పాపిష్టి పనులకు కేరాఫ్ బాబే! :నాదెండ్ల భాస్కరరావు
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. టీడీపీ ఎన్‌టీఆర్‌దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టికెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. బుధవారం తన నివాసంలో భాస్కరరావు విలేకరులతో మాట్లాడారు. డీల్ కుదుర్చుకున్నారని స్పీకర్‌ను విమర్శిస్తున్న బాబుకే డీల్స్ వ్యవహారం బాగా తెలుసునన్నారు.
చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘రాష్ట్రపతి పంపిన నోట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం స్పీకర్ విధి. ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు’ అని చెప్పారు. ‘ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చినప్పుడు 95 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిస్తే నేను సీఎం అయ్యాను. వారిని నేను బలవంతపెట్టలేదు. ఎమ్మెల్యేలను దాచింది నువ్వు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ బిల్లులో పస లేదని, విభజన జరగదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉందన్నారు. విభజనను అడ్డుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో నేతలను కలవడం మంచి పరిణామమని భేటీ అనంతరం విలేకరులతో ఇష్టాగోష్టిలో భాస్కరరావు వ్యాఖ్యానించారు.