![Nadendla bhaskara rao comments on Chandrababu naidu - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/21/nadenla.jpg.webp?itok=RMVU2W5E)
బంజారాహిల్స్: చంద్రబాబు.. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి రాబట్టుకోవడం ఇదేం కొత్త కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన తరువాత.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు తన భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచిన విషయాన్ని తామెవరూ మరచిపోలేదన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబును టీడీపీలో చేర్చుకోని పక్షంలో.. గర్భవతినైన తాను ప్రసవించేది లేదని భువనేశ్వరి బెట్టు చేసిందని.. అందుకే చంద్రబాబును పార్టీలోకి చేర్చుకున్నానని స్వయంగా ఎన్టీఆర్ తనతో చెప్పారని వెల్లడించారు.
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, సీఎం జగన్ మాట్లాడిన మాటలను మూడు నాలుగుసార్లు విన్నానని, వారెవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించినట్లు తనకు కనబడలేదు.. వినబడలేదని అన్నారు. గతంలో అప్పుడప్పుడూ చంద్రబాబు తన ఇంటికి వచ్చేవాడని.. ఆ సమయంలో మామను దుర్బాషలాడే వాడని వివరించారు. సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లుగా నిన్నటి ఘటన అనిపించిందన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబును మించినవారు లేరని చెప్పారు.
గతంలో టీడీపీకే చెందిన ఓ ఎమ్మెల్యే చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడని.. ఇది సభలో మాట్లాడింది కాదన్నారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఖర్చుల కోసం దాచుకున్న రూ.20 లక్షలు కూడా బ్యాంకు నుంచి ఆయనకు రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఒక రాత్రంతా ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలంటూ బాబు డబ్బులు కూడా పంపించినట్లు విమర్శలున్నాయని నాదెండ్ల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment