♦ మనసులో మాట
రాజధాని పేరిట అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించడం తప్పితే ఏమీ జరగకపోవడం చూస్తే తమబోటి వారికి ఏమీ అర్థం కావడం లేదని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. అందుబాటులో ఉన్న వసతులను కనీసంగా కూడా ఉపయోగించుకోకుండా, గుంటూరు, విజయవాడ, తెనాలి వంటి ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేయకుండా మూడుపంటలు పండే రైతుల భూములను తీసుకోవడంలో ఏ ప్రయోజనం ఉందో ఎవరికీ బోధపడటం లేదన్నారు. అమరావతి ప్రజలు తమ ఎదుట ఏం జరుగుతోంది అని చూస్తారు తప్ప వేల కోట్లు అప్పు తెస్తున్నారా లేదా అన్నది పట్టించుకోరన్నారు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రతిపక్షాన్ని కలుపుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా, పబ్లిక్ డిబేట్‌కు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం సాధించేది ఏమీ లేదని, ఇంత పెద్ద అంశంలోనూ ఉమ్మడి అవగాహన లేకపోతే ఎలా అంటున్న పొత్తూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
నాటికీ, నేటికీ జర్నలిజం విలువల్లో తేడా ఏమిటి?
అన్ని వృత్తులకు లాగే జర్నలిజం కూడా పరిణామానికి లోనవుతోంది. కానీ జర్నలిజం సూత్రబద్ధత విషయంలో ఏమీ తేడా రాలేదు. ఆనాడు జర్నలిజంలో వేటినైతే ధ్యేయాలుగా పెట్టుకున్నారో అవేమీ మారలేదు. నిజం చెప్పడం.. ప్రజలకు వాస్తవాల్ని తెలియజేయడం.. అది ఇప్పటికీ ఉంది. మార్పు టెక్నాలజీ పరంగానే వచ్చింది. ప్రజలకు సమాచారాన్ని త్వరగా అందించే ప్రక్రియను వేగవంతం చేయడంలో మార్పు వచ్చింది. ప్రజలకు నిజం చెప్పడం మన బాధ్యత అని నేననుకుంటాను. నేను ఆచరణలో అదే చేశాను. ఆ విషయంలో మేము రాజీపడవలసిన అవసరం రాలేదు.
జర్నలిజం ఒక వృత్తా లేక వ్యాపకమా?
చాలా మంచి ప్రశ్న. మోటుగా చెప్పాలంటే జర్నలిజం అనేది ఒక పిచ్చి అండి. బయట మనకు ఇంకో పెద్ద ఉద్యోగం ఆఫర్ ఉన్నా కూడా, వద్దు నాకు జర్నలిజం కావాలి అని చెప్పి దీంట్లోకి వస్తాం. మనలో చాలామందిమి అలాంటివాళ్లమే. డబ్బుల కోసం జర్నలిజంలోకి వచ్చిన కాలం కాదు మనది. ఎందుకంటే జీతాలు చాలా తక్కువ. అప్పట్లో జర్నలిస్టులకు జీతం ఎంతంటే సబ్ ఎడిటర్‌కి కేవలం వంద రూపాయలు. ఇప్పుడంటే పరిస్థితులు మారాయి గానీ, అప్పట్లో డబ్బులంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఈ వృత్తిలో నేను ఉండాలి. దీంట్లోనే పనిచేయాలి అనే ఆసక్తి లేకుంటే జర్నలిజంలో ఎవరూ ఉండలేరు.
ప్రభుత్వాలపై పోరాటం అంటే గతంలో పెద్ద ఉత్సాహంగా ఉండేది. మరి ఇప్పుడో?
నేను రామ్‌నాథ్ గోయెంగా పత్రికలో పనిచేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. నువ్వు ఎడిటర్‌గా ఉన్నంత కాలం పత్రిక పాలసీ అనేది నీదే కానీ యజమానిగా నాది కాదు. నా పాలసీ ఏది అని నీవు ఆలోచించవద్దు. నీ సొంత పాలసీని రూపొందించుకో. దాన్నే అమలు చేయి. ఎందుకంటే పత్రిక సంపాదకుడివి నీవు అన్నారు. నేను పత్రికలో నా సొంత పాలసీనే అమలు చేయగలిగాను. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని.
చంద్రబాబు, కేసీఆర్ పాలన ఎలా ఉంది?
కేసీఆర్‌కి తెలంగాణ సిద్ధాన్నం. అంటే రెడీమేడ్ భోజనం. తెలంగాణలో మంచి వనరులు చాలా ఉన్నాయి. మనది సంపన్న రాష్ట్రం అని కేసీఆరే అన్నారు. చాలా నిజం. సంపన్నం అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే మన ఆదాయం. ఆంధ్రలో పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఉన్న వనరులతోనే సరిపెట్టుకోవాలి.
అమరావతి రాజధాని గురించి మీరెలా చూస్తున్నారు?
అమరావతి రాజధాని కావాలని కోరుకునేవారిలో నేనూ ఒకడిని. అయితే.. అమరావతి అంటే ఏమిటి? అమరేశ్వరాలయం ఉన్న ఊరు అని కాదు. ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ కలిపి అమరావతి అని నా ఉద్దేశం. గుంటూరు, విజయవాడ, తెనాలి, అమరావతి ఈ మొత్తం ప్రాంతం కలిపి రాజధానిగా అభివృద్ధి కావాలి. అంతే తప్ప హైదరాబాద్‌లో లాగా ఒక సచివాలయం కట్టి అక్కడే అభివృద్ధిని కేంద్రీకృతం చేయడమని కాదు.
మరి అమరావతిలో మీరనుకున్నట్లే జరుగుతోందా?
ఇప్పుడేమీ జరగటం లేదు. ఎందుకనేది నాకూ అర్థం కావటం లేదు కానీ, డబ్బులేకపోవడమే కారణం అనుకుంటాను. కేంద్రం రూ. 2,500 కోట్లు ఇచ్చిందని అంటున్నారు కానీ ఏమూలకు సరిపోతుంది? తాత్కాలికమైనవైనా సరే నాలుగైదు భవనాలు కట్టారు. నేను వెళ్లి చూశాను కూడా. ప్రధానంగా రోడ్లు, మౌలిక వసతుల కోసమే చాలా ఖర్చు అవుతుంది. కానీ డబ్బు లేదు. అలాగని రాజధాని పేరుతో అక్కడ జరుగుతున్నదంతా నేను ఆమోదించడం లేదు. నా అభిప్రాయాలు నాకున్నాయి. అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించుకోవడం మంచిది. ఉన్న చోట మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. అంటే గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. విశాలమైన ఆ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు. ఇక అక్కడే పొగాకు రీసెర్చ్ కేంద్రం ఉంది. దాదాపు 60 ఎకరాల స్థలం ఉంది. అక్కడా కొన్ని కట్టుకోవచ్చు. ఇలా చేయడానికి బదులు మూడు పంటలు పండే రైతుల భూములను తీసుకోవడం దేనికి?
అమరావతిలో ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది కరెక్టేనా?
ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అంటున్నానంటే, ఇప్పుడు చేస్తున్న విధానం సరికాదనే కదా అర్థం. అమరావతి పేరిట జరుగుతున్న పరిణామాలు, పనుల పట్ల నేను సంతోషంగా అయితే లేను. మన అభిప్రాయాలు ఏవైనా అమరావతి ఆలోచనలు పూర్తిగా చంద్రబాబువి. అలాగే వెళుతున్నారు.
ఉన్న వసతులు పక్కనబెట్టి, వేలకోట్లు అప్పు తెచ్చి కడితే నమ్ముతారా?
జనం నమ్మటం కోసం రాజధాని కడతారా? ఒకవేళ అలా చేసినా జనం నమ్మరు. అమరావతిలో ఆన్ ది స్పాట్‌లో ఉన్నవారు, అక్కడే పుట్టి పెరిగిన వారు. మా ఎదుట ఏం జరుగుతోంది అన్నదే చూస్తారు. మంచి భవంతులు, వసతులు వచ్చాయనుకోండి. జనం సంతోషపడతారు. కానీ ఇంతవరకు అలాంటివి ఏవీ జరగలేదే?
పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తా అని బాబు అంటున్నారే?
కేంద్రం మొత్తంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టి ఉండాల్సింది. అలా చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేపట్టింది. కొంత ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అలా చేసిన ఖర్చులయినా పూర్తిగా కేంద్రం ఇచ్చేసి ఉంటే బాగుండేది.
ఫిరాయింపులను మీరెలా అర్థం చేసుకుంటున్నారు?
ఎవరు చేసినా, చేయించినా ఫిరాయింపులు తప్పు. చట్టం ఉన్నా లేకున్నా నైతికంగా తప్పే. ఏపీలో, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను సమర్థించలేను. పార్టీ మారాలనుకుంటే రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి రాజీనామా చేసి, తర్వాత మీకు ఇష్టమైన పార్టీలలో చేరండి. తప్పులేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?
పోలవరం ఇంత వివాదాస్పదం ఎందుకవుతోంది?
ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి కావాలంటే ప్రభుత్వాధినేత సంకల్పం చాలా గట్టిదై ఉండాలి. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ప్రకాశంపంతులు ప్రోత్సాహంతో ప్రకాశం బ్యారేజి నిర్మించడానికి నాటి సీఎం నీలం సంజీవరెడ్డి ఇలాంటి సంకల్ప బలంతోనే పూనుకున్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 10 కోట్లు అవసరం. పైసా లేకున్నా ప్రారంభించారు. పాలకుడిలో అలాంటి దృఢసంకల్పం ఉండాలి. పైగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో పబ్లిక్ డిబేట్ కలికానికి కూడా కనిపించడం లేదు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య గొడవలాగే ఉంది తప్పిస్తే ప్రజలను కలుపుకోవడం అనే ప్రసక్తే లేకుండాపోయింది. ఇంత భారీ ప్రాజెక్టును అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని కలుపుకుని ఎలా సాధించాలో చర్చించాలి. కానీ, ఒక్కసారైనా అలాంటిది ఏపీ అసెంబ్లీలో జరిగిందా? ఇంత పెద్ద సమస్యలో కూడా ఉమ్మడి అవగాహన తీసుకురాకుంటే ఎలా? పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వానిదో, అధికార పార్టీదో కాదు కదా!
ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నప్పుడు ఉమ్మడి అవగాహన ఎలాసాధ్యం?
ఏ ప్రలోభం లేకుండానే, ప్రలోభానికి గురికాకుండానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అలా ఫిరాయిస్తున్నారంటే నేను నమ్మను. ఏదో ఒక బలమైన ఆకర్షణ లేకుండా ఫిరాయింపులు అనేవి జరగనే జరగవు.
(పొత్తూరి వెంకటేశ్వరరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/i5jYgU / https://goo.gl/eCYuDn
Comments
Please login to add a commentAdd a comment