వివేకం చూపేనా... | Is new collector perfomes well? | Sakshi
Sakshi News home page

వివేకం చూపేనా...

Published Thu, Jul 28 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

వివేకం చూపేనా...

వివేకం చూపేనా...

కొత్త కలెక్టర్‌ ముందు అనేక సవాళ్లు
నేడు బాధ్యతలు స్వీకరించనున్న వివేక్‌యాదవ్‌
 
 
విజయనగరం గంటస్తంభం : వెనుకబడిన జిల్లాకు ఓ ఆశాదీపంలా... పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగల యువతేజంలా... ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించగల దక్షునిగా... కొత్త కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ జిల్లాకు వస్తున్నారు. ఇప్పటివరకూ వివిధ బాధ్యతలు చేపట్టినా... ఏకంగా జిల్లా కలెక్టర్‌గా ఇక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఈ తరుణంలో తనదైన ముద్రవేసుకోవడం సహజం... కొన్ని ఆశయాలతో రావడం సాధారణం... అవన్నీ జిల్లా పురోగతికి ఎంతైనా తోడ్పడాలని ఆశిద్దాం.
 
 
ముందస్తు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్‌గా నూతనంగా నియమితులైన వివేక్‌యాదవ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రస్తుత కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌వర్గాలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలిసారిగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనపై జిల్లా ప్రజల్లో సంతోషం నింపాల్సిన బాధ్యత ఉంది. 
 
సవాళ్ల స్వాగతం
కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనున్న వివేక్‌ యాదవ్‌కు జిల్లా వాసులతోపాటు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పరిపాలనలో లోపాలు మొదలుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వరకు ఇందులో ఉన్నాయి. ఆయన పనితీరుకు భోగాపురం ఎయిర్‌ఫోర్టు భూసేకరణ సవాల్‌ కానుంది. అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం ఇక్కడ 2004 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 750 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని చెబుతున్నా ఇందులో చాలామందిని బలవంతంగా ఒప్పించారు. పోనీ వీరు ఇచ్చినా మిగతావారు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. భూముల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతామని పదేపదే చెబుతున్నారు. ఈ పరిస్థితులను ప్రధానంగా అధిగమించాల్సి ఉంది.
 
 
పాలనలో సమన్వయం అవసరం
పాలనలో సమన్వయం కలెక్టర్‌కు పెద్ద సమస్యే. కలెక్టరేట్‌ పరిపాలనా విభాగంలో ఒక అధికారి వైఖరిపై కొంతమంది అసంతప్తిగా ఉన్నారు. దీనివల్ల అక్కడ వర్గపోరు నడుస్తోంది. జిల్లా అధికారుల్లో సైతం వర్గాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అందరూ అధికార పార్టీకి చెందినవారే అయినా... ఎవరి పట్టు వారికుంది... ఎవరి డిమాండ్‌ వారికుంది. వారితోపాటు బలమైన ప్రతిపక్షమూ ఉంది. వారందరినీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.
 
 
వెక్కిరిస్తున్న పెండింగ్‌ ప్రాజెక్టులు
జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. 2లక్షల ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు నుంచి గతేడాది నీరు విడుదల చేశారు. ఉప కాలువలు, బ్రాంచి కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్షా 20వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నా... అందుకు తగ్గ పనులు ఇంకా కొనసాగలేదు. తారకరామ తీర్ధసాగర్‌ పనులు ఇప్పటికి 35శాతం మాత్రమే పూర్తయ్యాయి. సొరంగం, ఇతర పనులు పూర్తయితేగానీ నీరు విడుదల సాధ్యం కాదు. ఒడిశాతో వివాదం, అసంపూర్తి పనుల వల్ల జంఝావతి ప్రాజెక్టు నుంచి అరకొర నీరే పోలాలకు అందుతోంది. ఈ ప్రాజెక్టుపైనా దష్టిసారించాలి.
 
 
అక్రమాల గుట్టలు
నీరు చెట్టు పథకం కింద సాగునీటి వనరుల అభివద్ధి, మొక్కల పెంపకానికి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రామభద్రపురం, మక్కువ, సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఇవి వెలుగులోకి వచ్చాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగిన అక్రమాలపై నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంకా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం, రెవెన్యూపరంగా ఉన్న లోపాలు, మీఇంటికి మీభూమి కార్యక్రమంలో లోటుపాట్లు, ఆన్‌లైన్‌ పట్టాదారుపాసుపస్తకాలు జారీలో జాప్యం వంటివి పరిష్కరించాల్సి ఉంది. 
 
 
స్మార్ట్‌పల్స్‌కు సాంకేతిక సమస్యలు
జిల్లాలో స్మార్ట్‌ పల్స్‌ సర్వే నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,87,149కుటుంబాలు ఉండగా ప్రారంభమై 20రోజలైనా 50వేల కుటుంబాల సర్వే కూడా పూర్తి కాలేదు. ఇంటర్నెట్‌ సమస్య, ప్రజలు నుంచి సహకారం లేకపోవడం వంటివి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రణాళికలు చేయకుంటే సర్వేకు ఎన్నో నెలలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకూ నిర్వహించిన బాధ్యతల కారణంగా వీటిపై పరిణితితో వ్యవహరించే వివేక్‌యాదవ్‌ ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపగలరన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement