వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు | Special Interview With AP Ex CM Nadendla Bhaskara Rao | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు

Published Wed, Jun 28 2017 12:24 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు - Sakshi

వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు

♦ మనసులో మాట
► కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు

సొంతమామను నిలువునా ముఖ్యమంత్రి పదవినుంచి తన్ని తగిలేయడం జగజ్జంత్రీలకే సాధ్యపడుతుంది కానీ మామూలు మనుషులకు సాధ్యపడదని,  చంద్రబాబు ఆ కోవలో వాడే కాబట్టి సులభంగా రామారావు గోచీ లాగిపడేశాడని మాజీ ముఖ్యమంత్రి, నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. రామారావును  వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే కానీ తనది కాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసు మొత్తానికి బాబే  బాధ్యుడని, నేనే లాయర్‌గా ఉండి. ఇలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడినని నాదెండ్ల పేర్కొన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా  ఎవర్నో ఒకర్ని పట్టేసి తాత్కాలికంగా తప్పుకునే సామర్థ్యం ఉంది కాబట్టే బాబు జగజ్జంత్రీలకు జగజ్జంత్రి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌కు 70  మార్కులు పడితే, ఏపీలో బాబు పాలనకు జీరో మార్కులే పడతాయన్నారు. బడుగు బలహీనవర్గాల్లో వైఎస్సార్సీపీ అద్యక్షుడు జగన్‌ పట్ల మోజు ఉందని, వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తారని చెబుతున్న నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

♦ రాజకీయాల్లో మీరు సక్సెస్‌ అయ్యారా, ఫెయిలయ్యారా?
ఫెయిలయినట్లే లెక్క. ఒక పార్టీని పెట్టి రాష్ట్రానికి ఎన్నో చేయాలనే భావాలతో ముందుకు వచ్చిన మనిషిని నేను. కానీ బ్రేక్‌ పడింది. దానికి కారణం నేను కావచ్చు. స్నేహితులు కావచ్చు. నన్ను అభిమానించే వారు కావచ్చు..

♦ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు కదా, ఆయనలేనిదే మీరెక్కడున్నారు?
ఎన్టీఆర్‌ పార్టీ పెట్టడమేమిటి? చాలా విచిత్రంగా ఉందిది. ఇలా పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని అప్పట్లోనే ఎన్టీఆర్‌ని పత్రికలవారు అడిగారు. నా ఆలోచనేంటి.. అంతా నాదెండ్ల భాస్కరరావు మెదడులో పుట్టింది అన్నారాయన. అవునా కాదా?  ఆరోజు కాంగ్రెస్‌ మీద జనాలకు ఉన్న ద్వేషాన్ని అలా టర్న్‌ చేశారు అంతే. ఆరోజు పార్టీకి చేసిందంతా నేను. కథానాయకుడిని నేను. ఆయన కథానాయకుడు కావడమేంటి? తొందరపడి కథానాయకుడి పాత్ర ఆయనకు ఇచ్చాను. ఎన్టీఆర్‌ క్రెడిట్‌ పొందడానికి కారణం ప్రజలు. ప్రజలకు సినిమా మోజు ఎక్కువ. ఆ మోజుతో జనం అటుగా మొగ్గారు. దానికి మీ మీడియా వాళ్లు మరికాస్త సెగపెట్టారు.

♦ ఏదేమైనా ఎన్టీఆర్‌ గ్లామర్‌ ముందు మీరు ఎలా నిలబడగలుగుతారు?
ఒకటి చెప్పండి. ఎన్టీఆర్‌ నా ఇంటికి వచ్చాడా, నేను ఎన్టీఆర్‌ ఇంటికెళ్లానా? ఇక్కడే తేలిపోతుంది వ్యవహారం. కానీ జనం గ్లామర్‌నే చూశారు. తానేమో రాముడు, కృష్ణుడు, భీముడు అంటూ పాత్రల్లో నటించాడు. జనంకి అవే గుర్తుంటాయి కానీ, జక్కా గాడిని నేనెలా గుర్తుంటాను? నా వద్ద ఉన్నవారు ఆరోజు ఎన్టీఆర్‌ని పార్టీ ప్రెసిడెంటుగా ఒప్పుకోలేదు. మేమే అందరినీ ఒప్పించి తననే ప్రెసిడెంటుగా ప్రకటించాం.

♦ ఎన్టీఆర్‌ని పడగొట్టడంలో బాబు సక్సెస్‌ అయ్యాడు.. మీరు ఫెయిలయ్యారు కదా?
బాబుకు అనుకూలత ఏమిటంటే. రామారావు ఇంట్లో తిన్నాడు. ఇంట్లో వాసాలు లెక్కెట్టాడు. దగ్గరున్నోడికి గోసి లాగడం ఈజీ. దూరంగా ఉన్నవాడిని గోసి ఎలా లాగగలుగుతాను. నా గోచినే వాళ్లు లాగేశారు. నేనెట్లా లాగుతాను. ఇంట్లో తిన్నవాడికి తిన్న వాసాలు లెక్కపెట్టడం తేలిక. రామారావును వెన్నుపోటు పొడిచిందే బాబు. నేనెప్పుడూ వెన్నుపోటు పొడవలేదు.

♦ ఎన్టీరామారావు పాలనపై మీ అభిప్రాయం?
ఎన్టీరామారావు పాలనేంటి? చేసిందంతా నేనయితే. ఎన్టీరామారావు పరిపాలకుడు అంటే ఎంత తప్పు. రాయలసీమ రైతు కెనాల్‌ అని పేరు పెడతాం అని ప్రతిపాదించారు. కానీ ఎన్టీఆర్‌ దానికి తెలుగు గంగ అని పేరెట్టారు. దానికీ దీనికీ తేడా అర్థమయిందా? ఇంకొక విషయం తెలుగు గంగ కాలువ తవ్వడానికి 12 వందల కోట్లు అవుతుందా.. ఒక పదివేల తట్టలు, పదివేల పారలు కొనేసేయి. నా అభిమానులు వస్తారు. కాలువ తవ్విపడేస్తారు అనేవాడు ఎన్టీఆర్‌. ఇదీ ఆయన అడ్మినిస్ట్రేషన్‌.

♦ విభజన సమయంలో బాబు తెలంగాణకు అనుకూలంగా లెటర్‌ ఇచ్చేశారు కదా?
లెటర్‌ ఏమిటి? చిదంబరం వద్ద రెండు ఉత్తరాలు ఇచ్చి వచ్చాడు. రహస్యంగా కలిసి తెలంగాణ ఇచ్చేయండి అని చెప్పేశాడు బాబు. కానీ ఏపీ శాసనసభలో విభజనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా మాట్లాడలేదు. అంతకుముందు అసెంబ్లీలో మీ కాంగ్రెస్‌ పార్టీ వల్ల ఏం జరగదు. నాకివ్వండి విభజన ఎలా చేయాలో చేసి చూపిస్తా అని బాబు నేరుగా అడిగేశారు. తీరా ఏపీ అసెంబ్లీలో విభజన తీర్మానంపై స్పీకర్‌ రెండు మూడు సార్లు పిలిస్తే బాబు రాకుండా దాక్కునేశాడు. ఇదేం రాజకీయం!

♦ కేసీఆర్‌కు, చంద్రబాబుకు పాలనలో ఎన్ని మార్కులిస్తారు?
కేసీఆర్‌కు పాలనలో 70 మార్కులు వస్తే, బాబు పాలనకు జీరోనే. బాబు పాలన గురించి మాట్లాడేటంత తెలివి తక్కువ ఇంటలెక్చువల్‌ని కాదు నేను.

♦ పోలవరం ప్రాజెక్టు గురించి చాలా చేసేస్తున్నానని బాబు చెబుతున్నారే?
పోలవరమా.. దాన్ని బాబు కట్టేదేమిటి? రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు అది. దాన్ని మేం తీసుకుంటాం. మా సూపర్‌వైజ్‌ కింద చేపడతాం అన్నారు. కేంద్రమే తీసుకుంటే టీడీపీ కాంట్రాక్టర్లు మునిగిపోతారు కదా. మరి ఇంట్లో సంసారం కూడా నడవాలిగా. మీరేం కట్టొద్దు. మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటాం అని బాబు కేంద్రాన్ని అడిగారంటేనే ఇది ఎవరి మేలుకోసమో అర్థమవుతుంది. కేంద్రం పంపే డబ్బుతో కాంట్రాక్టర్లను గుప్పెట్లో పెట్టుకోవచ్చు కదా.

♦ పింఛన్లు ఇస్తున్నా.. రుణమాఫీ చేసేస్తున్నా.. అంటున్నారే బాబు?
అన్నీ మీ పేపర్లలో వస్తాయంతే. రాష్ట్రంలో ఏదో ఒక ఊరికి బాబును రమ్మనండి. నేనూవస్తాను. ఏ ఊళ్లో మాఫీలు చేసాడో, ఇంకా ఏమేం చేశాడో అక్కడే తేలిపోతుంది. పది మంది రైతుల్ని పిలిపిద్దాం. ఎక్కువమందిని పిలిపిస్తే కచ్చితంగా మనల్ని జనం కొట్టేస్తారు. మీకు ఏయే మేళ్లు చేశారో చెప్పండి అని అడుగుదాం. అక్కడే తేలిపోతుంది.

♦ ఓటుకు కోట్లు కేసులో బాబు పరిస్థితి ఏంటి?
బాబు అడ్డంగా దొరికిపోయాడు. ప్రత్యక్షంగా అతడే ఈ కేసు మొత్తానికి బాధ్యుడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కదా. నేనే లాయర్‌గా ఉండి అలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడిని.

♦ బ్రహ్మ దేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆర్‌ తర్వాత చప్పబడిపోయాడు కదా?
అవును మరి. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్సయ్యారు. హైదరాబాద్‌ వదిలిపెట్టి పోకపోతే కేసు పెడతాను అన్నాడు కేసీఆర్‌. బాబు వెళ్లిపోయాడు. రాజీ కుదిరిపోయింది. బాబు ఎప్పటికప్పడు ఎవర్నో ఒకరిని పట్టేసి తప్పుకుంటున్నారు. అందుకే బాబు జగజ్జంత్రీ.

♦ తెలంగాణలో విపక్షం, ఆంధ్రాలో విపక్షం వీటి పనితీరు ఎలా ఉంది?
తెలంగాణలో విపక్షం సమర్థంగా పనిచేయడం లేదు. అదే ఆంధ్రాలో విపక్షం బాగా పనిచేస్తోంది. ప్రతిపక్ష నేతగా జగన్‌ బాగా పేరుకొచ్చాడు. జనంలో కూడా జగన్‌ పట్ల మోజు ఉంది. ఒక చాన్స్‌ ఇద్దాం అనే భావం ఏర్పడిందని స్వయంగా తెలుసుకున్నాను.

♦ వచ్చే ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణలో గెలుపెవరిదంటారు?
పబ్లిక్‌లో జగన్‌ పట్ల సానుభూతి ఉంది. వచ్చే ఎన్నికల్లో అతడు గెలుస్తాడని నాకు నమ్మకం. గెలవాలి కూడా. ఏపీలో గెలిచే అవకాశం జగన్‌కే ఉంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి అటూఇటూగా ఉంది కానీ తెలంగాణ ఫీలింగ్‌ మాత్రం జనంలో ఇప్పటికీ ఉంది. ఇక ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి జీరోనే.

(నాదెండ్లతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/Lf2mV3
https://goo.gl/sNDbJz

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement