Naxal
-
సేఫ్ జోన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు సేఫ్ జోన్ వెతుకులాటలో పడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ ఎత్తున ఎరివేతకు దిగడంతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతోపాటు, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పైగా రాష్ట్రాల పోలీసు బలగాలకుతోడు కేంద్ర సాయుధ బలగాలను మరింత ఎక్కువగా కదన రంగంలోకి దింపుతున్న వేళ మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంటున్నారు.ఇందుకు రెండు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం వృద్ధాప్యంతోపాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. అదే సమయంలో తమకు దశాబ్దాలుగా సేఫ్జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని కోల్పోతున్నారు. దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న అబూజ్మడ్ సైతం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళుతుండటం మావోయిస్టు నాయకత్వాన్ని మరింత కలవర పరుస్తోంది. మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో ఉన్నారు.మరోవైపు రిక్రూట్మెంట్లు తగ్గటం, విచ్చినవారు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడా పట్టున్న ప్రాంతాలూ ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్‌గా మార్చుకునే యోచనలో మావోయిస్టులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆరుగురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం, గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలు నిత్యం జల్లెడపడుతుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటిన అగ్రనేతలుమావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది ఆరుపదుల వయస్సు దాటిన వారే ఉన్నారు. ఈ వయస్సులో వారికి మెరుగైన వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కరీంనగర్‌కు చెందిన భూపతి అలియాస్ లచ్చన్న వయస్సు 63 ఏళ్లు, తిప్పరి తిరుపతికి 60 ఏళ్లు, నల్లగొండకు చెందిన పాక హన్మంతుకు 60 ఏళ్లు, హైదరాబాద్‌కు చెందిన మోడెం బాలకృష్ణకు 59 ఏళ్లు, పెద్దపల్లికి చెందిన పుల్లూరి ప్రసాదరావుకు 62 ఏళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు అగ్రనేతల ఆరోగ్య పరిస్థితి ఇలా..⇒ మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అలియాస్ రామన్న అలియాస్ దయానంద్ అలియాస్ గుడ్సా దాదా అలియాస్ చంద్రశేఖర్ 74 ఏళ్లకు చేరారు. ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా. ఆయన లో బీపీ, డయాబెటిస్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్ సమస్యలతో ఇప్పుడు దాదాపు మంచానికే పరిమితమయ్యారు. ⇒ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ అలియాస్ ఆనంద్ అలియాస్ సొమ్రు దాదా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. భూపాలపల్లికి చెందిన రవికి 59 ఏళ్లు, డయాబెటిస్‌కు ఇన్సులిన్ వాడుతున్నారు. కిడ్నీలు చెడిపోయి కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు అలియాస్ గోపన్నకు ఇప్పుడు 66 ఏళ్లు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న కోస ఒబెసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు అలియాస్ చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కర్రల సాయంతో నడుస్తున్నారు. ⇒ హైదరాబాద్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ డయాబెటిస్, గ్యాంగ్రిన్‌తో బాధపడుతున్నారు. -
2026 నాటికి నక్సలిజం అంతం
రాయ్‌పూర్: 2026 మార్చినాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తా మని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్ట్ తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక, కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాజధా ని రాయ్‌పూర్‌లో శనివారం షా మీడియాతో మాట్లాడారు. హింసావాదాన్ని వీడాలని ఆయన నక్సల్స్‌కు పిలుపునిచ్చారు. లొంగుబాట పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒకట్రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ప్రజా స్వామ్యానికి పెనుముప్పుగా మారి న నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయార న్నారు. 2004–14 సంవత్సరాలతో పోలిస్తే 2014–24ల నాటికి దేశంలో నక్సల్ సంబంధిత ఘటనల్లో సగానికి పైగా, అంటే 53 శాతం తగ్గుదల నమోదైంద న్నారు. వామపక్ష తీవ్రవాదా న్ని తుదిదెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తు న్నామని, భద్రతా సిబ్బందిని కూంబింగ్ ఆపరేషన్లతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగస్వాముల ను చేస్తున్నామన్నారు. మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు ఎన్ఐఏ, ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయ పరుస్తున్నామని చెప్పారు. బహు ముఖ వ్యూహంతో 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలి స్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీఅంతకుముందు, కేంద్ర మంత్రి అమిత్ షా రాయ్‌పూర్‌లో మావోయిస్ట్ నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకున్నారు. -
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు ఈ ఎన్కౌంటర్లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన మృతులు 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ -
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
మనోజ్ ‘మల్లఖంబ్’ శిక్షణ.. ఒలింపిక్స్‌లో నలుగురు పిల్లలు
రాయ్‌పూర్: దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మన జవాన్లు.. మరో అడుగు ముందుకేసి సరిహద్దు సమస్యలేగాక దేశంలో కొన్ని అంతర్గత సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. చత్తీస్ఘడ్ ఆర్మడ్ ఫోర్స్(సీఏఎఫ్) కానిస్టేబుల్ మనోజ్ ప్రసాద్ .. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలను హింసవైపు మళ్లకుండా ఉంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ అటవీ ప్రాంతంలోని పిల్లలకు ‘మల్లఖంబ్’ అనే సంప్రదాయ ఆటలో శిక్షణ ఇచ్చి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అబుజ్మద్ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ వంటివి అందుబాటులో లేవు. ఇటువంటి వెనకబడిన ప్రాంతంలో పుట్టిన ఓ నలుగురు పిల్లలు జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్ లో ‘మల్లఖంబ్’ ప్రదర్శనకు ఎంపికయ్యారు. 2016లో మనోజ్ ప్రసాద్ మల్లఖంబ్‌ను స్వయంగా నేర్చుకుని... ఆతరువాత 2016–17 మధ్యకాలంలో నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని గిరిపుత్రుల పిల్లలకు ఉచితంగా మల్లఖంబ్‌ను నేర్పించడం ప్రారంభించారు. ప్రసాద్ దగ్గర శిక్షణ తీసుకున్న నలుగురు విద్యార్థులు ఈ ఏడాది జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మల్లఖంబ్‌ను ప్రదర్శించడానికి ఎంపికయ్యారు. ఈ నలుగురు ఈ ఆటను ప్రదర్శించడంలో ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ప్రసాద్ చెప్పారు.‘‘ నారాయణపూర్‌లో నేను శిక్షణ ప్రారంభించక ముందు ఇక్కడి ప్రజలకు మల్లఖంబ్ అంటే ఏంటో తెలియదు. నేను ట్రైనింగ్ ప్రారంభించిన రెండుమూడేళ్లలోనే ఇక్కడి విద్యార్థులు దేశస్థాయిలో జరిగే మల్లఖంబ్ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలను గెలుచుకున్నారని ప్రసాద్ తెలిపారు. 2019–20 మధ్యకాలంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, గోవాలో జరిగిన మల్లఖంబ్ టోర్నమెంట్స్, అఖిల భారత స్థాయి పోటీలో పాల్గొని సీనియర్ గ్రూపుతో ఆడి స్వర్ణపతకాలు గెలిచారు. 2020 మార్చిలో 8 స్వర్ణపతకాలు, 3 కాంస్య పతకాలు, ఇండియా అండర్–14లో నలుగురు అమ్మాయిలు బెస్ట్ ఆఫ్ సిక్స్‌గా నిలిచారు. ఇది మామూలు విషయం కాదు. గత నలభై ఏళ్లుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మల్లఖంబ్ విద్యలో ఎంతో అనుభవంతో ఉన్నాయి. అటువంటి రాష్ట్రాలను నా స్టూడెంట్స్ డీ కొట్టడానికి చాలా కష్టపడ్డారని, రాత్రి పగలని తేడాలేకుండా తీవ్రంగా కృషి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారని’’ ప్రసాద్ చెప్పారు. మల్లఖంబ్ ...మల్ల అంటే రెజ్లర్ అని, కంంబా అంటే పోల్ అని అర్థం. నిట్ట నిలువుగా ఉన్న పోల్ లేదా రోప్‌పై జిమ్నాస్టిక్స్ చేయడమే మల్లఖంబ్ ఆట ప్రత్యేకత. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రీడను ఎక్కువ సాధన చేసేవారు ఉండడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రీడగా మల్లఖంబ్‌ను ప్రకటించారు. -
ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతి
సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. శనివారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం 17 మంది పోలీసులు కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి. ఆదివారం రోజున అడవుల్లో పోలీసుల మృతదేహాలను గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. కాగా, శనివారం రోజున స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్ట్స్‌కు ప్రత్యేక బలగాలు కుంబింగ్ చేపట్టాయి. అయితే బలగాలు మిన్పా గ్రామానికి చేరుకున్న సమయంలో.. అక్కడ భారీగా మోహరించిన నక్సల్స్ ఎదుకాల్పులకు దిగాయి. దాదాపు రెండున్నర గంటల పాటు ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఈ కాల్పుల్లో 15 మంది భద్రత సిబ్బంది గాయపడగా, 17 మంది కనిపించకుండా పోయారు. -
తుపాకీ చేతపట్టిన 8 నెలల గర్భవతి
రాయ్‌పూర్ : నక్సల్ ఏరివేతలో భాగంగా ఎనిమిది నెలల గర్భవతి విధులు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నక్సల్ కార్యక్రమాలను అరికట్టడంలో భాగంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ అనే మహిళా కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటోంది. నక్సల్స్‌లో పోరు అంటేనే ఎంతో ప్రమాదకరమైనది అయినా ఏమాత్ర భయం లేకుండా దట్టమైన అడవిలో బంధుకు చేతబూని దూసుకుపోతోంది. దీనిపై సునైనా మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరినప్పుడు రెండు నెలల గర్భవతి అని చెప్పారు. తాను పరిస్థితుల్లో ఉన్నా.. తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే దన అంతిమ లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన ఈ వృత్తిలో కొనసాగడానికి తనకు ఏమాత్రం భయం లేదన్నారు. కాగా విధిపై తనకున్న అంకితభావానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డుగా విధుల్లో ఉన్నారు. -
17 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే.....
సాక్షి, న్యూఢిల్లీ : ‘అది అటవి ప్రాంతం. దాదాపు 20 మంది కరడుగట్టిన తిరుగుబాటుదారులు అక్కడ సమావేశమయ్యారు. వారిని చుట్టుముట్టిన సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. హాహాకారాలు మిన్నంటాయి. ఆరుగురు పిన్నలు సహా 17 మంది తిరుగుబాటుదారుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ సంఘటనలో కొంత మంది సాయుధులు గాయపడ్డారు. తిరుగుబాటుదారుల వద్ద ఒక్క తుపాకీగానీ, బాంబుగానీ దొరకలేదు. వాటన్నింటిని మిగతా ముగ్గురు తిరుగుబాటుదారులు పట్టుకొని పారిపోయి ఉంటారు’ ఇది దాదాపు ఏడున్నర ఏళ్ల క్రితం అంటే, 2012, జూన్ 28వ తేదీ రాత్రి చత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, సర్కేగూడ గ్రామం శివారులో జరిగింది. వారు తిరుగుబాటుదారులు ఎంత మాత్రం కాదని, వారంతా సర్కేగూడ గ్రామానికి చెందిన సాధారణ ప్రజలని తేలింది. కాల్పులు జరిపిందీ మరెవరో కాదు, సీఆర్పీఎఫ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు. ఆ సంయుక్త సాయుధ దళం నక్సలైట్ల కోసం గాలిస్తూ ఆ రాత్రి అటు గుండా వెళుతుండగా, ఓ చోటు చెట్ట వద్ద మనుషుల అలికిడి వినిపించింది. వారంతా నక్సలైట్లు కాబోలు అని పోలీసులు భావించారు. అర్దచంద్రాకారంలో వారిని చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే హాహాకారాలు చేస్తూ ఆరుగురు పిల్లలు సహా 17 మంది గ్రామస్థులు రక్తం మడుగులో ప్రాణాలు వదిలారు. పోలీసులు అర్దచంద్రాకారంలో చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వారి తుపాకీ గుండ్లే వారికి తగిలి కొంత మంది గాయపడ్డారు. ప్రతిరోజు గ్రామస్థులు ఆ చిట్టి గ్రామం శివారులో వెన్నెల వాకిల్లో గుమిగూడి పిచ్చాపాటి మాట్లాడుకోవడం పరిపాటి. ఈ అలవాటే అనుకోకుండా వారి ప్రాణాలను తీసింది. ఈ విషయాలను మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ తన నివేదికలో వెల్లడించారు. ఆయన ఇటీవల ఈ మేరకు ఓ నివేదికను చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించగా, అందులోని విషయాలను ఓ ఆంగ్ల పత్రిక బయట పెట్టింది. ఈ విషయాలన్నీ నిజమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం నాడు ధ్రువీకరించారు. ఇంకా ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ పరిశీలనకు రాలేదని, కేబినెట్ సమావేశంలో నివేదిక మీద నిర్ణయం తీసుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని అప్పట్లో అన్ని వర్గాలు ఆందోళన చేయగా, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి రామన్ సింగ్, విచారణకు 2012, జూలై 11వ తేదీన ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సంచలనం సష్టించిన ‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో ప్రజాసంఘాలతోపాటు పార్టీలకు అతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో నేరస్థులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 17 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న నేరస్థులకు ఏ శిక్ష విధించాలంటారో వారు స్పందిస్తేగానీ తెలియదు. నేటి వరకు ఎవరి నుంచి ఏ స్పందనా పెద్దగా రాలేదు. చనిపోయిన వారంతా ఆదివాసులు. వారి ప్రాణాలకు విలువలేదంటూ వదిలేస్తారా!? -
మావోయిస్టుకు జవాన్ల రక్తదానం
జంషెడ్పూర్: కేంద్ర రిజర్వు పోలీస్ దళం(సీఆర్పీఎఫ్) జవాన్లు మానవత్వం చూపారు. ఎన్కౌంటర్లో తీవ్ర గాయాలతో పట్టుబడ్డ ఓ మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయమై జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) చందన్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ‘పశ్చిమ సింగ్భమ్లోని ఓ ప్రాంతంలో జోనల్ కమాండర్ కండే హోన్హగా నేతృత్వంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు 14వ తేదీన సమాచారం అందింది. దీంతో ఏఎస్పీ(ఆపరేషన్స్) మనీశ్ రమణ్ నేతృత్వంలో సీఆర్పీఎఫ్, పోలీసుల బృందం ముఫ్పస్సిల్–గోయిల్కెరా ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు లొంగిపోవాల్సిందిగా కోరాయి. అయితే మందుపాతరను పేల్చిన మావోలు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఘటనాస్థలంలో బుల్లెట్ తగిలి రక్తస్రావమవుతున్న మహిళా మావోయిస్టును బలగాలు గుర్తించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ మావోయిస్టు ప్రాణాలను కాపాడేందుకు ఏఎస్సై పంకజ్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ బిచిత్ర కుమార్, కానిస్టేబుల్ బిర్బహదూర్ యాదవ్ రక్తదానం చేశారు’ అని తెలిపారు. ఓ దాడికి ప్రణాళిక రచించేందుకు అక్కడ సమావేశమయ్యామనీ, పోలీసుల కాల్పులు ప్రారంభం కాగానే తన తుపాకీని వాళ్లు తీసేసుకున్నారని ఆ మావోయిస్టు చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
ఎన్డీ దళ కమాండర్ రామన్న అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, దళకమాండర్ సింగనబోయిన వీరభద్రం అలియాస్ రామన్నను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి ఒక ఎస్ఎల్ఆర్తో పాటు 20 తూటాల మ్యాగ్జిన్, ఒక ల్యాప్‌ట్యాప్, పార్టీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట రామన్న స్వస్థలం. 22 ఏళ్లుగా వివిధ హోదాల్లో, ప్రాంతాల్లో యూజీగా (అజ్ఞాతంలో) పని చేసి నాలుగు హత్య కేసులు, పోలీసులతో ఎదురుకాల్పులకు సంబంధించి రెండు కేసులు, అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అదే విధంగా కాంట్రాక్టర్లను బెదిరించిన కేసుల్లో రామన్న నిందితుడిగా ఉన్నాడు. రామన్నపై ఉన్న కేసుల వివరాలు.. 1986లో బోడు పోలీస్ స్టేషన్ ఏరియా, భద్రాద్రి కొత్తగూడెంలో పని చేస్తూ లచ్చగూడెం గ్రామంలో పూణెం వీరయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు. అదే విధంగా బయ్యారం గ్రామంలో జరిగిన పోతురాజు గోపి హత్య కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 2008లో గంధంపల్లి గ్రామంలో రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి హత్య కేసులో దళంతోపాటు పాల్గొన్నాడు. ఈ కేసులో కూడా అరెస్టయ్యాడు. 2017లో పాల్వంచకు చెందిన రాయల భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం రామన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను నియమించబడి పార్టీ చందాల కోసం కాంట్రాక్టర్లను, బీడీ ఆకుల, సింగరేణి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎస్ఎల్ఆర్, ల్యాప్‌ట్యాప్, బుల్లెట్లు, విప్లవ సాహిత్యం 2017 ఏడాది సెప్టెంబర్ 21న బోడు పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్న దళంతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. 2018 మార్చి 17న రామన్నదళం పాల్వంచ రూరల్ ఏరియాలో తిరిగి పోలీస్ పార్టీలపై కాల్పులు జరిపాడు. ఆ కేసులో ఒక దళ సభ్యుడు తుపాకీతో పాటు పోలీసులకు దొరికాడు. రామన్న తప్పించుకుని పారిపోయాడు. ఆయన మొత్తం పది కేసుల్లో నిందితుడు. ఆ తరువాత అశోక్దళంతో కలిసి ఎక్కువకాలం మహబూబాబాద్ జిల్లాలోనే ఉంటూ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలోని చెరువు కట్టవద్ద అశోక్, బెజ్జం ప్రతాప్, ఇతర దళ సభ్యులతో కలిసి తుపాకులు దాచిపెట్టి సాధారణ దుస్తులతో వచ్చి రామన్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి సమావేశమయ్యాడు. కొంతమంది ఎన్డీ పార్టీకి చెందిన గ్రామస్తులను పిలిపించుకుని సమావేశం అవుతుండగా ఆ సమాచారం అందుకున్న డోర్నకల్ సీఐ జె. శ్యాంసుందర్, ఎస్సై అంబాటి రవీందర్, వారి సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వెంటనే రామన్నను ఒక బ్యాగ్‌తో సహా అరెస్ట్ చేశారు. మిగతవారు పరారయ్యారు. రామన్న ఇచ్చిన సమాచారం మేరకు బయ్యారం మండలం పందిపంపులకు వెళ్లి మురళీకృష్ణ దాచిపెట్టిన ఎస్ఎల్ఆర్ ఆయుధం, దానికి సంబంధించిన ఒక మ్యాగ్జిన్ అందులోని 20 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతావారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అనేక ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రామన్నను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. త్వరలోనే వారికి రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, సీఐలు శ్యాంసుందర్, లింగయ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
అలా చేస్తే నక్సలైట్ అవుతా.. షాకిచ్చిన పోలీస్!
జనిగిర్-చంపా : ఓ కానిస్టేబుల్ వినూత్న రీతిలో పై అధికారులను బెదిరించాడు. విధుల నుంచి తొలగిస్తే నక్సలైట్‌గా మారుతానని ఉన్నతాధికారులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన అధికారులతో మాట్లాడిన సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌కు చెందిన పుష్పరాజ్ సింగ్ అనే వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో అనుమతి లేకుండానే తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నాడు. దీంతో పై అధికారి పుష్పరాజ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నోటీసులు పంపారు. కోపోద్రిక్తుడైన పుష్పరాజ్ అధికారులకు ఫోన్ చేసి.. విధుల్లోకి తీసుకోకపోతే నక్సలైట్‌గా లేదా ఐఎస్ఐ తీవ్రవాదిగా మారి అందరి అంతు చూస్తానని బెదిరించాడు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అయింది. కాగా గత శుక్రవారమే పుష్పరాజ్‌ను సస్పెండ్ చేశామని జిల్లా ఎస్పీ నీతూ కమల్ పేర్కొన్నారు. -
లొంగిపోయిన దళ సభ్యురాలు
భద్రాచలం : మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ దళ సభ్యురాలు మడకం లక్ష్మి అలియాస్ వెన్నెల భద్రాచలం ఏఎస్పీ ఎదుట బుధవారం లొంగిపోయింది. ఈ మేరకు వివరాలను ఏఎస్పీ భాస్కరన్ తన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. చర్ల మండలం రాళ్లకట్ట గ్రామానికి చెందిన మడకం లక్ష్మి 2102లో మిలీషియా కమాండర్ జయరాం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు. నెలపాటు మిలీషియా సభ్యురాలిగా పనిచేసిన లక్ష్మి తరువాత వెంకటాపురం ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరిందన్నారు. వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సునీతకు గార్డుగా పని చేసిందన్నారు. 2015 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఖమ్మం ఎస్జీఎస్లో పని చేస్తోందన్నారు. దళంలో పనిచేసిన కాలంలో బొట్టెంతోగు, మినప, కంచాల ఎన్కౌంటర్లు, చర్ల మండలం సత్యనారాయణపురం బీఎస్ఎన్ఎల్ టవర్ పేల్చివేత వంటి ఘటనల్లో పాల్గొందన్నారు. కుర్సం చేతు, మచ్చకి దారయ్య, భగత్, నీలం నరేష్ హత్య కేసు, వద్దిపేట, పూసుగుప్పు రోడ్డు తవ్విన కేసు, వద్దిపేట జేసీబీ తగులబెట్టిన కేసులతో సహా మొత్తం 12 కేసులు ఆమెపై నమోదైనట్లు వివరించారు. అనారోగ్య కారణాలతో లక్ష్మి లొంగిపోతున్నట్లు తమకు తెలిపిందన్నారు. ఆమెకు ప్రభుత్వ పరంగా రూ.5వేలను తక్షణ సహాయం కింద అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆమెపై గతంలో రూ.లక్ష రివార్డు ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో వెంకటాపురం సీఐ సాయిరమణ, చర్ల ఎస్సై రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘భద్రత’ నిర్ణయం ప్రధాన కార్యదర్శులదే..
సాక్షి, ముంబై: రాజకీయ ప్రముఖులకు ఏ స్థాయి భద్రత కల్పించాలో ప్రధాన కార్యదర్శులే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తనకు శత్రువులెవరూ లేరని, జెడ్ ప్లస్ స్థాయి భద్రత అవసరం లేదని ఇదివరకే ఫడ్నవిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారాలు తమవద్ద ఉంచుకోకుండా ప్రధాన కార్యదర్శులకే బాధ్యత అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు, ఇతర రంగాల వీవీఐపీ, వీఐపీలకు జెడ్ ప్లస్, జెడ్ లేదా వై, ఎక్స్ స్థాయి.. ఇలా వివిధ స్థాయిల్లో భద్రత కల్పించే అధికారం ఇదివరకు ముఖ్యమంత్రికి లేదా హోం శాఖ వద్ద ఉండేవి. భద్రత కంటే ‘స్టేటస్ సింబల్’కు ప్రాధాన్యత ఇచ్చే మంత్రులు జెడ్ ప్లస్, జెడ్ భద్రత కావాలని ప్రయత్నాలు చేస్తుండేవారు. అందుకు ముఖ్యమంత్రి లేదా హోం శాఖతో ఉన్న సంబంధాలను సద్వినియో గం చేసుకునేవారు. కాని ఇప్పడా అధికారాలు ప్రధాన కార్యదర్శుల చేతుల్లోకి వెళ్లాయి. సంబంధిత వీఐపీలు, కీలక నాయకులకు భద్రత కల్పించే ముందు వారి ప్రాణాలకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉంది...? ఏ స్థాయి భద్రత కల్పించాలి తదితర అంశాలను పరిగణంలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఆ ప్రకారం అవసరాన్ని బట్టి ఆ స్థాయి భద్రత వారికి సమకూర్చి ఇవ్వాలి. కాగా, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీలో ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని ఫడ్నవీస్ తెలిపారు. అడ్వకేట్ జనరల్‌గా సునీల్ నియామకం.. రాష్ట్రంలో కీలకమైన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది సునీల్ మనోహర్ నియమితులయ్యారు. ఇక్కడ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న అడ్వకేట్ దరాయస్ ఖంబాటా రాజీనామాను స్వీకరించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. సీనియర్ లాయరైన సునీల్ మనోహర్ నాగపూర్ యూనివర్సిటీలో లా పట్టా పొందారు. ముంబై హైకోర్టులోని నాగపూర్ బెంచిలో కీలక న్యాయవాదిగా ఉన్నారు. 27 సంవత్సరాలకు పైగా ఆయన న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. మంచి అనుభవమున్న వ్యక్తిగా ఇదివరకు హైకోర్టులో అనేక కీలక కేసులను వాధించారు. కాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉత్తమ సేవలందించినందుకుగాను దరాయస్ ఖంబాటాను కేబినెట్ సమావేశంలో అభినందించారు. కరువుపై సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనేలా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు అవసరమైతే వెంటనే కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై ఓ కమిటీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు. -
ప్రకాశం జిల్లాలో ఎన్కౌంటర్
-
అడుగడుగునా అడ్డుకుంటున్నాం
గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో నక్సల్స్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నామని పోలీస్ సూపరింటెండెంట్ సువేజ్ హక్ తెలిపారు. ఈ నెల 28న జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ‘గడ్జిరోలి జిల్లాలో పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేగాకుండా పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోలనలు సృష్టించి, తమ ఉనికిని చాటుకునేందుకు ఇదే సరైన సమయమని నక్సల్స్ భావిస్తున్నారు. ఇటీవల పోలీస్ కమెండోలపై రెండుసార్లు కాల్పులకు తెగబడడం ఇటువంటి ప్రయత్నమే. అయితే పోలీసులు వారి ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వారి దుశ్చర్యలను ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నాం. 28 వ తేదీని జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందగా, ఒక పోలీసు జవాన్ మరణించాడు. అయితే ఈ ఎన్కౌంటర్లో పెద్ద నాయకులు పాల్గొన్నారని భావిస్తున్నాం. సంఘటనాస్థలంలో తమకు పెద్ద మొత్తంలో మారణాయుధాలు లభ్యమయ్యాయి. వాటిలో 17 రౌండ్ల బుల్లెట్లు, 303 నంబర్ రైఫిల్, ఎస్ఎల్ఆర్ రైఫిల్‌కు చెందిన ఏడు బులెట్లు, ఎనిమిది ఖాళీ కేస్ రౌండ్లు, రెండు గ్రనేడ్లు, బ్యాటరీ, చార్జర్, ఔషధాలు, పుస్తకాలు, వంట చేసుకొనే వస్తువులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 27న గడ్చిరోలి జిల్లా గట్టా పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 29న ఓట్ల లెక్కింపు జరిగింది. 28న నక్సలైట్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారి ఆటలను సాగనీయలేదు. ఇకపై కూడా జిల్లాలో వారి కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకుంటా’మని చెప్పారు. -
సర్వీసు ఏరియాల్లోనే సేవలందించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గతంలో నక్సల్స్ ప్రభావం కారణంగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకుల సర్వీసులను తిరిగి పాత(సర్వీస్ ఏరియా) ప్రాంతాల్లోనే కొనసాగించాలని జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రూరల్ ప్రాంతాల్లో ఉండాల్సిన 31 బ్యాంకులు తిరిగి ఆయా ప్రాంతాల్లోనే సర్వీసులు కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి ఆమోదించారు. ఈ సందర్భంగా వివేక్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఖరీప్‌లో రైతులకు రూ.1,260 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంకాగా రూ.751 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సీజన్ పూర్తయ్యేనాటికి రుణాల లక్ష్యం పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. 13,813 మంది కౌలు రైతులకు రుణఅర్హత కార్డులివ్వగా 189 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారని, మిగతావారికి కూడా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 648 స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు రూ.17కోట్ల 37లక్షలు రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తికావడానికి అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి దాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ దత్, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ విజయగోపాల్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.