ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేసిన నాదెండ్ల?
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా ఉన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైనా ఓడిపోవడం ఖాయం. దీంతో తెనాలి ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడం అసాధ్యమని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే సరిహద్దులోని నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారట. ఈసందర్భంగా మనోహర్కు ముందుగా ఖమ్మం జిల్లా గుర్తొచ్చిందట. ఎందుకంటే అక్కడి నుంచే గతంలో ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి గెలుపొందారు. పాత పరిచయాలతోపాటు.. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్తో పొత్తులు కూడా కలిసొస్తాయని భావించే మనోహర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
దాంతో పాటు ఖమ్మంలోని సామాజికవర్గాల పొందిక కూడా తనకు అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారట. తెలంగాణ ప్రాంత నేతలు కూడా మనోహర్ను గెలిపించుకుంటామంటూ అధిష్ఠానానికి చెప్పారని సమాచారం. అంతేకాదు.. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావును తెలంగాణకు తొలి గవర్నర్గా నియమించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.