nadendla bhaskara rao
-
భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బాబుకు కొత్తేమీ కాదు!
బంజారాహిల్స్: చంద్రబాబు.. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి రాబట్టుకోవడం ఇదేం కొత్త కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన తరువాత.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు తన భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచిన విషయాన్ని తామెవరూ మరచిపోలేదన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబును టీడీపీలో చేర్చుకోని పక్షంలో.. గర్భవతినైన తాను ప్రసవించేది లేదని భువనేశ్వరి బెట్టు చేసిందని.. అందుకే చంద్రబాబును పార్టీలోకి చేర్చుకున్నానని స్వయంగా ఎన్టీఆర్ తనతో చెప్పారని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, సీఎం జగన్ మాట్లాడిన మాటలను మూడు నాలుగుసార్లు విన్నానని, వారెవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించినట్లు తనకు కనబడలేదు.. వినబడలేదని అన్నారు. గతంలో అప్పుడప్పుడూ చంద్రబాబు తన ఇంటికి వచ్చేవాడని.. ఆ సమయంలో మామను దుర్బాషలాడే వాడని వివరించారు. సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లుగా నిన్నటి ఘటన అనిపించిందన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబును మించినవారు లేరని చెప్పారు. గతంలో టీడీపీకే చెందిన ఓ ఎమ్మెల్యే చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడని.. ఇది సభలో మాట్లాడింది కాదన్నారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఖర్చుల కోసం దాచుకున్న రూ.20 లక్షలు కూడా బ్యాంకు నుంచి ఆయనకు రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఒక రాత్రంతా ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలంటూ బాబు డబ్బులు కూడా పంపించినట్లు విమర్శలున్నాయని నాదెండ్ల చెప్పారు. -
‘తినటానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్ ఏడ్చారు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు భార్యను ఏమి అనలేదని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త నాదెండ్ల భాస్కరరావు అన్నారు. గతంలో టీడీపీలో చేరేందుకు చంద్రబాబు తన భార్య ద్వారా ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చాడని గుర్తు చేశారు. కూతురు కోసం ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ చెక్కులు పాస్‌కాకుండా చంద్రబాబు చేశాడని విమర్శించారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఏడ్చారని గుర్తు చేశారు. చదవండి: ‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’ చంద్రబాబు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని నాదెండ్ల అన్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ‘ఎన్టీఆర్‌కు తన పిల్లలు అన్నం కూడా పెట్టలేదు. తినడానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్ ఏడ్చారు. ఎన్టీఆర్ 20 లక్షల రూపాయలను చంద్రబాబు లాక్కున్నాడు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవద్దని ఎన్టీఆర్‌కు చెప్పాను. పార్టీలో చేరేందుకు చంద్రబాబు నా దగ్గరకు వచ్చాడు. ఎన్టీఆర్‌ను కూడా చంద్రబాబు దుర్భాషలాడాడు.’ అని నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. చదవండి: ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీ పార్వతి -
పౌరసత్వ చట్టం కొత్తది కాదు: మాజీ ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ చట్టం కొత్తది కాదు, సవరించిన కొత్త చట్టంతో ఎవరికి ఎటువంటి నష్టం చేకూరదు, అభూత కల్పనలు నమ్మవద్దని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు, లబ్థి పొందేందుకే.. పౌరసత్వ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ బిల్లుతో మతాలకు సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే పౌరసత్వ సవరణ బిల్లు చట్టమైందని, అనవసరంగా అపోహలు పెంచి దేశాన్ని కల్లోలం చేయవద్దని నాదెండ్ల విన్నవించారు. భారతీయ ముస్లింలకు హాని కలిగించేలా చట్టంలో ఏమి పొందుపరచలేదని పేర్కొన్నారు. దేశంలో ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు ఏవిధంగా ఉన్నాయో అలానే ఐడీ ఉంటే చాలు, ఎవరిని వెల్లగొట్టరు అని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో పౌరసత్వ సవరణ బిల్లును చించడంలో అర్ధం లేదన్నారు. -
మోదీ, అమిత్ షాలతో నాదెండ్ల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ఈ నెల 6న హైదరాబాద్‌లో అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ఎటువంటి పదవి కట్టబెట్టలేదు. నాదెండ్లతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి తదితరులు కూడా అదే రోజు బీజేపీలో చేరారు. కాగా, నాదెండ్ల కుమారుడు మనోహర్ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. -
బీజేపీలో చేరిన నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. దానిలో భాగంగా శనివారం (జూలై 6) దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళ సోని బీజేపీ సభ్యురాలిగా అమిత్‌షా సమక్షంలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలాఉండగా... చాన్నాళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చులకనగా చూడొద్దు... బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. ‘బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. పార్టీలో ఎన్నో గెలుపోటములు చూశాం. మమ్మల్ని చులకనగా చూసిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదు. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే మా లక్ష్యం. పేదలు మహిళలకోసం బడ్జెట్లో ఎన్నొ పథకాలు ప్రకటించాం. 2022 కల్లా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాం’అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన అనంతరం అమిత్‌షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. -
బిజేపీలోకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు
-
ఇద్దరు సీఎంలు ఆ గడ్డ నుంచే..
