చైనాలోనూ సానియా ‘షో’
బీజింగ్: మూడు పదుల వయసు దాటిన భాగస్వామి దొరికినా... ఇద్దరి మధ్య మంచి సమన్వయం కుదిరితే... అద్భుత ఫలితాలు సాధించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది. వారం రోజుల వ్యవధిలో ఆమె వరుసగా రెండో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. 34 ఏళ్ల కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి 26 ఏళ్ల ఈ హైదరాబాదీ చైనా ఓపెన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ జోడి 6-2, 6-2తో వెరా దుషెవినా (రష్యా)-అరంటా సన్‌టోంజా (స్పెయిన్) ద్వయంపై విజయం సాధించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
సానియా కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్ కాగా... ఈ సీజన్‌లో ఐదోది కావడం విశేషం. మరోవైపు కారా బ్లాక్ కెరీర్‌లో ఇది 57వ టైటిల్. విజేతగా నిలిచిన సానియా జోడికి 2 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 78 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన సానియా-కారా బ్లాక్ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గతవారమే సానియా-కారా బ్లాక్ టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే.
పేస్ జోడికి షాక్
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్) -డానియల్ నెస్టర్ (కెనడా) జోడి సెమీఫైనల్లో ఓడిపోయింది. పేస్-నెస్టర్ ద్వయం 6-3, 5-7, 8-10తో ఫాగ్‌నిని-సెప్పి (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది.