తెనాలిటౌన్,న్యూస్‌లైన్: బాలల రక్షణ, హక్కుల గురించి మాట్లాడానికి వేదిక ‘బాలపంచాయత్’ అని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిల్లలను పంచాయతీలలో భాగస్వామ్యులను చేసి వారి ఆలోచనలను తెలుసుకోవాలన్నారు. కొలకలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో సోమవారం ‘బాలపంచాయత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ మనోహర్, బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్‌లెన్, యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో, ఏపీ ఆలయన్స్ చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌లు తొలుత లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షత వహించారు. తొలుత స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అమలులో వున్న ‘బాల పంచాయత్’ను మోడల్ ప్రాజెక్టుగా తెనాలిలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సమాజ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి 26 ప్రభుత్వ శాఖల ప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు.
బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్‌లెన్ మాట్లాడుతూ బాల పంచాయత్‌లో పిల్లల ఆలోచనలు తెలుసుకున్నట్లయితే వారికి కావలసినవి గుర్తించవచ్చన్నారు. యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో మాట్లాడుతూ పిల్లల్లో నిర్ణయాత్మక ఆలోచనలు పెరగడానికి బాల పంచాయత్ ఉపయోగపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ తొలిసారిగా రాష్ర్టంలో బాలపంచాయత్‌ను తెనాలి నియోజకవర్గంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి బాల పంచాయత్ ద్వారా జరుగుతుందన్నారు.
సీడ్స్ ప్రతినిధి, ప్రాజెక్టు నిర్వాహకులు రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు బాల పంచాయత్‌లో చర్చించి అధికారులు దృష్టికి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఆర్‌వీఎం శ్రీనివాసరావు, సర్పంచ్ కాలిశెట్టి లక్ష్మీ నాంచారమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, సీడీపీఓ సులోచన, తహశీల్దార్ ఆర్.వెంకటరమణనాయక్, స్పెషల్ ఆఫీసర్ జివి.నారాయణ, ఏఓ అమలకుమారి, ఏడీఈ ఆర్మ్‌స్ట్రాంగ్, ఏఈ కృష్ణారావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థులతో ‘బాల పంచాయత్’
కార్యక్రమం అనంతరం స్పీకర్ మనోహర్ పాఠశాల విద్యార్థులతో పంచాయతీ సభను ఏర్పాటు చేయించారు. విద్యార్థులను సర్పంచ్, సభ్యులుగా ఏర్పాటు చేసి సమస్యలను చెప్పించారు. రోడ్ల పై జీబ్రా క్రాసింగ్ లైన్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై చెత్త చెదారం వేస్తున్నారని, మందుబాబులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, సీసీఎల్ ఫ్యాక్టరీ రసాయన పదార్థాల వల్ల తాగునీరు కలుషితమైందని వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వాణి, భార్గవ్, ప్రదీప్, శిరీష్, మస్తాన్ వలీ, తదితరులు కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రోడ్ల మీద చెత్తాచెదారం శుభ్రం చేయించాలని సర్పంచ్ నాంచార మ్మకు సూచించారు. రూ. 1.25 కోట్లతో పాఠశాల భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. సీసీఎల్ నుంచి వచ్చే కలుషిత నీటిని పరిశీలించి దానిపై నివేదిక అందజేయాని ఆర్డీవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు.
‘బాల పంచాయత్’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
Published Tue, Dec 24 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement