చిన్నారుల కోసం సానియా మరో అకాడమీ
3 నుంచి 8 ఏళ్ల వారికి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో అకాడమీని ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ అకాడమీని పూర్తిగా చిన్నారుల కోసమే తీర్చిదిద్దారు. ఇందులో మూడు నుంచి ఎనిమిదేళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. 2013లో తన పేరు మీద మొయినాబాద్‌లో సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)ని నెలకొల్పింది. ఇందులో ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరుప్రాయంలోనే ఆట నేర్చుకునే వారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్‌ఎమ్‌టీఏ గ్రాస్‌రూట్ లెవల్ అకాడమీని ఫిల్మ్ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో అందుబాటులోకి తెచ్చింది. ‘ఇప్పుడు ప్రొఫెషనల్స్‌గా కీర్తించబడుతున్న ఆటగాళ్లందరూ నాలుగైదేళ్లప్పుడే రాకెట్ పట్టారు. భారత్‌లోనూ తదుపరి సానియా, భూపతి, పేస్‌లు తయారవ్వాలంటే ఇలాంటి అకాడమీ ఒకటుండాలని మా కుటుంబం భావించింది. చాలామంది బాలబాలికలకు ఈ అకాడమీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశాం. ముందుగా ఇక్కడ సులువుగా ఆట వొంటబట్టించేందుకు సాఫ్ట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయిస్తాం’ అని సానియా వివరించింది.