
అన్నవరం (ప్రత్తిపాడు): సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ నాటి ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు.
ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు ఉందని ‘యూట్యూబ్ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది వాస్తవమేనా’ అని ప్రశ్నించగా నిజమేనన్నారు.
ఎన్టీఆర్ గురించి చెప్పినవన్నీ వాస్తవాలే
ఇటీవల కొన్ని టీవీ చానెల్స్‌లో ఎన్‌టీఆర్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉన్నానని నాదెండ్ల స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానేనని తేల్చిచెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తన మంత్రి పదవిని ఎన్‌టీఆర్ తీసేస్తే ఆయన సీఎం పదవిని తాను తీసేశానని తెలిపారు. ఈ విషయంలో తనపై 30 ఏళ్లుగా చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, లేకుంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పారు.
బీసీలకు ఏదో చేసేస్తానని చెబుతున్న చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నికైన ఏకైక బీసీ ప్రధాని మోదీని పదవి నుంచి దించేయాలని ఎందుకు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దును చంద్రబాబు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబేనని, ఇప్పుడు అడ్డగోలుగా విభజించారని అంటున్నదీ ఆయనేనని మండిపడ్డారు. తనను విలన్‌గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment