లోకేశ్ చెప్పి మరీ కొట్టించాడు!
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం
కాపు రిజర్వేషన్ సమస్యపై ఇంట్లో ఆమరణదీక్ష నిర్వహిస్తుండగా తమపై దాడి చేసి కొట్టాల్సిందిగా చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబు పోలీసులను ప్రోత్సహించారని మాజీమంత్రి, కాపు నేత ముద్రగడ ఆరోపణ సంచలన ఆరోపణలు చేశారు. లోకేశ్ ఫోన్‌లోనే నన్ను తిట్టి ‘వాడిని కొట్టారా లేదా.. వాడిని ఇంట్లోంచి బయటకు లాగేయండి, లాగేశారా లేదా.. నాకు సమాధానం కావాలి. వాడిని కొట్టారా లేదా చెప్పాలి నాకు’ అని పోలీసులను బెదిరించి మరీ మా కుటుంబాన్ని కొట్టించాడని ముద్రగడ ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారే తర్వాత తనకు ఈ విషయం చెప్పారు కాబట్టి నమ్ముతున్నానన్నారు. బాబు పాలనలో మట్టిని అమ్మేస్తున్నారు, ఇసుకను అమ్మేస్తున్నారు. గాలిని కూడా అమ్మేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మర్చిపోయారు. ఇది ఊరికే పోదంటున్న ముద్రగడ పద్మనాభం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
రాజకీయాలు 40 ఏళ్లకు ముందు, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి?
అప్పుడు నిస్వార్థ సేవ. ఇప్పుడు పూర్తిగా స్వార్థంతో కూడుకున్న సేవ. అప్పుడు అన్ని కులాల్లోనూ నిజాయితీ ఉండేది. కులాలకు అతీతంగా ఎంఎల్యేలు, ఎంపీలకు ప్రజాసేవే లక్ష్యంగా తప్ప రెండో ఆలోచన ఉండేది కాదు. ఈరోజు కుటుంబం, వారితో ఉన్న ఫాలోయర్లకే ప్రాధాన్యం. ప్రజలకు సేవ చేయాల్సిన ఆలోచన చాలా తగ్గిపోయింది. ప్రజలకు నాయకులపై ప్రేమ ఉన్నంత కాలం నేను గెలిచాను. వారి ప్రేమను నేను మర్చిపోలేనండి. మొన్న తుని సభలో ఇదే చెప్పాను. నన్ను కన్నది తల్లిదండ్రులు. పెంచింది పత్తిపాటి నియోజకవర్గ ప్రజానీకం అని చెప్పుకున్నాను.
ఎన్టీ రామారావును పదవినుంచి దింపినప్పుడు మీరెలా ఫీలయ్యారు?
చాలా అన్యాయం. నాదెండ్ల చేసిన పనిని వెన్నుపోటు అన్నారు. మరి దీన్నేమంటారు. ఇదికూడా వెన్నుపోటే కదా. అప్పట్లో పార్టీ మీటింగుల్లో నేను, లాల్ జాన్ భాషా పక్కపక్కనే కూర్చునేవాళ్లం. చంద్రబాబు రాగానే రామారావుకు దండ వేసేవారు. అన్నా..! కాళ్లు లాగేసి, జోడుతో కొట్టేసి, సీఎం కుర్చీలో కూర్చొని పైగా దండేసేసి ఏం షో చేస్తున్నాడన్నా అని భాషా నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. టీడీపీలో చాలామందికి ఇదే ఫీలింగ్ ఉండేది. నాదెండ్ల ఎన్టీఆర్‌ని అవమానించలేదు. కాని బాబు తన మామను వైస్రాయ్ హోటల్‌లో చెప్పులతో కొట్టించాడు.
మీరు కాపు ఉద్యమం మళ్లీ మొదలు పెట్టడానికి ప్రేరణ ఏది?
2014 తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను. మా నాయకులు వచ్చి కలిశారు. చంద్రబాబు పాదయాత్రలో, ఎన్నికల సమయంలో కాపులకు బీసీ ప్రతిపత్తి ఇస్తాను, సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తాను.. అంటూ వాగ్దానాలు చేశారు. కానీ ఏమీ చేయలేదు. కాపుల హక్కుల కోసం ఉద్యమిద్దాం అని మావాళ్లు చెప్పారు. అందుకే మొదటి ఉత్తరాన్ని 26–07–2015న సీఎంకి పోస్ట్ చేశాను. ఆ ఉత్తరానికి బాబు సమాధానం పంపి ఉంటే ఏమీ జరిగేది కాదు. మీ వాళ్లను పంపించండి మాట్లాడుదాం అని చెప్పినా బావుండేది. దాంతో చివరగా తుని మీటిం గుకు పిలుపునిచ్చాను.
తునిలో ఆ రైలు దగ్ధం ఎలా జరిగింది?
అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అలా తగలబెట్టే స్వభావం నాదో, బాబుదో ఆయన చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది. 1984లో నాదెండ్ల కుట్ర వల్ల రామారావుకు అధికారం పోయినప్పుడు పర్వతనేని ఉపేంద్ర, బాబు ఇద్దరూ ఎన్టీఆర్ స్టూడియోలో కూర్చుని.. ఇళ్లు తగలబెట్టండి, ఆఫీసులు తగలబెట్టండి, బ్యాంకులు తగలబెట్టండి అంటూ పార్టీ కార్యకర్తలకు రాత్రంతా ఫోన్లు చేసి రెచ్చగొట్టారు.
తుని ఘటనకూడా అలాంటిదే అంటారా?
తుని రైలు దహనంపై మాపై కేసు పెట్టారు. ఇంతవరకు హియరింగ్ లేదు. విచారణకు పిలవరు. విచారిస్తే ఎవరు చేశారో తేలిపోతుంది కదా. కానీ చేయరు. ఇలాంటివి ఒకటా రెండా.. ఎన్నో మరి. పరిటాల రవిని చంపేస్తారని బాబుకు ముందే తెలుసు. ఆయనపై యాక్షన్ జరుగుతుందని, చంపుతారని తెలిసినప్పుడు పక్కనబెట్టి దాయాలి కదా.. చేయలేదు. రవి హత్య జరిగిన రోజు బాబు అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగు పెట్టారు. అక్కడ రవిని చంపడం, ఇక్కడ జిల్లాల్లో ఉన్న పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టి ఆఫీసులను, బస్సులను, కార్లను తగలబెట్టండి అని పురమాయించింది కూడా బాబే. అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను జరిగింది సమస్తం నాకు తెలుసు. సర్వమూ తగలబెట్టండి అని పార్టీ ఆఫీసునుంచే నాకు కాల్ వచ్చింది కూడా. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను.
తుని రైలును టీడీపీ వాళ్లే తగలబెట్టారని మీరు చెప్పారు. ఇది నిజమేనా?
పక్కా. పక్కాగా తగలబెట్టింది వాళ్లే. ఎదురు రాయి వేయడం, డొంక తిరుగుడు నాకు అలవాటు లేదు. వెనకనుంచి పొడిచేయడం, ముంచేయడం నాకు తెలీదు. ఒక విష యం.. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా. నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే వేలమంది పోలీసులు పహరా కాస్తున్నారు. మరి అదే పోలీసులను రైల్వే ట్రాక్ మీద ఎందుకు పెట్టలేదు. సభకు అంతమంది జనం వస్తారని వాళ్లకు తెలీదా.. పోనీ ముందు జాగ్రత్తగా ట్రైన్‌ను పక్క స్టేషన్ నుంచి వదలొద్దని చెప్పారా.. అదీ లేదు. ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే అంతా బాబు కుట్రలో భాగం.
ప్రతిపక్షనేత, సీమ గూండాలే తుని ఘటనకు కారణమని బాబు ప్రకటించేశారు గదా?
ఏం జరిగినా ఎదుటివాళ్లమీద తోసేయడం బాబుకు మొదట్నుంచి అలవాటు. కాపు రిజర్వేషన్ సమస్యపై నా తొలి ఉత్తరానికి బాబు సమాధానం చెప్పి ఈ సమస్య పరిష్కారం కోసం రెండు మూడేళ్లు పడుతుంది వేచి ఉండండి అని చెప్పి ఉంటే ఇవేవీ జరిగేవి కావు కదా.
