
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ చట్టం కొత్తది కాదు, సవరించిన కొత్త చట్టంతో ఎవరికి ఎటువంటి నష్టం చేకూరదు, అభూత కల్పనలు నమ్మవద్దని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు, లబ్థి పొందేందుకే.. పౌరసత్వ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ బిల్లుతో మతాలకు సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే పౌరసత్వ సవరణ బిల్లు చట్టమైందని, అనవసరంగా అపోహలు పెంచి దేశాన్ని కల్లోలం చేయవద్దని నాదెండ్ల విన్నవించారు. భారతీయ ముస్లింలకు హాని కలిగించేలా చట్టంలో ఏమి పొందుపరచలేదని పేర్కొన్నారు. దేశంలో ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు ఏవిధంగా ఉన్నాయో అలానే ఐడీ ఉంటే చాలు, ఎవరిని వెల్లగొట్టరు అని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లును చించడంలో అర్ధం లేదన్నారు.