తెనాలి (గుంటూరు జిల్లా) : బిజెపిలో ఆ పార్టీ దళిత ఎంపీలకు స్వేచ్చ లేదని, దేశవ్యాప్తంగా ఆ పార్టీలో 46 మంది దళిత ఎంపీలు ఉంటే ఒక్కరికి కూడా కేబినెట్ మంత్రి పదవి ఇవ్వలేదని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెనాలి నియోజకవర్గ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్, కార్పొరేట్ సంస్థల చేతుల్లో నడుస్తుందన్నారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని, విశ్వవిద్యాలయాల్లో కుల,మత ఘర్షణలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో అరాచక, దోపిడీ పాలన జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు.
నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుందని, కాంట్రాక్టర్లు, సొంత మనుషులకు ప్రజాప్రతినిధులు పనులు చేస్తూ ప్రజలకు పనులు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు మనోదైర్యం కలిగించే విధంగా పరిపాలన చేయాలని, సమాజంలో అసమానతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్రమోదీ మోసగాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిరికివాడని అభివర్ణించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకిగా పనిచేస్తున్నారని, దళితుల ఓట్లుతో అధికారంలోని వచ్చి వారిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
‘బీజేపీలో దళితులకు స్వేచ్ఛ లేదు’
Published Tue, Feb 16 2016 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
Advertisement
Advertisement