భాగ్యనగరంలో మహిళా టెన్నిస్ సందడి
నేటినుంచి ఫెడ్ కప్ టోర్నీ
బరిలో 11 జట్లు
భారత కెప్టెన్‌గా సానియా
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్ల క్రితం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంత నగరం హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్ హోదాలో మరోసారి ఆమె స్వస్థలంలో అభిమానులను అలరించబోతోంది. మంగళవారం నుంచి భాగ్యనగరంలో ప్రారంభం కానున్న ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో సానియా భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ నెల 18 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌తో పాటు మలేసియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్, ఇండోనేసియా, శ్రీలంక, పసిఫిక్ ఓషియానియా జట్లు పాల్గొంటున్నాయి. చివరి నిమిషంలో ఇరాక్ పోటీనుంచి తప్పుకోవడంతో బరిలో 11 జట్లు నిలిచాయి.
ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. తమ గ్రూప్‌లోని ఇతర రెండు జట్లతో ఒక్కో జట్టు బెస్టాఫ్ త్రీ పద్ధతిలో (రెండు సింగిల్స్, ఒక డబుల్స్ కలిపి ఒక మ్యాచ్) తలపడుతుంది. ఆయా గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచిన నాలుగు జట్ల మధ్య రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తుది విజేతగా నిలిచే టీమ్ 2016లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్ 1 పోటీలకు అర్హత సాధిస్తుంది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. తొలి రోజు జరిగే పోటీల్లో భారత్ మ్యాచ్ లేదు. సానియా కెప్టెన్‌గా ఉన్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థనా తోంబరే, నటాషా పల్హా ఇతర సభ్యులు. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో టోర్నమెంట్ డెరైక్టర్ అశోక్ కుమార్, చీఫ్ రిఫరీ ఆండ్రీ కోర్నిలోవ్, వివిధ జట్ల సభ్యులు పాల్గొన్నారు.