Tennis star Sania Mirza
-
కొత్త కొత్తగా ఉంటుంది!
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చీ రాగానే హోబర్ట్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో గాయంతో వెనుదిరిగినా... ఫెడ్ కప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలువడంతో, తొలిసారి ప్రపంచగ్రూప్నకు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించింది. సర్క్యూట్లో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్–19 కారణంగా టెన్నిస్ ఆగిపోయింది. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సానియా చెప్పింది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న తన ఆశలకు ఇది ఇబ్బందేనని వ్యాఖ్యానించింది. ‘నేను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు. నాలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించాను. ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ నాకు ప్రతికూలమే. అప్పటికి నా వయసు మరో ఏడాది పెరుగుతుంది. 2021 అంటే ఇంకా చాలా దూరం ఉంది. అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుంది. దానికి సమయం పట్టడం సహజం. టోర్నీలు, ఇందులో గెలుపోటములు ఉంటాయి. నేను ఆ స్థాయిలో ఆడేందుకు సిద్ధమై వచ్చాను. కానీ ఇప్పుడు అంతా మారిపోతుంది. ఆటలో లయ తప్పుతుంది. మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతా బాగైతే మళ్లీ ఆడతాను కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది’ అని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై ఆట ఇలా ఉండదు... కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనా ఇకపై అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని మాజీ వరల్డ్ నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్ వ్యాఖ్యానించింది. ‘కచ్చితంగా అంతా మారిపోతుంది. ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేను కానీ సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయం. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడతారేమో. ఇప్పటికే చాలా మారిపోతోంది. ఎందరినో కలుస్తాం కానీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేం. క్రీడలు కూడా చాలా మారిపోతాయి. ఎన్నో రకాల కొత్త ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు ఉన్నట్లుగా మాత్రం ఆటలు కనిపించవనేది ఖాయం’ అని సానియా వివరించింది. ఏ దేశంలో ఆడగలం... కరోనా కారణంగా ఇతర క్రీడలతో పోలిస్తే టెన్నిస్‌కు ఎక్కువ నష్టం జరుగుతోందని సానియా పేర్కొంది. మహమ్మారి తగ్గినా ఇప్పట్లో కోలుకోవడం అంత సులువు కాదని ఆమె చెప్పింది. ‘టెన్నిస్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఆడుతున్నారు. ఏ ఒక్క చోట అయినా కరోనా ఇంకా తగ్గలేదంటే దాని ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. మరో దేశానికి ప్రయాణం చేయలేకపోతే టోర్నీలు ఎలా జరుగుతాయి. ఇదే టెన్నిస్‌కు ప్రధాన సమస్య. రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్లో ఇది ఉండదు. భారత్‌లో, పక్కనే ఉన్న శ్రీలంకలో కరోనా ప్రభావం తగ్గిందంటే ఈ రెండు దేశాల మధ్య సిరీస్ నిర్వహించుకోవచ్చు. కానీ టెన్నిస్‌లో అది సాధ్యం కాదు. ఏదో మంత్రం వేసినట్లు కరోనా ఒక్కసారిగా అదృశ్యమైపోతే తప్ప రాబోయే కొన్ని నెలల్లో ఆటలు జరిగే అవకాశం లేదు’ అని ఈ హైదరాబాదీ విశ్లేషించింది. ప్రేక్షకులు లేకున్నా ఓకే... తాము ఆట ఆడేది ప్రేక్షకుల కోసమేనని, మైదానంలో వారు ఉత్సాహపరుస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పిన సానియా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆట జరిగితే చాలని కోరుకుంటోంది. ‘ఇంతకంటే ఏమీ చేయలేని పరిస్థితి మాది. వేరే ప్రత్యామ్నాయం లేదు కదా. టెన్నిస్ ఆడకుండా ఎలాగూ ఉండలేం. ప్రేక్షకులు లేకుండా టోర్నీలు ఆడటంలో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్య లేదు. రెండేళ్ల తర్వాత ఆటలో తిరిగి వచ్చేందుకు ఎంతో శ్రమించాను. బాబు కు జన్మనిచ్చిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆట అర్ధాంతరంగా ఆగిపోయింది. కాబట్టి మళ్లీ టెన్నిస్ ఆడేందుకు నేను దేనికైనా సిద్ధమే. అయితే నా సమస్య ప్రయాణాలతోనే. ఎక్కడికి వెళ్లగలం, ఎలా సిద్ధం కాగలం. కాబట్టి ఇది చెప్పినంత సులువేమీ కాదు’ అని మీర్జా అభిప్రాయ పడింది. లాక్‌డౌన్‌తో అందరికీ కఠిన పరిస్థితి ఎదురైంది. అదృష్టవశాత్తూ నాకు అన్నీ ఉన్నాయి. తిండి, ఇల్లులేనివారి గురించి ఆలోచించాలి. కరోనా చాలా మంది జీవన విధానాన్ని మార్చింది. మనలో మళ్లీ మానవత్వం మేల్కొలిపేలా చేసింది. నేను చేసేదాని గురించి చెప్పుకోవడం నాకిష్టం లేదు. గత నెల రోజుల్లో సుమారు రూ. రెండున్నర కోట్లు సేకరించి లక్షలాది మందికి మేము భోజనాలు అందించాం. అయితే ఎంత చేసినా ఇది తక్కువే అవుతుందని నాకు తెలుసు. టెన్నిస్పరంగా చూస్తే సోమ్‌దేవ్ నేతృత్వంలో మా జూనియర్లకు సహాయం అందించే ప్రయత్నంలో ఉన్నాం. జర్మనీలో చిక్కుకుపోయిన యువ ఆటగాడు సుమీత్ నాగల్ దగ్గర డబ్బులు లేవు. వేర్వేరు మార్గాల ద్వారా అతడిని ఆదుకుంటున్నాం. కుటుంబ విషయానికి వస్తే మా అబ్బాయి ఇజ్హాన్ను టెన్నిస్ కోర్టులోకి తీసుకెళ్లడం మినహా ఏమీ చేయలేకపోతున్నాం. 17 నెలల బాబుకు నేను బయటకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కాదు కదా. -
చిన్నారుల కోసం సానియా మరో అకాడమీ
3 నుంచి 8 ఏళ్ల వారికి ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో అకాడమీని ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ అకాడమీని పూర్తిగా చిన్నారుల కోసమే తీర్చిదిద్దారు. ఇందులో మూడు నుంచి ఎనిమిదేళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. 2013లో తన పేరు మీద మొయినాబాద్‌లో సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)ని నెలకొల్పింది. ఇందులో ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరుప్రాయంలోనే ఆట నేర్చుకునే వారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్‌ఎమ్‌టీఏ గ్రాస్‌రూట్ లెవల్ అకాడమీని ఫిల్మ్ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో అందుబాటులోకి తెచ్చింది. ‘ఇప్పుడు ప్రొఫెషనల్స్‌గా కీర్తించబడుతున్న ఆటగాళ్లందరూ నాలుగైదేళ్లప్పుడే రాకెట్ పట్టారు. భారత్‌లోనూ తదుపరి సానియా, భూపతి, పేస్లు తయారవ్వాలంటే ఇలాంటి అకాడమీ ఒకటుండాలని మా కుటుంబం భావించింది. చాలామంది బాలబాలికలకు ఈ అకాడమీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశాం. ముందుగా ఇక్కడ సులువుగా ఆట వొంటబట్టించేందుకు సాఫ్ట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయిస్తాం’ అని సానియా వివరించింది. -
భాగ్యనగరంలో మహిళా టెన్నిస్ సందడి
నేటినుంచి ఫెడ్ కప్ టోర్నీ బరిలో 11 జట్లు భారత కెప్టెన్‌గా సానియా సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్ల క్రితం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంత నగరం హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్ హోదాలో మరోసారి ఆమె స్వస్థలంలో అభిమానులను అలరించబోతోంది. మంగళవారం నుంచి భాగ్యనగరంలో ప్రారంభం కానున్న ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో సానియా భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ నెల 18 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌తో పాటు మలేసియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్, ఇండోనేసియా, శ్రీలంక, పసిఫిక్ ఓషియానియా జట్లు పాల్గొంటున్నాయి. చివరి నిమిషంలో ఇరాక్ పోటీనుంచి తప్పుకోవడంతో బరిలో 11 జట్లు నిలిచాయి. ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. తమ గ్రూప్‌లోని ఇతర రెండు జట్లతో ఒక్కో జట్టు బెస్టాఫ్ త్రీ పద్ధతిలో (రెండు సింగిల్స్, ఒక డబుల్స్ కలిపి ఒక మ్యాచ్) తలపడుతుంది. ఆయా గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచిన నాలుగు జట్ల మధ్య రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తుది విజేతగా నిలిచే టీమ్ 2016లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్ 1 పోటీలకు అర్హత సాధిస్తుంది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. తొలి రోజు జరిగే పోటీల్లో భారత్ మ్యాచ్ లేదు. సానియా కెప్టెన్‌గా ఉన్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థనా తోంబరే, నటాషా పల్హా ఇతర సభ్యులు. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో టోర్నమెంట్ డెరైక్టర్ అశోక్ కుమార్, చీఫ్ రిఫరీ ఆండ్రీ కోర్నిలోవ్, వివిధ జట్ల సభ్యులు పాల్గొన్నారు. -
చైనాలోనూ సానియా ‘షో’
బీజింగ్: మూడు పదుల వయసు దాటిన భాగస్వామి దొరికినా... ఇద్దరి మధ్య మంచి సమన్వయం కుదిరితే... అద్భుత ఫలితాలు సాధించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది. వారం రోజుల వ్యవధిలో ఆమె వరుసగా రెండో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. 34 ఏళ్ల కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి 26 ఏళ్ల ఈ హైదరాబాదీ చైనా ఓపెన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ జోడి 6-2, 6-2తో వెరా దుషెవినా (రష్యా)-అరంటా సన్‌టోంజా (స్పెయిన్) ద్వయంపై విజయం సాధించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సానియా కెరీర్లో ఇది 19వ డబుల్స్ టైటిల్ కాగా... ఈ సీజన్లో ఐదోది కావడం విశేషం. మరోవైపు కారా బ్లాక్ కెరీర్లో ఇది 57వ టైటిల్. విజేతగా నిలిచిన సానియా జోడికి 2 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 78 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన సానియా-కారా బ్లాక్ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గతవారమే సానియా-కారా బ్లాక్ టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. పేస్ జోడికి షాక్ మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్) -డానియల్ నెస్టర్ (కెనడా) జోడి సెమీఫైనల్లో ఓడిపోయింది. పేస్-నెస్టర్ ద్వయం 6-3, 5-7, 8-10తో ఫాగ్నిని-సెప్పి (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
సెమీస్‌లో సానియా జోడి
బీజింగ్: చైనా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ టైటిల్‌కు ఇక రెండే అడుగుల దూరంలో నిలిచింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ 2-0తో వరుస సెట్లలో యంగ్ జాన్ చాన్-జి జెంగ్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఎనిమిదో సీడ్ భారత్-జింబాబ్వే జోడి 6-4, 6-1తో తైపీ జంటపై గెలుపొందింది. నాలుగు బ్రేక్ పాయింట్లను సాధించిన సానియా జంట ఆద్యంతం చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. సెమీఫైనల్లో సానియా-కారా ఇటలీకి చెందిన టాప్ సీడ్ రొబెర్టా విన్సీ-సారా ఎరానీలతో తలపడతారు.