మనోహర్ తలకు తగిలిన నీళ్ల బాటిల్
ఆలపాటి రాజా వర్గమే దాడిచేసిందని ఆరోపణ
తెనాలిలో జనసేన, టీడీపీ అభ్యర్థుల పాదయాత్రలో ఘటన
టీడీపీ–జనసేన మధ్య విభేదాలు బట్టబయలు
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు.
ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు.
ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment