యం
సాక్షి, అనంతపురం : మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా నాదల్ ఫౌండేషన్ ముందుకు సాగుతోందని స్పెయిన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు జొనాథన్ మార్ట్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రతినిధి హ్యూగో కమిన్ తెలిపారు. భవిష్యత్తు తరాలకు మంచి అలవాట్లను పెంపొందించడంలో క్రీడలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అనంతపురం క్రీడా మైదానంలో ప్రపంచ స్థాయి టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ 2010 అక్టోబర్ 17న టెన్నిస్ ఫౌండేషన్ అకాడమీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకూ వెయ్యి మంది క్రీడాకారులను టెన్నిస్‌లో తీర్చిదిద్దారు. టెన్నిస్ క్రీడను నేర్చుకునే విద్యార్థులకు ఆటతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, స్పోకెన్ ఇంగ్లిష్, సామాజిక స్పృహ కలిగిన అంశాలపై తర్ఫీదునిస్తున్నారు. అంతేకాక కోచింగ్‌కు హాజరయ్యే క్రీడాకారులకు ఉచితంగా న్యూట్రీషన్‌ను వారే అందిస్తున్నారు. గతంలో అనంత క్రీడా మైదానానికే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది ఒక కేంద్రంలో క్రీడా శిబిరాన్ని నిర్వహించగా, ఈ ఏడాది రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, అనంతపురం నంబర్ 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షిస్తున్న జొనాథన్ మార్ట్, హ్యూగో కమిన్తో ‘సాక్షి చిట్‌చాట్’.. సాక్షి: జిల్లా క్రీడాకారులను ఎలా సిద్ధం చేస్తున్నారు? జవాబు: కేవలం క్రీడ ద్వారానే కాకుండా సమాజంలో వారి బాధ్యత ఏమిటో తెలిసుకునేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇస్తున్నాం. సాక్షి: నాదల్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో చెప్పగలరా? జవాబు: సమాజానికి శక్తివంతమైన యువతను సిద్దం చేసి అందించడమే నాదల్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఈ ఫౌండేషన్‌ను రఫా నాదల్ 2010 అక్టోబర్ 17న అనంతపురంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, నైపుణ్యాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించి వారిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నాం. సాక్షి: టెన్నిస్ శిక్షణ ఉచితమా? జవాబు : ఇది పూర్తీ ఉచితం. దీనిని రఫెల్ నాదల్ ఫౌండేషన్ ద్వారా నడిపిస్తున్నాం. ఇందులో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ క్రీడ పరంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం. కోచింగ్ క్యాంపులకు హాజరయ్యే క్రీడాకారులకు వాహన సదుపాయాన్ని కూడా కల్పించాం. సాక్షి: జిల్లా వ్యాప్తంగా టెన్నిస్‌ను విస్తరించనున్నారా? జవాబు : గత 10 ఏళ్ల ప్రయాణంలో 8 ఏళ్లు అనంత నగరానికి పరిమితమయ్యాం. గత ఏడాది రెండు పాఠశాలల్లో ప్రత్యేక శిభిరాలు నిర్వహించి టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి ఉన్న వారిని గుర్తించాం. ఈ ఏడాది మరో మూడు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు టెన్నిస్, సామాజిక అంశాలు, మానవీయ విలువలపై చైతన్య పరిచాం. సాక్షి: ఇక్కడి కోచ్‌లతో కో ఆర్డినేషన్ ఎలా ఉంది? జవాబు : మేము నిర్వహించే శిబిరాలు ప్రధానమైనవి కావు. ఇక్కడి నాదల్ అకాడమీలో ఉన్న కోచ్‌లను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నాం. మా లక్ష్యాలను ముందుగా వారికి వివరిస్తాం. ఆ తర్వాత వారే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ఆలోచన మాది, ఆచరణలో మాత్రం వారు సూచించిన విధానాలను అవలంభిస్తుంటాం. ఒకరి ద్వారా అనేకం అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం. సాక్షి: సామాజిక మార్పు ఎలా సాధ్యమవుతుంది? జవాబు : సమాజంలో విద్యార్థులు చాలా కీలకం. వారే ఈ సమాజాన్ని, దేశాన్ని మార్చే ఏకైక శక్తి. సామాజిక విస్ఫోటాలకు కారణమైన వారిలో మానసికంగా ఎదురవుతున్న రుగ్మతలే ప్రధానమని చెప్పవచ్చు. దీనిని అధిగమించేందుకు క్రీడలు ప్రధానం. ఈ క్రీడ నేర్పితే వారు ఆ క్రీడలో మాత్రమే రాణిస్తారు. అయితే వారికి ఇంగ్లిష్, కంప్యూటర్, మానవీయ విలువల గురించి తెలపడం ద్వారా శక్తివంతమైన పౌరులుగా ఎదుగుతారు. దీని ద్వారా సామాజిక మార్పు సిద్ధమవుతుంది. సాక్షి: ఉత్తమ క్రీడాకారుడిగా రాణించేందుకు ఏమి చేయాలి? జవాబు : క్రీడాకారుడిలో ఉన్న ఆసక్తి అతనిని ఉన్నత శ్రేణికి చేరుస్తుంది. సాధన అనేది ప్రధానం. కోచ్ ఇచ్చే సూచనలను ఫాలో అయితే ఆ క్రీడాకారుడు ఆటలో రాణించగలడు. ఫిట్నెస్ తప్పనిసరి. మానసిక స్థితిని ఎప్పటికప్పుడు ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఉత్తమ క్రీడాకారిడిగా రాణించవచ్చు. -
అదే నా కోరిక : సానియా మీర్జా
-
అదే నా కోరిక : సానియా మీర్జా
హైదరాబాద్‌సిటీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కోరికను వెలిబుచ్చారు. సొంత టెన్నిస్ అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని సానియా అన్నారు. నగరంలో బాలీవుడ్ హీరోయిన్ నేహ దూపియా, సానియా మీర్జా సందడి చేశారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో బాలీవుడ్ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేశారు. వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహించే టోర్నమెంట్ ప్రమోషన్లో భాగంగా సానియా పిల్లలతో కలిసి టెన్నిస్ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల ప్రపంచకప్ క్రికెట్లో భారత మహిళల జట్టు చాలా మంచి ప్రదర్శన కనపరిచిందని.. కాకపోతే ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం కొంత నిరాశ పరిచిందన్నారు. కానీ వారి పోరాటం స్పూర్తినిస్తుందన్నారు. ఇక దేశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఆటలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని, భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందరిని ఒకే రకంగా చూసే రోజులు రావాలన్నదే తన కోరిక అన్నారు. -
చిన్నారుల కోసం సానియా మరో అకాడమీ
3 నుంచి 8 ఏళ్ల వారికి ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో అకాడమీని ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ అకాడమీని పూర్తిగా చిన్నారుల కోసమే తీర్చిదిద్దారు. ఇందులో మూడు నుంచి ఎనిమిదేళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. 2013లో తన పేరు మీద మొయినాబాద్‌లో సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)ని నెలకొల్పింది. ఇందులో ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరుప్రాయంలోనే ఆట నేర్చుకునే వారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్‌ఎమ్‌టీఏ గ్రాస్‌రూట్ లెవల్ అకాడమీని ఫిల్మ్ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో అందుబాటులోకి తెచ్చింది. ‘ఇప్పుడు ప్రొఫెషనల్స్‌గా కీర్తించబడుతున్న ఆటగాళ్లందరూ నాలుగైదేళ్లప్పుడే రాకెట్ పట్టారు. భారత్‌లోనూ తదుపరి సానియా, భూపతి, పేస్లు తయారవ్వాలంటే ఇలాంటి అకాడమీ ఒకటుండాలని మా కుటుంబం భావించింది. చాలామంది బాలబాలికలకు ఈ అకాడమీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశాం. ముందుగా ఇక్కడ సులువుగా ఆట వొంటబట్టించేందుకు సాఫ్ట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయిస్తాం’ అని సానియా వివరించింది. -
టెన్నిస్ వండర్స్
అలనాటి టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా బుధవారం సానియా మీర్జాతో కలసి ముర్తుజాగూడలోని టెన్నిస్ అకాడమీలో సందడి చేశారు. వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న సానియాను ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాట్సాఫ్ నాదల్
కరువు నేల వైపు నాదల్ చూపు తన ఫౌండేషన్ ద్వారా అనంతలో తొలి టెన్నిస్ అకాడమీ గ్రామీణ క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇప్పటికే కోట్లు ఖర్చు చేసిన స్పెయిన్ బుల్ ఎర్ర కోర్టులో ఎదురు లేని మొనగాడు... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్‌లను తన ఖాతాలో వేసుకున్న ధీరుడు.. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2గా వెలుగొందుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్కు కరువు ప్రాంతంగా పిలుచుకునే అనంతపురంనకు సంబంధమేమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న తను ఈ ప్రాంతంలోనే టెన్నిస్ అకాడమీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు నాదల్ పడుతున్న శ్రమను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే... (ఆర్డీవీ బాలకృష్ణారావు- అనంతపురం అర్బన్) ఆర్డీటీ... రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంతో మగ్గుతున్న వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం గత 44 ఏళ్ల నుంచి పాటుపడుతున్న ఎన్జీవో సంస్థ. చిన్నారుల్లో క్రీడాభివృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడుతున్న ఈ ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫై. రాఫెల్ నాదల్ ఇక్కడ తన ఫౌండేషన్ ద్వారా టెన్నిస్ అకాడమీ పెట్టేందుకు ఆయనే ప్రేరణగా నిలిచారు. ఈ సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన నాదల్, అతని తల్లి అన్నే మరియా ‘అనంత’లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చారు. 2010లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటు నాదల్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఉన్న తల్లి అన్నే మరియాతో కలిసి 2010 అక్టోబర్ 17న నాదల్ అనంతపురంలో టెన్నిస్ అకాడమీ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పడిన తొలి అకాడమీ ఇదే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంత క్రీడాకారులను వెలుగులోకి తేవడమే అకాడమీ ముఖ్య లక్ష్యం. ప్రారంభించిన వెంటనే మూడు టెన్నిస్ కోర్టుల నిర్మాణంతో పాటు వంద రాకెట్లు, నిర్వహణ కోసం దాదాపు రూ.51 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా నిధులు ఇస్తూనే ఉన్నారు. 2012-13లో రూ.50 లక్షలు, 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు. ఈ అకాడమీలో సుమారు 170 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఫౌండేషన్ ద్వారా కేవలం నిధులు పంపించడమే కాకుండా.. అన్నే మరియా వీలున్నప్పుడల్లా ‘అనంత’కు వస్తున్నారు. అకాడమీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. నాదల్ గర్ల్‌ఫ్రెండ్ మరియా ఫ్రాన్సిస్‌స్కా కూడా ఫౌండేషన్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె కూడా అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై, స్పోర్ట్స్ డెరైక్టర్లతో సమావేశమవుతూ ఉంటారు. ఇక్కడా క్లే కోర్టులే...: క్లే కోర్ట్ కింగ్‌గా పిలిపించుకునే రాఫెల్ నాదల్ తనకిష్టమైన ‘ఎర్ర’ మట్టి కోర్టులనే ‘అనంత’ అకాడమీలో ఏర్పాటు చేయాలని ఆర్డీటీకి సూచించారు. ఆటగాడిలో అసలైన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి మైదానాలే ఉపయోగపడతాయని అతడి విశ్వాసం. దీంతో ప్రస్తుతం అకాడమీలో ఐదు క్లే కోర్టులు ఉన్నాయి. రాత్రివేళల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశారు. పౌష్టికాహారం: ఇక్కడి క్రీడాకారులకు ఆర్డీటీ సంస్థ పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఉదయం రాగి మాల్ట్‌తో పాటు గుడ్డు, సాయంత్రం మరో గుడ్డు, అరటిపండ్లను ఇస్తున్నారు. క్రీడాకారుల ఫిట్నెస్తో పాటు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ: టెన్నిస్ మెళకువలతో పాటు ఆటగాడికి ఉండాల్సిన అదనపు లక్షణాలను అలవర్చేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వీరికి ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ గంటపాటు ఈ శిక్షణ ఉంటుంది. స్పెయిన్కుచెందిన మరియా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు. ముగ్గురు కోచ్‌లు: నాదల్ టెన్నిస్ అకాడమీలో భాస్కరాచార్య, కరీముల్లా, రాజశేఖర్ అనే ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. వీరితో పాటు స్పెయిన్ నుంచి కూడా కోచ్‌లు వస్తుంటారు. వీరు ఆరు నెలల పాటు అకాడమీలో కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ‘అనంత’లో ఐటా పోటీలు: భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) ఇక్కడ 2013 అక్టోబర్‌లో అండర్ -16 బాల బాలికల పోటీలు, నవంబర్‌లో అండర్ -14 పోటీలు నిర్వహించారు. ఇక్కడ అంతా ఉచితమే ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ఫౌండేషన్‌లో కోచింగ్ అంటే.. వామ్మో.. అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిక్షణకు నయా పైసా ఖర్చు కాదు. అంతా ఉచితమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఇక్కడ కోచింగ్ లభిస్తుంటుంది. అయితే వారికి వసతి సౌకర్యం మాత్రం ఉండదు. 6-14 ఏళ్ల లోపు వారు మాత్రమే కోచింగ్‌కు అర్హులు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని రాప్తాడు, ఉప్పరపల్లి, హంపాపురం, ఆకుతోటపల్లి, అనంతపురం నగరానికి చెందిన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే. నాదల్ స్థాయికి ఎదగాలి - మాంఛో ఫై, ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ రాఫెల్ నాదల్ ‘అనంత’లో అకాడమీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు నాదల్ స్థాయికి ఎదగాలి. నాదల్ ఆకాంక్ష కూడా అదే. ఆ దిశగానే శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏదో ఒక రోజు మంచి క్రీడాకారులు తప్పక వెలుగులోకి వస్తారు. విద్యతో పాటు క్రీడాభివృద్ధికి కృషి - రడువాన్, స్పెయిన్ కోచ్ విద్యతో పాటు క్రీడాభివృద్ధి కోసం నాదల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ అకాడమీ ఎంతో సహాయపడుతుంది. ఈ అకాడమీ నుంచి బయటకు వెళ్లిన వారు సొంత కాళ్లపై నిలబడగలుగుతారు. -
కేసిఆర్‌ను కలిసిన సానియా మీర్జా
-
సెమీస్‌లో భూపతి, మహేశ్
ఎస్‌ఎమ్‌టీఏ-ఏఐటీఏ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)-ఏఐటీఏ సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్.భూపతి, మహేశ్ మహాపాత్ర సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్ఎమ్టీఏలో బుధవారం జరిగిన బాలుర అండర్-12 క్వార్టర్ ఫైనల్లో భూపతి 6-0, 6-7 (2/7), 6-2తో సందీప్‌పై, మహేశ్ 7-5, 6-1తో క్రిష్ పటేల్‌పై గెలుపొందారు. జెవియా దేవ్ 6-4, 6-3తో అనిరుధ్ కుమార్‌పై, జవేరి ఆర్యన్ 6-3, 6-2తో ఆదర్శ్ టిప్పభట్లపై నెగ్గారు. బాలికల అండర్-12 క్వార్టర్స్‌లో రేష్మ 6-3, 1-6, 6-2తో చంద్రిక జోషిపై, ధ్రుతి కపూర్ 6-2, 6-4తో వినీతపై, చౌగులే 6-7 (6/7), 6-2, 6-3తో శ్రుతిపై, శ్రేయ 7-5, 6-0తో అకాంక్షపై విజయం సాధించారు. బాలికల అండర్-14 క్వార్టర్స్‌లో శివాని 6-4, 6-2తో సైదా షకిహ బేగంపై, ధరణ ముదలియార్ 6-2, 6-4తో ఈశ్వరిపై గెలుపొందారు. షేక్ హుమేరా నుంచి రితికకు వాకోవర్ లభించింది. అండర్-14 బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్లో శ్రీవత్స 6-3, 6-4తో ప్రలోక్పై, రోహిత్ 3-6, 7-5, 6-3తో నామ హెమన్పై, కుషాల్ 6-2, 6-2తో ఆర్యన్ జవేరిపై విజయం సాధించారు. -
తనిష్క్‌కు రన్నరప్
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ విద్యార్థి తనిష్క్ మాల్పాని సత్తాచాటాడు. ఇటీవల అణుపురం టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అతను బాలుర అండర్-14 విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తనిష్క్ టైటిల్ పోరులో పరాజయం చవిచూశాడు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తనిష్క్, కోచ్ డేవిడ్ రాజ్‌కుమార్‌లను ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్, వైస్ ప్రిన్సిపల్ హేమ చెన్నుపాటి అభినందించారు.