తుని ఘటన తర్వాత మీ ఇంటిపై దాడి ఎందుకు, ఎలా జరిగింది?
సీఎం బాబు కుమారుడే మా కుటుంబంపైకి పోలీసులను ఉసికొల్పాడు. లోకేశ్ అలా ఒత్తిడి చేశాడని తర్వాత ఒక పెద్ద ఆఫీసరే నాకు చెప్పారు. లోకేశ్ ఫోన్‌లోనే నన్ను బూతులు తిట్టి ‘లం... కొడుకుని కొట్టారా లేదా.. కొట్టారా లేదా.. వాడిని ఇంట్లోంచి బయటకు లాగేయండి, లాగేశారా లేదా.. నాకు సమాధానం కావాలి. లం.. కొడుకుని కొట్టారా లేదా చెప్పాలి నాకు’ అని పోలీసులను బెదిరించి మరీ మా కుటుం బాన్ని కొట్టించాడు. లోకేశ్ ఆ విధంగా బెదిరించిన తర్వాతే పోలీసులు మా ఇంటిపైకి దాడి చేసి కొట్టారు. ఇది లోకేశ్ ఒక్కడి పని కాదు. బాబుకు తెలియకుండా జరిగింది కాదిది. కుటుంబ సభ్యులతో సహా అందరినీ అవమానిస్తే అవమాన భారంతో ముద్రగడ కుంగిపోతాడు. మనకు తలనొప్పి పోతుంది అనుకున్నారు తండ్రీ కొడుకూ.. ఈ దెబ్బతో నేను ఇక బయటకు రాడు అని భావించారు. కానీ బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. నిజమే కొట్టాడు, కొట్టించాడు. ఫనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడున్నాడు.
వైఎస్సార్, బాబు పాలనపై మీ వ్యాఖ్య?
వైఎస్ రాజశేఖరరెడ్డి దానకర్ణుడి కోవకు చెందినవాడు. ప్రజలకు ఏ కార్యక్రమం కావాలంటే దాన్ని చేసి ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే మహా వ్యక్తిగా వైఎస్‌ను పోల్చవచ్చు. బాబు అంటారా.. 18, 20 గంటలు మీటింగులు నిర్వహించినట్లుగా నటిస్తాడు. కానీ ఔట్ పుట్ ఏమీ ఉండదు. మాట్లాడేదంతా సొల్లు. చెప్పిందే చెప్పి.. చెప్పిందే చెప్పి.. ఏదో కష్టపడిపోతున్నానని ప్రజలకు చూపించడానికి తప్ప తన ప్రసంగాల్లో ఔట్‌పుట్ ఏమీ ఉండదు.
చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు?
అట్టర్ ఫెయిల్. అన్నీ పచ్చి అబద్దాలు. బాబుకు అబద్ధాల చక్రవర్తి అని బిరుదిచ్చినా సరిపోదు. జనం ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో మట్టిని, ఇసుకను అమ్మేస్తున్నారు. గాలిని కూడా అమ్మేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మర్చిపోయారు. ఇది ఊరికే పోదు. పైగా ‘‘బాబు మమ్మల్ని పురుగులను చూసినట్లు చూస్తున్నాడు. అందుకే తుని మీటింగ్ సక్సెస్ కావాలి. ఎంత ఫండ్ కావాలి చెప్పండి. పంపిస్తాం. తుని సభ lతప్పక విజయవంతం కావాల’’ని టీడీపీ ఎమ్మెల్యేలే చాలామంది నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. బాబు వ్యవహారంతో టీడీపీ ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. ‘సీఎం ఇంటికి కిలోమీటర్ ముందే మా వాహనాలు ఆపేస్తున్నారు. ఘోరంగా అవమానిస్తున్నా’రని టీడీపీ మంత్రులు సైతం కుమిలిపోతున్నారు. 45 ఏళ్లకు పైగా నా రాజకీయ జీవితంలో నా కొడుకును, కోడలిని పోలీసులు దారుణంగా కొట్టడం, తిట్టడం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఫలితం అనుభవిస్తారు. శిక్షను అనుభవించక తప్పదు.
(ముద్రగడతో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/CY6Dlb
https://goo.gl/Fw8Gvg