marri chennareddy
-
మట్టిలో మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మంచి డాక్టర్‌గా రాణిస్తున్నప్పుడు వృత్తిని వదిలి రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్నేహితులు, మేనమామ రంగారెడ్డి స్వాగతించలేకపోయారు. చెన్నారెడ్డి మాత్రం ‘వ్యక్తి కంటే దేశం ముఖ్యం, పరతంత్య్రం కంటే స్వాతంత్య్రం శ్రేయస్సు’ అని నమ్మారు. గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు. పదవులు... బాధ్యతలు చెన్నారెడ్డి 1950లో ప్రొవిషనల్ పార్లమెంట్ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ విప్‌గా పనిచేశారు. ఆయన 1952 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రిగా పదవి చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత 1962లో సంజీవరెడ్డి, 1964లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కీలకమైన పోర్టుఫోలియోలు నిర్వహించారు. తెలంగాణా రీజినల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, రీహాబిలిటేషన్ కమిటీ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉక్కు సాధకుడు చెన్నారెడ్డి రాజకీయ పరిపక్వతను గమనించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, 1967లో ఆయనను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయడంతోపాటు ఉక్కు గనుల శాఖ మంత్రిగా నియమించారు. ఆ సమయం లోనే దక్షిణ భారతానికి మూడు ఉక్కు పరిశ్రమలను తెచ్చారు. ఓ ఏడాది తర్వాత కేంద్ర మంత్రి పదవి వది లేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. టీపీఎస్ స్థాపన తెలంగాణ ఉద్యమానంతరం చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) స్థాపించి 1971లో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఆయన మీద అనర్హత ఉన్న కారణంగా పోటీ చేయలేకపోయారు. తన అనుచరులను నిలబెట్టి 14 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకొని కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత కొంతకాలానికి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం 1977 లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం చెన్నారెడ్డి.. ఇందిరాగాంధీ 1978లో కాంగ్రెస్ (ఐ) పార్టీని స్థాపించినప్పుడు మర్రి చెన్నారెడ్డి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీకి 180 అసెంబ్లీ స్థానాలను సాధిం చి ఏపీకి ముఖ్య మంత్రి బాధ్యత లు చేపట్టారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆ పదవిలో 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ఉన్నారు. రెండో దఫా 1989 డిసెంబర్ నుంచి 1990 డిసెంబర్ వరకే ఉన్నారు. ఆయన వికారాబాద్, మేడ్చల్, తాం డూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. చివరి ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలిచారు. 1984 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ను స్థాపించి కరీంనగర్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జె.చొక్కారావు చేతిలో ఓడిపోయారు. ఆయన ఓటమిని చూసిన ఎలక్షన్ అదొక్కటే. ఆయన రాజకీయ జీవితంలో గవర్నర్‌గా ఉన్న కాలమే ఎక్కువ. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించిన చెన్నారెడ్డి డెబ్బై ఏడేళ్ల వయసులో 1996 డిసెంబర్ 2న మరణించారు. రైతు కుటుంబం.. మర్రి చెన్నారెడ్డిది రైతు కుటుంబం. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి శంకరమ్మ. మర్రి చిన్నప్పటి పేరు అచ్యుతరెడ్డి. ఆయన తాత కొండా చెన్నారెడ్డి (తల్లి తండ్రి). ఆ చెన్నారెడ్డి పోయిన తరువాత, తండ్రి పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు శంకరమ్మ. మేనమామ కొండా వెంకట రంగారెడ్డి చెన్నారెడ్డిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చదివించారు. మెట్రిక్యులేషన్ ఉన్నతశ్రేణిలో పాసయ్యి, స్కాలర్షిప్, మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నారాయన. విద్యార్థి నేతగా రాణించారు. ఎంబీబీఎస్ పట్టా తీసుకుని, రెండు నర్సింగ్‌హోమ్‌లు పెట్టి వైద్య వృత్తి చేపట్టారు. పుట్టింది: 1919, జనవరి 13 స్వగ్రామం: వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, సిరిపురం విద్యాభ్యాసం: ఎంబీబీఎస్ (1941) రాజకీయ ప్రవేశం: 1935లో గవర్నర్‌గా: నాలుగు రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్) ఉద్యమ సారధి: తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపన(టీపీఎస్) – సురేఖ శ్రీనివాస్ మాచగోని, వికారాబాద్ -
చంద్రబాబుని కొట్టబోయిన చెన్నారెడ్డి
అన్నవరం (ప్రత్తిపాడు): సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ నాటి ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు ఉందని ‘యూట్యూబ్ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది వాస్తవమేనా’ అని ప్రశ్నించగా నిజమేనన్నారు. ఎన్టీఆర్ గురించి చెప్పినవన్నీ వాస్తవాలే ఇటీవల కొన్ని టీవీ చానెల్స్‌లో ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉన్నానని నాదెండ్ల స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానేనని తేల్చిచెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తన మంత్రి పదవిని ఎన్టీఆర్ తీసేస్తే ఆయన సీఎం పదవిని తాను తీసేశానని తెలిపారు. ఈ విషయంలో తనపై 30 ఏళ్లుగా చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, లేకుంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పారు. బీసీలకు ఏదో చేసేస్తానని చెబుతున్న చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నికైన ఏకైక బీసీ ప్రధాని మోదీని పదవి నుంచి దించేయాలని ఎందుకు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దును చంద్రబాబు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబేనని, ఇప్పుడు అడ్డగోలుగా విభజించారని అంటున్నదీ ఆయనేనని మండిపడ్డారు. తనను విలన్‌గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఉద్దండుల పుట్టినిల్లు!
మొయినాబాద్, న్యూస్‌లైన్: రాజకీయంగా, సామాజికంగా పెద్దమంగళారం గ్రామం ఏనాడో చైతన్యమైంది. ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ఆ నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో ఆ ఊరి నాయకులు భాగస్వామ్యం ఉంది. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే ముందు తెలుసుకోవాల్సింది కొండా వెంటక రంగారెడ్డి గురించి. 1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కటుంబంలో జన్మించారాయన. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. రైతుల పక్షాన పోరాడారు. జైలు జీవితాన్నీ అనుభవించారు. 1952 నుంచి 57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో ఆయనది కీలక భూమిక. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడారు. 1970 జులై 24న మరణించారు. దున్నేవాడితే భూమి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో అప్పట్లో కేవీ రంగారెడ్డి మహోద్యమాన్ని లేవదీశారు. పేద కబ్జాలో ఉన్న భూమిని వారికే ఇప్పించారు. అప్పట్లో చింతచెట్లు ఎవరి పట్టాభూమిలో ఉన్నా వాటిపై హక్కు ప్రభుత్వానికే ఉండేది. ఎవరి భూమిలో ఉన్న చెట్లపై వారికే హక్కు ఉండేలా చట్టం తీసుకొచ్చారు రంగారెడ్డి. రంగారెడ్డికి 11 మంది సంతానం కొండా వెంకట రంగారెడ్డి- తుంగభద్రమ్మ దంపతులకు 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. హరిచంద్రారెడ్డి, మాధవరెడ్డి, దామోదర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిల్లో ప్రస్తుతం లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిలు ఉన్నారు. కూతుళ్లలో సుమిత్రమ్మ, సుజాతమ్మ, సాధన ఉన్నారు. మరో కూతురు స్నేహలత మరణించారు. రంగారెడ్డి మేనల్లుడే మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6వ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి.. కొండా వెంకట రంగారెడ్డికి మేనల్లుడు. రంగారెడ్డి అక్క బుచ్చమ్మకు 1919 జనవరి 13న మర్రి చెన్నారెడ్డి పెద్దమంగళారంలోనే జన్మించారు. బాల్య జీవితాన్ని పెద్దమంగళారంలోనే గడిపిన చెన్నారెడ్డి తన మేనమామ పేరుతోనే 1978 ఆగస్టు 15న ‘రంగారెడ్డి’ జిల్లాను ఏర్పాటు చేశారు. -
గ్రామీణుల ఆరోగ్యమే ధ్యేయం
బాకారం (మొయినాబాద్), న్యూస్‌లైన్: గ్రామీణుల ఆరోగ్యమే ధ్యేయమని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గవర్నర్ మర్రి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బాకారంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అందుకు గ్రామానికి చెందిన తొండుపల్లి రాజు రూ.25వేలు, మాల మహేం దర్ రూ.10వేలు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్‌యాదవ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు హరికిషన్, ఉపాధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి, సెంట్రల్ అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి సధానందం, యువజన కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్డెరాజు, మాజీ సర్పంచ్ శ్రీరాంరెడ్డి, వార్డు సభ్యులు సధానందం, కే.మహేందర్, ఏ.దుర్గమ్మ, శాంతమ్మ, సాతమ్మ, తిరుపతిరెడ్డి, బాల్‌రాజ్, నాయకులు మహేందర్‌ముదిరాజ్, సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు.