మొయినాబాద్, న్యూస్‌లైన్: రాజకీయంగా, సామాజికంగా పెద్దమంగళారం గ్రామం ఏనాడో చైతన్యమైంది. ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ఆ నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో ఆ ఊరి నాయకులు భాగస్వామ్యం ఉంది. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే ముందు తెలుసుకోవాల్సింది కొండా వెంటక రంగారెడ్డి గురించి. 1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కటుంబంలో జన్మించారాయన. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
రైతుల పక్షాన పోరాడారు. జైలు జీవితాన్నీ అనుభవించారు. 1952 నుంచి 57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో ఆయనది కీలక భూమిక. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడారు. 1970 జులై 24న మరణించారు.
దున్నేవాడితే భూమి
దున్నేవాడిదే భూమి అనే నినాదంతో అప్పట్లో కేవీ రంగారెడ్డి మహోద్యమాన్ని లేవదీశారు. పేద కబ్జాలో ఉన్న భూమిని వారికే ఇప్పించారు. అప్పట్లో చింతచెట్లు ఎవరి పట్టాభూమిలో ఉన్నా వాటిపై హక్కు ప్రభుత్వానికే ఉండేది. ఎవరి భూమిలో ఉన్న చెట్లపై వారికే హక్కు ఉండేలా చట్టం తీసుకొచ్చారు రంగారెడ్డి.
రంగారెడ్డికి 11 మంది సంతానం
కొండా వెంకట రంగారెడ్డి- తుంగభద్రమ్మ దంపతులకు 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. హరిచంద్రారెడ్డి, మాధవరెడ్డి, దామోదర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిల్లో ప్రస్తుతం లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిలు ఉన్నారు. కూతుళ్లలో సుమిత్రమ్మ, సుజాతమ్మ, సాధన ఉన్నారు. మరో కూతురు స్నేహలత మరణించారు.
రంగారెడ్డి మేనల్లుడే మర్రి చెన్నారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6వ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి.. కొండా వెంకట రంగారెడ్డికి మేనల్లుడు. రంగారెడ్డి అక్క బుచ్చమ్మకు 1919 జనవరి 13న మర్రి చెన్నారెడ్డి పెద్దమంగళారంలోనే జన్మించారు. బాల్య జీవితాన్ని పెద్దమంగళారంలోనే గడిపిన చెన్నారెడ్డి తన మేనమామ పేరుతోనే 1978 ఆగస్టు 15న ‘రంగారెడ్డి’ జిల్లాను ఏర్పాటు చేశారు.
ఉద్దండుల పుట్టినిల్లు!
Published Thu, Apr 3 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement