‘హెలెన్’..టెన్షన్ | Cyclone 'Helen' to cross Andhra coast Thursday | Sakshi
Sakshi News home page

‘హెలెన్’..టెన్షన్

Published Thu, Nov 21 2013 2:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Cyclone 'Helen' to cross Andhra coast Thursday

సాక్షి, గుంటూరు: జిల్లాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ‘పై-లీన్’ తుపాను ప్రభావంతో జరిగిన నష్టం కళ్ల ముందు కదలాడుతుంటే పుండుపై కారం రాసినట్టు ‘హెలెన్’ తుపాను ముందుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి శ్రీహరికోట-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం వున్నట్టు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల  రాగల 24 గంటల్లో తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడే ప్రమాదం వుండడంతోపాటు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్ని మండలాల తహశీల్దార్‌లను బుధవారం సెట్‌కాన్ఫెరెన్స్‌లో అప్రమత్తం చేశారు. లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
 
 ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే ఆయా పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. తుపాను రక్షణ కేంద్రాలను శుభ్రం చేసి సిద్ధం చేయాలన్నారు. తీరప్రాంత మండలాలైన బాపట్ల, కర్లపాలెం, రేపల్లె, నగరం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం ప్రాంతాల్లో తుపాను ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుంటూరులో తుపాను కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే , ఇటీవల ‘పై-లీన్’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు ‘హలెన్’ తుపాను హెచ్చరికలతో రైతాంగం ఆందోళన చెందుతోంది.
 
 మూడో నంబర్ ప్రమాద  హెచ్చరిక జారీ
 రేపల్లె, న్యూస్‌లైన్: నిజాంపట్నం హార్బర్‌లో బుధవారం మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు.అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు వేటను నిలిపివేసి బోట్లను హార్బర్ జెట్టీకి చేర్చారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకటరామారావు తెలిపారు. వరుస విపత్తులతో వేట సాగకపోవటంతో ఈఏడాది మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. డీజిల్ ధరలు పెంపుదలతో నష్టాల బాటపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement