![Indian archer Deepika Kumari turns to cooking - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/11/deepika-1.jpg.webp?itok=418uOvGe)
కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్ తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు కరోనా ‘శరా’ఘాతంలా తగిలింది. మెగా ఈవెంట్ ఏకంగా ఏడాదిపాటు వాయిదా పడటంతో వారి ప్రణాళిక మారిపోయింది. ఒలింపిక్స్‌కు సమయముంది కాబట్టి ఇక ముందుగా పెళ్ళికే వీరిద్దరు సిద్ధమైపోతున్నారు. భారత అగ్రశ్రేణి ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ గురించే ఇదంతా. వీరిద్దరి నిశ్చితార్థం జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వీరిద్దరు ఇప్పటికే అర్హత సాధించారు.
రాంచీకి చెందిన దీపిక, ప్రస్తుతం కోల్‌కతాలో దాస్‌తో కలిసే ఉంటోంది. ఇప్పుడు లభించిన విరామంలో ఆమె దృష్టి ప్రస్తుతం విల్లంబులకంటే వంటగదిపైనే ఉంది. ఇదే విషయాన్ని తాను చెప్పుకుంది. ‘ఇప్పటివరకు నాకు అన్నం, కొంత వరకు పప్పు వండటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ముఖ్యంగా చికెన్ వంటకాలంటే ఇష్టం. రాంచీ నుంచి మా అమ్మ ఆన్‌లైన్‌లో ఇవన్నీ నాకు నేర్పిస్తోంది. ప్రాణాయామంతో రోజు మొదలు పెడితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నా పని వంట నేర్చుకోవడమే’ అని దీపిక చెప్పింది.
దీపిక, అతాను దాస్ కలిసి ప్రస్తుతం తమ ఇంట్లోనే ఐదు మీటర్ల తాత్కాలిక రేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అసలు లక్ష్యంతో పోలిస్తే ఇది ఏమాత్రం లెక్కలోనికి రాదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఏమీ చేయలేం. ఒక రకంగా ఇది కంప్యూటర్ గేమ్‌లాంటిదే. కానీ కనీసం ఆర్చరీని మరచిపోకుండా ఇది గుర్తు చేస్తున్నట్లు, క్యాంప్ మొదలయ్యే సమయానికి ఆటపై ఆసక్తి పోకుండా ఉంచుతుందనేది మా నమ్మకం. కనీసం రెండు గంటల పాటు ఇలా సాధన చేస్తున్నాం’ అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఇప్పుడు కరోనా నుంచి అంతా సాధారణ స్థితికి మారగానే వివాహ ఏర్పాట్లు మొదలుపెడతామని వీరిద్దరు చెప్పారు. దీపిక 2012, 2016 ఒలింపిక్స్‌లలో, అతాను 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment