Fed Cup
-
ఫెడ్ కప్‌కూ సానియా దూరం!
న్యూఢిల్లీ: కాలి గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరి తొలి వారంలో జరిగే ఫెడ్ కప్ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు న్నాయి. ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, త్వర లోనే గాయాన్ని పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని సానియా తండ్రి ఇమ్రాన్ వెల్లడించారు. మరోవైపు ఫెడ్ కప్ వేదికను చైనా నుంచి కజకిస్తాన్‌కు మార్చినట్లు ఐటీఎఫ్ తెలిపింది. -
భారత బాలికలకు మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఫెడ్‌కప్ టోర్నమెంట్లో భారత బాలికల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. 9 నుంచి 16 స్థానాల కోసం జరుగుతున్న వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా మలేసియాతో శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో భారత్ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల 6–0, 6–0తో జె జువాన్ లిమ్ (మలేసియా)ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో సంజన ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. అయితే రెండో సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన భక్తి షా 2–6, 6–3, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో షరీఫా ఎల్సా (మలేసియా) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమం అయ్యింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 6–3, 6–10తో షరీఫా ఎల్సా–జాన్ నింగ్ లిమ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. -
భారత బాలికల జట్టుకు తొలి గెలుపు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టోర్నమెంట్లో భారత బాలికల జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్ ప్రస్తుతం 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల 6–2, 6–0తో జెస్సికా క్రిస్టా వీరా (ఇండోనేసియా)పై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన మరో అమ్మాయి భక్తి షా 6–1, 6–0తో నికెన్ ఫెరిలియానా (ఇండోనేసియా)ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధికాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సుదీప్త–భక్తి షా ద్వయం 6–2, 6–4తో జెస్సికా–నికెన్ జోడీని ఓడించింది. శుక్రవారం జరిగే మరో వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. -
భారత జట్టులో సంజన, భక్తి షా
సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్‌కప్ అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయిలు సంజన సిరిమల్ల, భక్తి షా చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ తెలంగాణ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు సుదీప్త సెంథిల్ కుమార్, నమితా బాల్ ఫెడ్‌కప్‌లో భారత్ తరఫున ఆడనున్నారు. గ్రూప్ ‘ఎ’ లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్ ‘ఎ’లో టాప్ సీడ్ ఆస్ట్రేలియా, ఐదో సీడ్ జపాన్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో థాయ్‌లాండ్, లెబనాన్, మలేసియా, చైనీస్ తైపీ... గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, హాంకాంగ్, పసిఫిక్ ఓసియానియా, చైనా... గ్రూప్ ‘సి’లో కొరియా, శ్రీలంక, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్ జట్లు చోటు దక్కించుకున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల అనంతరం ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. -
భారత్‌కు నాలుగో స్థానం
అస్తానా (కజకిస్తాన్): ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ ‘ఎ’లో భారత మహిళల టెన్నిస్ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 3–4 స్థానాల కోసం దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓడిపోయింది. గాయం కారణంగా కర్మన్ కౌర్ ఈ పోటీలో ఆడలేదు. ఆమె స్థానంలో జాతీయ చాంపియన్ మహెక్ జైన్‌ను బరిలోకి దించారు. తొలి సింగిల్స్‌లో మహెక్ 2–6, 6–3, 1–6తో నా రి కిమ్ చేతిలో ఓటమి పాలైంది. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 6–3, 6–3తో సునమ్ జియోంగ్ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 4–6, 4–6తో సు జియోంగ్ జాంగ్–నా రి కిమ్ జంట చేతిలో పరాజయం పాలైంది. -
అంకిత అదరగొట్టినా...
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసునుంచి భారత్ నిష్క్రమించింది. సింగిల్స్ విభాగంలో అంకితా రైనా తన అసాధారణ ప్రదర్శన కొనసాగించి మరో విజయం సాధించినా... జట్టుగా భారత్‌కు ఓటమి తప్పలేదు. గురువారం ఇక్కడ జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టెన్నిస్ టోర్నీలో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ పోరులో కజకిస్తాన్ 2–1తో భారత్‌పై గెలుపొందింది. బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన అంకిత... తన ధాటిని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకు క్రీడాకారిణి అంకిత 6–3, 1–6, 6–4తో 87వ ర్యాంకర్ యులియా పుటిన్త్సెవాను కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో భారత అమ్మాయిల వైఫల్యంతో జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో కర్మన్ కౌర్ థండి 3–6, 2–6తో జరీనా దియాస్ చేతిలో పరాజయం చవిచూసింది. చివరగా జరిగిన డబుల్స్‌లో అంకిత–ప్రార్థన తొంబారే జోడీ 0–6, 4–6తో జరీనా దియాస్–యులియా పుటిన్‌త్సెవా జంట చేతిలో ఓడింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో కొనసాగాలంటే గెలవాల్సిన తదుపరి మ్యాచ్‌లో భారత్... హాంకాంగ్‌తో తలపడనుంది. -
ఓటమితో మొదలు
న్యూఢిల్లీ: అంకిత రైనా సంచలన విజయం సాధించినప్పటికీ... ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భారత్‌కు శుభారంభం లభించలేదు. చైనాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ థండి 2–6, 2–6తో ప్రపంచ 125వ ర్యాంకర్ యఫాన్ వాంగ్ చేతిలో ఓటమి పాలైంది. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకర్ అంకిత రైనా 6–3, 6–2తో 120వ ర్యాంకర్ లిన్ జును బోల్తా కొట్టించడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 2–6, 6–7 (1/7)తో వాంగ్–జావోజువాన్ యాంగ్ జంట చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. -
ఫెడ్ కప్‌లో భారత్ బోణీ
హువా హిన్ (థాయ్‌లాండ్): రెండు వరుస పరాజయాల తర్వాత ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై నెగ్గింది. అంకిత రైనా సింగిల్స్, డబుల్స్‌లో గెలవడం టీమిండియాకు కలిసొచ్చింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 6-1, 6-1తో సబీనా షరిపోవాపై; రెండో సింగిల్స్‌లో అంకిత 6-1, 6-0తో నిజినా అబ్డురామివాపై గెలిచారు. డబుల్స్‌లో అంకిత-సానియా 6-2, 6-0తో అగుల్ అమన్మురదోవా-అరినా ఫోల్ట్స్పై గెలవడంతో భారత్ విజయం పరిపూర్ణమైంది. -
సానియా జంటకు షాక్
ఫెడ్ కప్‌లో మళ్లీ ఓడిన భారత్ హువా హిన్ (థాయ్‌లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. తొలి రోజు బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3తో ఓడిన టీమిండియా... రెండో రోజు గురువారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2తో ఓటమి పాలైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణి సానియా మీర్జా బరిలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రార్థన తొంబారే 2-6, 1-6తో ఎరి హోజుమి (జపాన్) చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6-3, 6-1తో నావో హిబినో (జపాన్)పై గెలిచింది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా-ప్రార్థన తొంబారే ద్వయం 5-7, 3-6తో షుకో అయోమా-ఎరి హోజుమి (జపాన్) జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. గతేడాది ఆగస్టు తర్వాత మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియాకు ఓటమి ఎదురవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఫెడ్ కప్ సారథిగా సానియా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఫెడ్ కప్‌కు టాప్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఫెడ్ కప్‌లో భాగంగా జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్ 1 పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు థాయ్‌లాండ్‌లో జరుగుతాయి. ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నలుగురు సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. సానియాతో పాటు నంబర్‌వన్ సింగిల్స్ క్రీడాకారిణి అంకితా రైనా, జాతీయ చాంపియన్ ప్రేరణ భాంబ్రి, ప్రార్థన తొంబరే, కర్మాన్ కౌర్ తండి జట్టులో ఉన్నారు. ఫిబ్రవరిలోనే గువాహటిలో జరిగే దక్షిణాసియా క్రీడల కోసం కూడా భారత జట్లను ఎంపిక చేశారు. -
ఫెడ్ కప్‌లో ఫిలిప్పీన్స్‌పై భారత్ విజయం
హైదరాబాద్: ఫెడరేషన్ కప్ టెన్నిస్ (ఆసియా/ఓషియానియా)లో ఫిలిప్పీన్స్ జట్టుపై భారత జట్టు విజయం సాధించింది. కీలక డబుల్స్‌లో హైదరాబాదీ, వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా తన సత్తా చూపింది. ఫైనల్స్‌లో 2-1 తేడాతో ఫిలిఫైన్స్పై ఇండియా జయభేరి మోగించింది. సింగిల్స్‌లో రెండు టీములకు చెరొక పాయింట్ వచ్చింది. డబుల్స్‌లో సానియా తన ప్రతిభను చూపి విజయం సాధించింది. -
భారత్ చేతిలో పాక్ చిత్తు
ఫెడ్ కప్‌లో ఘన విజయం బరిలోకి దిగని సానియా మీర్జా ఫెడ్ కప్‌లో భారత జట్టు అంచనాలను అందుకుంటూ శుభారంభం చేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో బలహీన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి అభిమానులకు ఆనందం పంచింది. అయితే విశ్రాంతి కోరుకున్న డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా బరిలోకి దిగకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. సాక్షి, హైదరాబాద్: ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) తొలి మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ పోరులో భారత్ రెండు సింగిల్స్‌తో పాటు డబుల్స్ మ్యాచ్‌నూ గెలుచుకుంది. సింగిల్స్‌లో ప్రార్థన తోంబరే, అంకితా రైనా గెలవగా. డబుల్స్‌లో ప్రార్థన-నటాషా జోడి విజయం సాధించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా సానియా... మ్యాచ్ ఆద్యంతం భారత ఆటగాళ్ల జోరు కొనసాగింది. కేవలం 50 నిమిషాల్లో ముగిసిన తొలి మ్యాచ్‌లో ప్రార్థన 6-1, 6-0తో సారా మన్సూర్‌పై ఘన విజయం సాధించగా...46 నిమిషాల్లోనే ముగిసిన రెండో సింగిల్స్‌లో భారత్ టాప్ సింగిల్స్ ప్లేయర్ అంకితా రైనా 6-0, 6-1తో ఉష్ణా సుహైల్‌ను చిత్తు చేసింది. అభిమానుల మద్దతుతో భారత యువ క్రీడాకారిణులు దూకుడు ప్రదర్శించారు. మైదానంలో వారు చురుగ్గా కదలగా, బయటినుంచి కెప్టెన్ సానియా మీర్జా పలు సూచనలు చేస్తూ తన జూనియర్లను ప్రోత్సహించింది. పాక్ ప్లేయర్లు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. డబుల్స్ మ్యాచ్ కూడా ఇదే తరహాలో సాగింది. నటాషా-ప్రార్థన జోడి 6-0, 6-4 తేడాతో ఇమాన్ ఖురేషీ-ఉష్ణా సుహైల్ జంటను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కూడా 54 నిమిషాలకే పరిమితమైంది. మలేసియాతో జరిగే మ్యాచ్‌లో కూడా సానియా సహాయక పాత్రకే పరిమితమవుతుందా? లేక మ్యాచ్ ఆడుతుందా చూడాలి. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో గ్రూప్‘ఎ’లో ఫిలిప్పీన్స్ 3-0తో సింగపూర్‌పై నెగ్గగా... గ్రూప్ ‘బి’లో తుర్క్మెనిస్తాన్ 3-0తో ఇరాన్‌పై గెలిచింది. గ్రూప్ ‘డి’లో పసిఫిక్ ఓషియానికా 3-0తో శ్రీలంకను ఓడించింది. -
భాగ్యనగరంలో మహిళా టెన్నిస్ సందడి
నేటినుంచి ఫెడ్ కప్ టోర్నీ బరిలో 11 జట్లు భారత కెప్టెన్‌గా సానియా సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్ల క్రితం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంత నగరం హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్ హోదాలో మరోసారి ఆమె స్వస్థలంలో అభిమానులను అలరించబోతోంది. మంగళవారం నుంచి భాగ్యనగరంలో ప్రారంభం కానున్న ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో సానియా భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ నెల 18 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌తో పాటు మలేసియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్, ఇండోనేసియా, శ్రీలంక, పసిఫిక్ ఓషియానియా జట్లు పాల్గొంటున్నాయి. చివరి నిమిషంలో ఇరాక్ పోటీనుంచి తప్పుకోవడంతో బరిలో 11 జట్లు నిలిచాయి. ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. తమ గ్రూప్‌లోని ఇతర రెండు జట్లతో ఒక్కో జట్టు బెస్టాఫ్ త్రీ పద్ధతిలో (రెండు సింగిల్స్, ఒక డబుల్స్ కలిపి ఒక మ్యాచ్) తలపడుతుంది. ఆయా గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచిన నాలుగు జట్ల మధ్య రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తుది విజేతగా నిలిచే టీమ్ 2016లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్ 1 పోటీలకు అర్హత సాధిస్తుంది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. తొలి రోజు జరిగే పోటీల్లో భారత్ మ్యాచ్ లేదు. సానియా కెప్టెన్‌గా ఉన్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థనా తోంబరే, నటాషా పల్హా ఇతర సభ్యులు. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో టోర్నమెంట్ డెరైక్టర్ అశోక్ కుమార్, చీఫ్ రిఫరీ ఆండ్రీ కోర్నిలోవ్, వివిధ జట్ల సభ్యులు పాల్గొన్నారు.