సాక్షి, అమరావతి బ్యూరో: వేమూరు నియోజకవర్గం రాజకీయ ఉద్ధండులకు ఖిల్లా. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిన డెల్టా ప్రాంతం. కృష్ణా తీరప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యానికి మారుపేరు. మొదట 1952లో అమృతలూరు నియోజకవర్గంగా ఉండేది. 1955లో అది వేమూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2004 వరకు జనరల్‌గా ఉన్న ఈ స్థానం 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీ అయింది. ఈ నియోజకవర్గంలో జన్మించిన ఇద్దరు సీఎంలుగా పనిచేయటం విశేషం. వేమూరుకు చెందిన కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఏపీలో మంత్రిగా పలు కీలక శాఖలను నిర్వహించడంతో పాటు సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్వగ్రామం కొల్లూరు మండలం దోనేపూడి. ఈయన 1983లో వేమూరు నుంచి ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు సీఎం పదవి నిర్వహించారు. 1955, 1962లో శాసనసభకు ఎన్నికైన కల్లూరి చంద్రమౌళి వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన వారు. ఈయన మంత్రిగా పనిచేశారు. యడ్లపాటి వెంకటరావు ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన ఈయన స్వగ్రామం అమర్తలూరు మండలం బోడపాడు. 1989లో శాసనసభకు ఎన్నికైన మాజీ మంత్రి అలపాటి ధర్మారావు ఈ నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అన్నవరపులంక గ్రామానికి చెందినవారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన చుండూరు మండలం యడవల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నియోజకవర్గంలోని దోనేపూడికి చెందినవారు. పునర్విభజనలో ఈ స్థానం రిజర్వుడు కావడంతో ఈయన తెనాలి నియోజకవర్గానికి మారారు. ప్రస్తుతం వేమూరు స్థానం నుంచి నక్కా అనందబాబు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరపున ప్రస్తుతం మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మేరుగ నాగార్జున పోటీలో ఉన్నారు. -
చంద్రబాబుని కొట్టబోయిన చెన్నారెడ్డి
అన్నవరం (ప్రత్తిపాడు): సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ నాటి ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు ఉందని ‘యూట్యూబ్ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది వాస్తవమేనా’ అని ప్రశ్నించగా నిజమేనన్నారు. ఎన్టీఆర్ గురించి చెప్పినవన్నీ వాస్తవాలే ఇటీవల కొన్ని టీవీ చానెల్స్‌లో ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉన్నానని నాదెండ్ల స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానేనని తేల్చిచెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తన మంత్రి పదవిని ఎన్టీఆర్ తీసేస్తే ఆయన సీఎం పదవిని తాను తీసేశానని తెలిపారు. ఈ విషయంలో తనపై 30 ఏళ్లుగా చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, లేకుంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పారు. బీసీలకు ఏదో చేసేస్తానని చెబుతున్న చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నికైన ఏకైక బీసీ ప్రధాని మోదీని పదవి నుంచి దించేయాలని ఎందుకు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దును చంద్రబాబు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబేనని, ఇప్పుడు అడ్డగోలుగా విభజించారని అంటున్నదీ ఆయనేనని మండిపడ్డారు. తనను విలన్‌గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
‘ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా’
సాక్షి, తూర్పు గోదావరి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సభలు పెట్టి బీసీలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ వెళ్లి ‘ నేను లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద’ని అక్కడ మాట్లాడి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) పెట్టి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ ఒక్కసారీ తప్ప..
అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందే అభ్యర్థికి చెందిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పార్టీలు నమ్ముతాయి. ఒక్క 2009 ఎన్నికల్లో తప్ప ప్రతిసారి ఇదే సెంటిమెంట్ పునరావృతమైంది. 1962 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో మాత్రం అచ్చంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు గెలుపొందారు. కానీ, రాష్ట్రంలో మాత్రం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది తప్ప మిగతా అన్నిసార్లు ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సెంటిమెంటును బలంగా నమ్ముతున్న స్థానిక పార్టీలు.. అచ్చంపేటలో తమ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ‘నెల’ మంత్రి ‘నెలరాజు’ అంటే చంద్రుడని తెలుసు. మరి, ‘నెల మంత్రి’ అంటే.. ఇది చదవండి. హైదరాబాద్‌కు చెందిన రామస్వామి 1983లో మహరాజ్‌గంజ్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆ పార్టీలో సంక్షోభం తలెత్తడంలో ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. నాదెండ్ల మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో నాదెండ్ల ప్రభుత్వం నెల రోజులు మాత్రమే మనుగడలో ఉంది. ఆ తరువాత ప్రభుత్వం మారడంలో రామస్వామి మంత్రి పదవి కోల్పోయారు. దీంతో ఆ రోజుల్లో రామస్వామిని హైదరాబాద్‌లో అందరూ ‘నెల రోజుల మంత్రి’ అని పిలిచేవారట. -
ఎన్టీఆర్ బయోపిక్ : నాదెండ్ల కుటుంబం నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘యన్.టి.ఆర్’. చిత్రంపై నాదెండ్ల కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది. -
ఎన్టీఆర్ బయోపిక్: నాదెండ్లగా సచిన్
సాక్షి, ముంబై: ఎన్టీఆర్ బయోపిక్కు సంబంధించి ఓ ముఖ్యమైన అప్ డేట్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక జరిగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు పాత్ర కోసం సచిన్ ఖేద్కర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ప్రకటించటం విశేషం. మరాఠీ నటుడైన సచిన్ పలు బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో కూడా నటించారు. జనతా గ్యారేజ్, నేను లోకల్ చిత్రాలతో తెలుగువారికి ఆయన సుపరిచితుడే. 1985లో టీడీపీలో తిరుగుబాటు జెండా ఎగరేసిన నాదెండ్ల, ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి గద్దె దింపిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ను చిత్రంలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ చిత్ర డైరెక్టర్, నటీనటులు, టెక్నీషియన్ల విషయంలో మేకర్లు ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఎన్టీఆర్ బయోపిక్‌లో లింగం మామ..?
నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారన్న వార్త తప్ప ఇతర నటీనటుల వివరాలేవీ ప్రకటించలేదు. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కథలో కీలకమైన నాదెండ్ల భాస్కరరావు పాత్రకు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. తెలుగులో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న పరేష్ రావల్.. శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలోని లింగం మామ పాత్రతో టాలీవుడ్ లో మరింతగా పాపులర్ అయ్యారు. చాలా కాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయనను ఎన్టీఆర్ బయోపిక్ కోసం సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ పాత్రలో నటించేందుకు పరేష్ రావల్ అంగీకరిస్తారో లేదో చూడాలి. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలతో కలిసి నిర్మిస్తున్నారు. -
వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు
♦ మనసులో మాట ► కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సొంతమామను నిలువునా ముఖ్యమంత్రి పదవినుంచి తన్ని తగిలేయడం జగజ్జంత్రీలకే సాధ్యపడుతుంది కానీ మామూలు మనుషులకు సాధ్యపడదని, చంద్రబాబు ఆ కోవలో వాడే కాబట్టి సులభంగా రామారావు గోచీ లాగిపడేశాడని మాజీ ముఖ్యమంత్రి, నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. రామారావును వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే కానీ తనది కాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసు మొత్తానికి బాబే బాధ్యుడని, నేనే లాయర్‌గా ఉండి. ఇలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడినని నాదెండ్ల పేర్కొన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ఎవర్నో ఒకర్ని పట్టేసి తాత్కాలికంగా తప్పుకునే సామర్థ్యం ఉంది కాబట్టే బాబు జగజ్జంత్రీలకు జగజ్జంత్రి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌కు 70 మార్కులు పడితే, ఏపీలో బాబు పాలనకు జీరో మార్కులే పడతాయన్నారు. బడుగు బలహీనవర్గాల్లో వైఎస్సార్సీపీ అద్యక్షుడు జగన్ పట్ల మోజు ఉందని, వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తారని చెబుతున్న నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ♦ రాజకీయాల్లో మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిలయ్యారా? ఫెయిలయినట్లే లెక్క. ఒక పార్టీని పెట్టి రాష్ట్రానికి ఎన్నో చేయాలనే భావాలతో ముందుకు వచ్చిన మనిషిని నేను. కానీ బ్రేక్ పడింది. దానికి కారణం నేను కావచ్చు. స్నేహితులు కావచ్చు. నన్ను అభిమానించే వారు కావచ్చు.. ♦ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు కదా, ఆయనలేనిదే మీరెక్కడున్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టడమేమిటి? చాలా విచిత్రంగా ఉందిది. ఇలా పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని అప్పట్లోనే ఎన్టీఆర్‌ని పత్రికలవారు అడిగారు. నా ఆలోచనేంటి.. అంతా నాదెండ్ల భాస్కరరావు మెదడులో పుట్టింది అన్నారాయన. అవునా కాదా? ఆరోజు కాంగ్రెస్ మీద జనాలకు ఉన్న ద్వేషాన్ని అలా టర్న్ చేశారు అంతే. ఆరోజు పార్టీకి చేసిందంతా నేను. కథానాయకుడిని నేను. ఆయన కథానాయకుడు కావడమేంటి? తొందరపడి కథానాయకుడి పాత్ర ఆయనకు ఇచ్చాను. ఎన్టీఆర్ క్రెడిట్ పొందడానికి కారణం ప్రజలు. ప్రజలకు సినిమా మోజు ఎక్కువ. ఆ మోజుతో జనం అటుగా మొగ్గారు. దానికి మీ మీడియా వాళ్లు మరికాస్త సెగపెట్టారు. ♦ ఏదేమైనా ఎన్టీఆర్ గ్లామర్ ముందు మీరు ఎలా నిలబడగలుగుతారు? ఒకటి చెప్పండి. ఎన్టీఆర్ నా ఇంటికి వచ్చాడా, నేను ఎన్టీఆర్ ఇంటికెళ్లానా? ఇక్కడే తేలిపోతుంది వ్యవహారం. కానీ జనం గ్లామర్‌నే చూశారు. తానేమో రాముడు, కృష్ణుడు, భీముడు అంటూ పాత్రల్లో నటించాడు. జనంకి అవే గుర్తుంటాయి కానీ, జక్కా గాడిని నేనెలా గుర్తుంటాను? నా వద్ద ఉన్నవారు ఆరోజు ఎన్టీఆర్‌ని పార్టీ ప్రెసిడెంటుగా ఒప్పుకోలేదు. మేమే అందరినీ ఒప్పించి తననే ప్రెసిడెంటుగా ప్రకటించాం. ♦ ఎన్టీఆర్‌ని పడగొట్టడంలో బాబు సక్సెస్ అయ్యాడు.. మీరు ఫెయిలయ్యారు కదా? బాబుకు అనుకూలత ఏమిటంటే. రామారావు ఇంట్లో తిన్నాడు. ఇంట్లో వాసాలు లెక్కెట్టాడు. దగ్గరున్నోడికి గోసి లాగడం ఈజీ. దూరంగా ఉన్నవాడిని గోసి ఎలా లాగగలుగుతాను. నా గోచినే వాళ్లు లాగేశారు. నేనెట్లా లాగుతాను. ఇంట్లో తిన్నవాడికి తిన్న వాసాలు లెక్కపెట్టడం తేలిక. రామారావును వెన్నుపోటు పొడిచిందే బాబు. నేనెప్పుడూ వెన్నుపోటు పొడవలేదు. ♦ ఎన్టీరామారావు పాలనపై మీ అభిప్రాయం? ఎన్టీరామారావు పాలనేంటి? చేసిందంతా నేనయితే. ఎన్టీరామారావు పరిపాలకుడు అంటే ఎంత తప్పు. రాయలసీమ రైతు కెనాల్ అని పేరు పెడతాం అని ప్రతిపాదించారు. కానీ ఎన్టీఆర్ దానికి తెలుగు గంగ అని పేరెట్టారు. దానికీ దీనికీ తేడా అర్థమయిందా? ఇంకొక విషయం తెలుగు గంగ కాలువ తవ్వడానికి 12 వందల కోట్లు అవుతుందా.. ఒక పదివేల తట్టలు, పదివేల పారలు కొనేసేయి. నా అభిమానులు వస్తారు. కాలువ తవ్విపడేస్తారు అనేవాడు ఎన్టీఆర్. ఇదీ ఆయన అడ్మినిస్ట్రేషన్. ♦ విభజన సమయంలో బాబు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చేశారు కదా? లెటర్ ఏమిటి? చిదంబరం వద్ద రెండు ఉత్తరాలు ఇచ్చి వచ్చాడు. రహస్యంగా కలిసి తెలంగాణ ఇచ్చేయండి అని చెప్పేశాడు బాబు. కానీ ఏపీ శాసనసభలో విభజనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా మాట్లాడలేదు. అంతకుముందు అసెంబ్లీలో మీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం జరగదు. నాకివ్వండి విభజన ఎలా చేయాలో చేసి చూపిస్తా అని బాబు నేరుగా అడిగేశారు. తీరా ఏపీ అసెంబ్లీలో విభజన తీర్మానంపై స్పీకర్ రెండు మూడు సార్లు పిలిస్తే బాబు రాకుండా దాక్కునేశాడు. ఇదేం రాజకీయం! ♦ కేసీఆర్‌కు, చంద్రబాబుకు పాలనలో ఎన్ని మార్కులిస్తారు? కేసీఆర్‌కు పాలనలో 70 మార్కులు వస్తే, బాబు పాలనకు జీరోనే. బాబు పాలన గురించి మాట్లాడేటంత తెలివి తక్కువ ఇంటలెక్చువల్ని కాదు నేను. ♦ పోలవరం ప్రాజెక్టు గురించి చాలా చేసేస్తున్నానని బాబు చెబుతున్నారే? పోలవరమా.. దాన్ని బాబు కట్టేదేమిటి? రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు అది. దాన్ని మేం తీసుకుంటాం. మా సూపర్వైజ్ కింద చేపడతాం అన్నారు. కేంద్రమే తీసుకుంటే టీడీపీ కాంట్రాక్టర్లు మునిగిపోతారు కదా. మరి ఇంట్లో సంసారం కూడా నడవాలిగా. మీరేం కట్టొద్దు. మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటాం అని బాబు కేంద్రాన్ని అడిగారంటేనే ఇది ఎవరి మేలుకోసమో అర్థమవుతుంది. కేంద్రం పంపే డబ్బుతో కాంట్రాక్టర్లను గుప్పెట్లో పెట్టుకోవచ్చు కదా. ♦ పింఛన్లు ఇస్తున్నా.. రుణమాఫీ చేసేస్తున్నా.. అంటున్నారే బాబు? అన్నీ మీ పేపర్లలో వస్తాయంతే. రాష్ట్రంలో ఏదో ఒక ఊరికి బాబును రమ్మనండి. నేనూవస్తాను. ఏ ఊళ్లో మాఫీలు చేసాడో, ఇంకా ఏమేం చేశాడో అక్కడే తేలిపోతుంది. పది మంది రైతుల్ని పిలిపిద్దాం. ఎక్కువమందిని పిలిపిస్తే కచ్చితంగా మనల్ని జనం కొట్టేస్తారు. మీకు ఏయే మేళ్లు చేశారో చెప్పండి అని అడుగుదాం. అక్కడే తేలిపోతుంది. ♦ ఓటుకు కోట్లు కేసులో బాబు పరిస్థితి ఏంటి? బాబు అడ్డంగా దొరికిపోయాడు. ప్రత్యక్షంగా అతడే ఈ కేసు మొత్తానికి బాధ్యుడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కదా. నేనే లాయర్‌గా ఉండి అలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడిని. ♦ బ్రహ్మ దేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆర్ తర్వాత చప్పబడిపోయాడు కదా? అవును మరి. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్సయ్యారు. హైదరాబాద్ వదిలిపెట్టి పోకపోతే కేసు పెడతాను అన్నాడు కేసీఆర్. బాబు వెళ్లిపోయాడు. రాజీ కుదిరిపోయింది. బాబు ఎప్పటికప్పడు ఎవర్నో ఒకరిని పట్టేసి తప్పుకుంటున్నారు. అందుకే బాబు జగజ్జంత్రీ. ♦ తెలంగాణలో విపక్షం, ఆంధ్రాలో విపక్షం వీటి పనితీరు ఎలా ఉంది? తెలంగాణలో విపక్షం సమర్థంగా పనిచేయడం లేదు. అదే ఆంధ్రాలో విపక్షం బాగా పనిచేస్తోంది. ప్రతిపక్ష నేతగా జగన్ బాగా పేరుకొచ్చాడు. జనంలో కూడా జగన్ పట్ల మోజు ఉంది. ఒక చాన్స్ ఇద్దాం అనే భావం ఏర్పడిందని స్వయంగా తెలుసుకున్నాను. ♦ వచ్చే ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణలో గెలుపెవరిదంటారు? పబ్లిక్‌లో జగన్ పట్ల సానుభూతి ఉంది. వచ్చే ఎన్నికల్లో అతడు గెలుస్తాడని నాకు నమ్మకం. గెలవాలి కూడా. ఏపీలో గెలిచే అవకాశం జగన్‌కే ఉంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి అటూఇటూగా ఉంది కానీ తెలంగాణ ఫీలింగ్ మాత్రం జనంలో ఇప్పటికీ ఉంది. ఇక ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరోనే. (నాదెండ్లతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Lf2mV3 https://goo.gl/sNDbJz -
'ప్రస్తుతం స్పందించలేను'
హైదరాబాద్: ఓటు వేయమనే భావన మంచిది కాదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని కోరారు. కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రస్తుతం స్పందిచలేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీడియాను పిలిచి మాట్లాడతానని అన్నారు. -
ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేసిన నాదెండ్ల?
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా ఉన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైనా ఓడిపోవడం ఖాయం. దీంతో తెనాలి ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడం అసాధ్యమని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సరిహద్దులోని నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారట. ఈసందర్భంగా మనోహర్‌కు ముందుగా ఖమ్మం జిల్లా గుర్తొచ్చిందట. ఎందుకంటే అక్కడి నుంచే గతంలో ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి గెలుపొందారు. పాత పరిచయాలతోపాటు.. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్తో పొత్తులు కూడా కలిసొస్తాయని భావించే మనోహర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దాంతో పాటు ఖమ్మంలోని సామాజికవర్గాల పొందిక కూడా తనకు అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారట. తెలంగాణ ప్రాంత నేతలు కూడా మనోహర్‌ను గెలిపించుకుంటామంటూ అధిష్ఠానానికి చెప్పారని సమాచారం. అంతేకాదు.. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావును తెలంగాణకు తొలి గవర్నర్‌గా నియమించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
పాపిష్టి పనులకు కేరాఫ్ చంద్రబాబే!
హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంట నీరు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘ స్పీకర్ రాజ్యాంగ బద్ధుడు. రాష్ట్రపతి, గవర్నర్ తరహాలో స్పీకర్ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారు. రాష్ట్రపతి పంపిన నోట్‌ను స్పీకర్‌గా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆయన విధి. అసలు ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు’ అని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు సమన్యాయం అంటున్నాడని.. సమన్యాయం అంటే కృష్ణా నదిని ఆ పక్కనుంచి ఈ పక్కకు రెండుగా చీల్చి సమంగా పంచుతారా? అని ప్రశ్నించారు. -
పాపిష్టి పనులకు కేరాఫ్ బాబే! :నాదెండ్ల భాస్కరరావు
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. టీడీపీ ఎన్టీఆర్దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టికెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. బుధవారం తన నివాసంలో భాస్కరరావు విలేకరులతో మాట్లాడారు. డీల్ కుదుర్చుకున్నారని స్పీకర్‌ను విమర్శిస్తున్న బాబుకే డీల్స్ వ్యవహారం బాగా తెలుసునన్నారు. చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘రాష్ట్రపతి పంపిన నోట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం స్పీకర్ విధి. ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు’ అని చెప్పారు. ‘ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చినప్పుడు 95 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిస్తే నేను సీఎం అయ్యాను. వారిని నేను బలవంతపెట్టలేదు. ఎమ్మెల్యేలను దాచింది నువ్వు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ బిల్లులో పస లేదని, విభజన జరగదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉందన్నారు. విభజనను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో నేతలను కలవడం మంచి పరిణామమని భేటీ అనంతరం విలేకరులతో ఇష్టాగోష్టిలో భాస్కరరావు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మినీ ఇండియా వంటిదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అభివర్ణించారు. నాంపల్లి గాంధీభవన్ ప్రకాశం హాలులో నేషనల్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల పాకిస్థాన్ సైనికుల చేతిలో మృతి చెందిన అమర సైనికుడు ఫిరోజ్‌ఖాన్ సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఫిరోజ్‌ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ సమైక్యతా కమిటీ అధ్యక్షుడు ఎస్కే.అఫ్జలుద్దీన్, పీసీసీ కార్యదర్శి ఎస్.బాలపోచయ్య, భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ స్వరవ ర్షిణి రాజేందర్‌రెడ్డి, సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సభ్యులు ఖలీఖుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.