మొయినాబాద్: ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అదనపు కట్నం కోసం వేధించడంతో ఇంట్లోనే ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌కు చెందిన నర్లకంటి మల్లేశ్ కూతురు కల్పన(22) బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వారి బంధువు బైరంపల్లి శ్రీశైలం కొంత కాలంగా కల్పనను ప్రేమించాడు. గత ఏడాది అక్టోబర్ 29న ఇద్దరూ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఈ ఏడాది ఫిబ్రవరి 11న హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి చేశారు. అప్పటి నుంచి శ్రీశైలం కుటుంబం మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటోంది.
కాగా కల్పన ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానించిన శ్రీశైలం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు అదనపు కట్నంగా స్విఫ్ట్ కారు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అతనికి తల్లి స్వరూప, బాబాయి రాజు సైతం సహకరించి కల్పనను వేధించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment