ఎన్డీ దళ కమాండర్‌ రామన్న అరెస్ట్‌ | New Democracy Commander Arrested In Mahabubabad District | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 6 2019 11:24 AM | Last Updated on Sun, Jan 6 2019 11:24 AM

New Democracy Commander Arrested In Mahabubabad District - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న రామన్న  

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌ : న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, దళకమాండర్‌ సింగనబోయిన వీరభద్రం అలియాస్‌ రామన్నను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు 20 తూటాల మ్యాగ్జిన్, ఒక ల్యాప్‌ట్యాప్, పార్టీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.   మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు.  మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట రామన్న స్వస్థలం. 22 ఏళ్లుగా వివిధ హోదాల్లో, ప్రాంతాల్లో యూజీగా (అజ్ఞాతంలో) పని చేసి నాలుగు హత్య కేసులు,  పోలీసులతో ఎదురుకాల్పులకు సంబంధించి రెండు కేసులు, అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అదే విధంగా కాంట్రాక్టర్లను బెదిరించిన కేసుల్లో రామన్న నిందితుడిగా ఉన్నాడు.    

రామన్నపై ఉన్న కేసుల వివరాలు..
1986లో బోడు పోలీస్‌ స్టేషన్‌ ఏరియా, భద్రాద్రి కొత్తగూడెంలో పని చేస్తూ లచ్చగూడెం గ్రామంలో పూణెం వీరయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు. అదే విధంగా బయ్యారం గ్రామంలో జరిగిన పోతురాజు గోపి హత్య కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 2008లో గంధంపల్లి గ్రామంలో రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి హత్య కేసులో దళంతోపాటు పాల్గొన్నాడు. ఈ కేసులో కూడా అరెస్టయ్యాడు. 2017లో పాల్వంచకు చెందిన రాయల భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్‌ కాలేదు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం రామన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను నియమించబడి పార్టీ చందాల కోసం కాంట్రాక్టర్లను, బీడీ ఆకుల, సింగరేణి కాంట్రాక్టర్‌లను బెదిరిస్తూ అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎస్‌ఎల్‌ఆర్, ల్యాప్‌ట్యాప్, బుల్లెట్లు, విప్లవ సాహిత్యం

2017 ఏడాది సెప్టెంబర్‌ 21న బోడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రామన్న దళంతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. 2018  మార్చి 17న రామన్నదళం పాల్వంచ రూరల్‌ ఏరియాలో తిరిగి పోలీస్‌ పార్టీలపై కాల్పులు జరిపాడు. ఆ కేసులో ఒక దళ సభ్యుడు తుపాకీతో పాటు పోలీసులకు దొరికాడు. రామన్న తప్పించుకుని పారిపోయాడు. ఆయన మొత్తం పది కేసుల్లో నిందితుడు. ఆ తరువాత అశోక్‌దళంతో కలిసి ఎక్కువకాలం మహబూబాబాద్‌ జిల్లాలోనే ఉంటూ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం డోర్నకల్‌ మండలం వెన్నారం గ్రామంలోని చెరువు కట్టవద్ద అశోక్, బెజ్జం ప్రతాప్, ఇతర దళ సభ్యులతో కలిసి తుపాకులు దాచిపెట్టి సాధారణ దుస్తులతో వచ్చి రామన్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి సమావేశమయ్యాడు. కొంతమంది ఎన్డీ పార్టీకి చెందిన గ్రామస్తులను పిలిపించుకుని సమావేశం అవుతుండగా ఆ సమాచారం అందుకున్న డోర్నకల్‌ సీఐ జె. శ్యాంసుందర్, ఎస్సై అంబాటి రవీందర్, వారి సిబ్బంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వెంటనే రామన్నను ఒక బ్యాగ్‌తో సహా అరెస్ట్‌ చేశారు. మిగతవారు పరారయ్యారు.

రామన్న ఇచ్చిన సమాచారం మేరకు బయ్యారం మండలం పందిపంపులకు వెళ్లి మురళీకృష్ణ దాచిపెట్టిన ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం, దానికి సంబంధించిన ఒక మ్యాగ్జిన్‌ అందులోని 20 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతావారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అనేక ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రామన్నను పట్టుకున్న  సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. త్వరలోనే వారికి రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్, సీఐలు శ్యాంసుందర్, లింగయ్య, రవికుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement