అంకితా రైనా
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసునుంచి భారత్ నిష్క్రమించింది. సింగిల్స్ విభాగంలో అంకితా రైనా తన అసాధారణ ప్రదర్శన కొనసాగించి మరో విజయం సాధించినా... జట్టుగా భారత్‌కు ఓటమి తప్పలేదు. గురువారం ఇక్కడ జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టెన్నిస్ టోర్నీలో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ పోరులో కజకిస్తాన్ 2–1తో భారత్‌పై గెలుపొందింది. బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన అంకిత... తన ధాటిని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది.
సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకు క్రీడాకారిణి అంకిత 6–3, 1–6, 6–4తో 87వ ర్యాంకర్ యులియా పుటిన్‌త్సెవాను కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో భారత అమ్మాయిల వైఫల్యంతో జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో కర్మన్ కౌర్ థండి 3–6, 2–6తో జరీనా దియాస్ చేతిలో పరాజయం చవిచూసింది. చివరగా జరిగిన డబుల్స్‌లో అంకిత–ప్రార్థన తొంబారే జోడీ 0–6, 4–6తో జరీనా దియాస్–యులియా పుటిన్‌త్సెవా జంట చేతిలో ఓడింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో కొనసాగాలంటే గెలవాల్సిన తదుపరి మ్యాచ్‌లో భారత్... హాంకాంగ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment