తనయుడు ఇజ్‌హాన్‌తో సానియా
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చీ రాగానే హోబర్ట్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో గాయంతో వెనుదిరిగినా... ఫెడ్ కప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలువడంతో, తొలిసారి ప్రపంచగ్రూప్‌నకు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించింది. సర్క్యూట్‌లో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్–19 కారణంగా టెన్నిస్ ఆగిపోయింది. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సానియా చెప్పింది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న తన ఆశలకు ఇది ఇబ్బందేనని వ్యాఖ్యానించింది.
‘నేను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు. నాలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించాను. ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ నాకు ప్రతికూలమే. అప్పటికి నా వయసు మరో ఏడాది పెరుగుతుంది. 2021 అంటే ఇంకా చాలా దూరం ఉంది. అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుంది. దానికి సమయం పట్టడం సహజం. టోర్నీలు, ఇందులో గెలుపోటములు ఉంటాయి. నేను ఆ స్థాయిలో ఆడేందుకు సిద్ధమై వచ్చాను. కానీ ఇప్పుడు అంతా మారిపోతుంది. ఆటలో లయ తప్పుతుంది. మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతా బాగైతే మళ్లీ ఆడతాను కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది’ అని సానియా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇకపై ఆట ఇలా ఉండదు...
కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనా ఇకపై అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని మాజీ వరల్డ్ నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్ వ్యాఖ్యానించింది. ‘కచ్చితంగా అంతా మారిపోతుంది. ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేను కానీ సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయం. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడతారేమో. ఇప్పటికే చాలా మారిపోతోంది. ఎందరినో కలుస్తాం కానీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేం. క్రీడలు కూడా చాలా మారిపోతాయి. ఎన్నో రకాల కొత్త ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు ఉన్నట్లుగా మాత్రం ఆటలు కనిపించవనేది ఖాయం’ అని సానియా వివరించింది.
ఏ దేశంలో ఆడగలం...
కరోనా కారణంగా ఇతర క్రీడలతో పోలిస్తే టెన్నిస్‌కు ఎక్కువ నష్టం జరుగుతోందని సానియా పేర్కొంది. మహమ్మారి తగ్గినా ఇప్పట్లో కోలుకోవడం అంత సులువు కాదని ఆమె చెప్పింది. ‘టెన్నిస్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఆడుతున్నారు. ఏ ఒక్క చోట అయినా కరోనా ఇంకా తగ్గలేదంటే దాని ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. మరో దేశానికి ప్రయాణం చేయలేకపోతే టోర్నీలు ఎలా జరుగుతాయి. ఇదే టెన్నిస్‌కు ప్రధాన సమస్య. రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్‌లో ఇది ఉండదు. భారత్‌లో, పక్కనే ఉన్న శ్రీలంకలో కరోనా ప్రభావం తగ్గిందంటే ఈ రెండు దేశాల మధ్య సిరీస్ నిర్వహించుకోవచ్చు. కానీ టెన్నిస్‌లో అది సాధ్యం కాదు. ఏదో మంత్రం వేసినట్లు కరోనా ఒక్కసారిగా అదృశ్యమైపోతే తప్ప రాబోయే కొన్ని నెలల్లో ఆటలు జరిగే అవకాశం లేదు’ అని ఈ హైదరాబాదీ విశ్లేషించింది.
ప్రేక్షకులు లేకున్నా ఓకే...
తాము ఆట ఆడేది ప్రేక్షకుల కోసమేనని, మైదానంలో వారు ఉత్సాహపరుస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పిన సానియా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆట జరిగితే చాలని కోరుకుంటోంది. ‘ఇంతకంటే ఏమీ చేయలేని పరిస్థితి మాది. వేరే ప్రత్యామ్నాయం లేదు కదా. టెన్నిస్ ఆడకుండా ఎలాగూ ఉండలేం. ప్రేక్షకులు లేకుండా టోర్నీలు ఆడటంలో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్య లేదు. రెండేళ్ల తర్వాత ఆటలో తిరిగి వచ్చేందుకు ఎంతో శ్రమించాను. బాబు కు జన్మనిచ్చిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆట అర్ధాంతరంగా ఆగిపోయింది. కాబట్టి మళ్లీ టెన్నిస్ ఆడేందుకు నేను దేనికైనా సిద్ధమే. అయితే నా సమస్య ప్రయాణాలతోనే. ఎక్కడికి వెళ్లగలం, ఎలా సిద్ధం కాగలం. కాబట్టి ఇది చెప్పినంత సులువేమీ కాదు’ అని మీర్జా అభిప్రాయ పడింది.
లాక్‌డౌన్‌తో అందరికీ కఠిన పరిస్థితి ఎదురైంది. అదృష్టవశాత్తూ నాకు అన్నీ ఉన్నాయి. తిండి, ఇల్లులేనివారి గురించి ఆలోచించాలి. కరోనా చాలా మంది జీవన విధానాన్ని మార్చింది. మనలో మళ్లీ మానవత్వం మేల్కొలిపేలా చేసింది. నేను చేసేదాని గురించి చెప్పుకోవడం నాకిష్టం లేదు. గత నెల రోజుల్లో సుమారు రూ. రెండున్నర కోట్లు సేకరించి లక్షలాది మందికి మేము భోజనాలు అందించాం. అయితే ఎంత చేసినా ఇది తక్కువే అవుతుందని నాకు తెలుసు. టెన్నిస్‌పరంగా చూస్తే సోమ్‌దేవ్ నేతృత్వంలో మా జూనియర్లకు సహాయం అందించే ప్రయత్నంలో ఉన్నాం. జర్మనీలో చిక్కుకుపోయిన యువ ఆటగాడు సుమీత్ నాగల్ దగ్గర డబ్బులు లేవు. వేర్వేరు మార్గాల ద్వారా అతడిని ఆదుకుంటున్నాం. కుటుంబ విషయానికి వస్తే మా అబ్బాయి ఇజ్‌హాన్‌ను టెన్నిస్ కోర్టులోకి తీసుకెళ్లడం మినహా ఏమీ చేయలేకపోతున్నాం. 17 నెలల బాబుకు నేను బయటకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కాదు కదా.
Comments
Please login to add a commentAdd a comment