అమ్మలకు అమ్మలు | Seven midwifery nurses from India have been selected for special training in Japan | Sakshi
Sakshi News home page

అమ్మలకు అమ్మలు

Published Wed, Nov 13 2024 12:12 AM | Last Updated on Wed, Nov 13 2024 12:12 AM

Seven midwifery nurses from India have been selected for special training in Japan

‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్‌వైఫ్‌. ‘మిడ్‌వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్‌ నాజ్‌ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్‌వైఫరీ నర్స్‌లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్‌ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్‌ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్‌ నాజ్‌ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్‌లో జరిగే లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ప్రోగ్రామ్‌లో వీరు పాల్గొంటున్నారు.

తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్‌ కోసం ఆదిలాబాద్‌ జిల్లాలోని రిమ్స్‌ను ఎంచుకుంది. యూనిసెఫ్‌ సహకారంతో హైదరాబాద్‌లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్  మిడ్‌వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.

భద్రాచలం ఏజెన్సీలో...
డిప్లొమా ఇన్  మిడ్‌వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్  పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్‌లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.

ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్‌ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం

ముఖ కవళికలతోనే...
భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్‌ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కుని బెడ్‌ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.

బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్‌ వస్తున్నాయి. హై రిస్క్‌ కేసు. బయటకు రిఫర్‌ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్‌ సాయంతో నార్మల్‌ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
– సూర్ణపు స్వప్న

మరచిపోలేని జ్ఞాపకాలు
హైదరాబాద్‌ కింగ్‌ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్‌ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్‌సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్‌ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.

వరంగల్‌ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్‌ బర్త్‌ ఎడ్యుకేషన్‌ క్లాస్‌లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్‌లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్‌ తొలి రెండు కాన్పులు సిజేరియన్‌ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్‌ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
– నౌషీన్‌ నాజ్‌

‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్‌ నాజ్‌లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్‌లోని లీడర్‌షిప్‌ప్రోగ్రామ్‌ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.

‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్‌ వారీజ్‌ బేగ్‌ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్‌ నాజ్‌ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్‌లోని ‘మెడిసిటీ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌’లో జీఎన్‌ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్‌ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.

మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్‌లో నిర్వహించిన ఆబ్‌స్టెక్టిక్స్‌ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్‌) వర్క్‌షాప్‌లో యూకే నుంచి వచ్చిన మిడ్‌ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ‘నేషనల్‌ మిడ్‌ వైఫరీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్‌. మిడ్‌వైఫరీ కోర్సులో బెస్ట్‌ స్టూడెంట్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌లోని నీలోఫర్, కింగ్‌ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. 

వాటర్‌ బర్త్, బ్రీచ్‌ బర్త్‌ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్‌బర్త్‌ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్‌. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement