
పరేష్ రావల్ (ఫైల్ ఫొటో)
నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారన్న వార్త తప్ప ఇతర నటీనటుల వివరాలేవీ ప్రకటించలేదు. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కథలో కీలకమైన నాదెండ్ల భాస్కరరావు పాత్రకు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట.
తెలుగులో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న పరేష్ రావల్.. శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలోని లింగం మామ పాత్రతో టాలీవుడ్ లో మరింతగా పాపులర్ అయ్యారు. చాలా కాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయనను ఎన్టీఆర్ బయోపిక్ కోసం సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ పాత్రలో నటించేందుకు పరేష్ రావల్ అంగీకరిస్తారో లేదో చూడాలి. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా సాయి కొర‍్రపాటి, విష‍్ణువర్థన్ ఇందూరిలతో కలిసి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment