కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గతంలో నక్సల్స్ ప్రభావం కారణంగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకుల సర్వీసులను తిరిగి పాత(సర్వీస్ ఏరియా) ప్రాంతాల్లోనే కొనసాగించాలని జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రూరల్ ప్రాంతాల్లో ఉండాల్సిన 31 బ్యాంకులు తిరిగి ఆయా ప్రాంతాల్లోనే సర్వీసులు కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి ఆమోదించారు.
ఈ సందర్భంగా వివేక్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఖరీప్‌లో రైతులకు రూ.1,260 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంకాగా రూ.751 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సీజన్ పూర్తయ్యేనాటికి రుణాల లక్ష్యం పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. 13,813 మంది కౌలు రైతులకు రుణఅర్హత కార్డులివ్వగా 189 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారని, మిగతావారికి కూడా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 648 స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు రూ.17కోట్ల 37లక్షలు రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తికావడానికి అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి దాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ దత్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ విజయగోపాల్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
సర్వీసు ఏరియాల్లోనే సేవలందించాలి
Published Sat, Sep 14 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement