Surrendered Naxalites
-
ఛత్తీస్‌గఢ్‌లో 20 మంది మావోయిస్టులు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వీరంతా అమానవీయ మైన, పసలేని మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగినట్లు తెలిపారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. లొంగుబాటపట్టిన వారిలో మిలిషియా డిప్యూటీ కమాండర్ ఉయిక లఖ్మా, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్(డీఏకేఎంఎస్), క్రాంతికారీ మహళా ఆదివాసీ సంఘటన్(కేఏఎంఎస్), చేతన నాట్య మండలి(సీఎన్ఎం)లకు చెందిన సభ్యులున్నార న్నారు. జిల్లాలోని జాగర్‌గుండా పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావా స కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు. -
44 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్:మావోయిస్టు పార్టీకి చెందిన 9మంది మహిళలతో సహా 44మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కరిగుండం వద్ద లొంగిపోయారు. సుక్మా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పున నాకం అభియాన్’(కొత్త ఉదయం-కొత్త ప్రారంభం) ప్రభావంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో ఓ నక్సలైట్‌పై ప్రభుత్వం రూ.2లక్షల రివార్డును ప్రకటించింది. కొంతమంది కారిగుండం గ్రామ పరిసర ప్రాంతాల చెందిన కొత్తవారు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు, వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు పోలీసులు ఆహారం అందించారు. లొంగిపోయిన నక్సలైట్లందరికీ ప్రభుత్వం పునరావాస పథకాల ప్రయోజనం అందజేస్తుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
లొంగిపోయిన ఆర్కే ప్రొటెక్షన్ పార్టీ మావోయిస్టు
సాక్షి, కొరాపుట్: ఒకవైపు పీఎల్జీఏ వారోత్సవాలు కొనసాగుతుండగా మావోయిస్టు ప్రభావిత మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు కొరాపుట్ ఎస్పీ ముకేశ్‌కుమార్ భాము ముందు స్వచ్ఛందంగా లొంగిపోవడం ప్రధాన్యత సంతరించుకుంది. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ.. వివరాలను వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబ గ్రామానికి చెందిన శుక్ర మడ్కామి కుమార్తె.. రామె మడ్కామీ. 2013లో సాంస్కృతిక జన నాట్యమండలి బృందంలో చేరి అనంతరం, తన 16వ ఏట మావోయిస్టులకు దగ్గరైంది. మిలటరీ శిక్షణ, 303 రైఫిల్ వినియోగంపై పూర్తి శిక్షణ పొందింది. అనంతరం ఇన్సాస్ రైఫిల్ శిక్షణ కూడా పూర్తి చేసి, ఏసీఎం కేడర్ వరకు ఎదిగింది. ఈ నేపథ్యంలో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం ఏఓబీఎస్‌జెడ్‌సీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా, ప్రముఖ మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ పార్టీలో క్రియాశీలక పాత్రను వహిస్తూ.. ఏసీఎం కేడర్‌లో పనిచేస్తోంది. ఆమెపై కొరాపుట్, మలకనగిరి జిల్లాల్లో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై రూ.4 లక్షల రివార్డును కూడా ప్రభుత్వ ప్రకటించింది. సిద్ధాంతాలను నీరు గార్చుతున్నారు.. రామె మడ్కామీ స్వచ్ఛందంగా లొంగిపోవడంతో ఆమెకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు సొమ్ము, పునరావాస సదుపాయాలను అందించనున్నట్లు ఎస్పీ భాము వెల్లడించారు. అలాగే పూర్తిగా విచారణ చేపట్టి, మావోయిస్టుల కార్యకలాపాల వివరాలను రాబట్టనున్నట్లు తెలిపారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. ఈ సందర్భంగా మహిళా మావోయిస్టు రామె మడ్కామీ మీడియా ప్రతినిధులకు తన లొంగుబాటుకు గల కారణాలను వివరించింది. ప్రస్తుతం మావోయిస్టులు ఆదివాసీ అభ్యుదయ సిద్ధాంతాలకు తిలోదకాలు పలికి, గిరిజనులపై పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి, హత్యకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పోలీసులతో ఎదురు కాల్పుల సమయంలో పెద్ద కేడర్‌లో ఉన్నవారు తప్పుకుని, చిన్న చిన్న కేడర్ వారిని తుపాకీ గుళ్లకు బలి చేస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ గ్రామీణ, ఆదివాసులకు తీరని అన్యాయం చేయడం దారుణమని పేర్కొంది. తెలిసో.. తెలియకో మావోయిస్టుల మాయాజాలంలో చిక్కుకుని క్షణక్షణం భయం గుప్పెట్లో.. అటవీ ప్రాంతంలో అజ్ఞాతంగా 7 ఏళ్లు నరకయాతన చూశానని, జనజీవన స్రవంతిలోకి వచ్చి కుటుంబంతో పాటు జీవించాలన్న ఆశతో పోలీసుల ముందు లొంగిపోయినట్లు వెల్లడించారు. తన వంటి వారు విజ్ఞతతో మేల్నొని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని మడ్కామీ పిలుపునిచ్చింది. -
ఎన్డీ దళ కమాండర్ రామన్న అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, దళకమాండర్ సింగనబోయిన వీరభద్రం అలియాస్ రామన్నను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి ఒక ఎస్ఎల్ఆర్తో పాటు 20 తూటాల మ్యాగ్జిన్, ఒక ల్యాప్‌ట్యాప్, పార్టీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట రామన్న స్వస్థలం. 22 ఏళ్లుగా వివిధ హోదాల్లో, ప్రాంతాల్లో యూజీగా (అజ్ఞాతంలో) పని చేసి నాలుగు హత్య కేసులు, పోలీసులతో ఎదురుకాల్పులకు సంబంధించి రెండు కేసులు, అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అదే విధంగా కాంట్రాక్టర్లను బెదిరించిన కేసుల్లో రామన్న నిందితుడిగా ఉన్నాడు. రామన్నపై ఉన్న కేసుల వివరాలు.. 1986లో బోడు పోలీస్ స్టేషన్ ఏరియా, భద్రాద్రి కొత్తగూడెంలో పని చేస్తూ లచ్చగూడెం గ్రామంలో పూణెం వీరయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు. అదే విధంగా బయ్యారం గ్రామంలో జరిగిన పోతురాజు గోపి హత్య కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 2008లో గంధంపల్లి గ్రామంలో రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి హత్య కేసులో దళంతోపాటు పాల్గొన్నాడు. ఈ కేసులో కూడా అరెస్టయ్యాడు. 2017లో పాల్వంచకు చెందిన రాయల భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం రామన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను నియమించబడి పార్టీ చందాల కోసం కాంట్రాక్టర్లను, బీడీ ఆకుల, సింగరేణి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎస్ఎల్ఆర్, ల్యాప్‌ట్యాప్, బుల్లెట్లు, విప్లవ సాహిత్యం 2017 ఏడాది సెప్టెంబర్ 21న బోడు పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్న దళంతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. 2018 మార్చి 17న రామన్నదళం పాల్వంచ రూరల్ ఏరియాలో తిరిగి పోలీస్ పార్టీలపై కాల్పులు జరిపాడు. ఆ కేసులో ఒక దళ సభ్యుడు తుపాకీతో పాటు పోలీసులకు దొరికాడు. రామన్న తప్పించుకుని పారిపోయాడు. ఆయన మొత్తం పది కేసుల్లో నిందితుడు. ఆ తరువాత అశోక్దళంతో కలిసి ఎక్కువకాలం మహబూబాబాద్ జిల్లాలోనే ఉంటూ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలోని చెరువు కట్టవద్ద అశోక్, బెజ్జం ప్రతాప్, ఇతర దళ సభ్యులతో కలిసి తుపాకులు దాచిపెట్టి సాధారణ దుస్తులతో వచ్చి రామన్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి సమావేశమయ్యాడు. కొంతమంది ఎన్డీ పార్టీకి చెందిన గ్రామస్తులను పిలిపించుకుని సమావేశం అవుతుండగా ఆ సమాచారం అందుకున్న డోర్నకల్ సీఐ జె. శ్యాంసుందర్, ఎస్సై అంబాటి రవీందర్, వారి సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వెంటనే రామన్నను ఒక బ్యాగ్‌తో సహా అరెస్ట్ చేశారు. మిగతవారు పరారయ్యారు. రామన్న ఇచ్చిన సమాచారం మేరకు బయ్యారం మండలం పందిపంపులకు వెళ్లి మురళీకృష్ణ దాచిపెట్టిన ఎస్ఎల్ఆర్ ఆయుధం, దానికి సంబంధించిన ఒక మ్యాగ్జిన్ అందులోని 20 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతావారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అనేక ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రామన్నను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. త్వరలోనే వారికి రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, సీఐలు శ్యాంసుందర్, లింగయ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
సీఎంతో కలిసి మ్యాచ్ వీక్షించిన మాజీ నక్సల్స్
సాక్షి, భువనేశ్వర్: నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒడిశా పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసంతోపాటు మంచి జీవితం దొరుకుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే లొంగిపోయిన వారు సమాజంలో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిలోని ఈ భావాన్ని పొగొట్టడానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన వంతు ప్రయత్నం చేశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో గురువారం భారత్, నెదర్లాండ్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌ను ఆయన లొంగిపోయిన నక్సల్స్‌తో కలిసి వీక్షించారు. దాదాపు 30 మంది మాజీ నక్సల్స్ సీఎం పక్కన కూర్చుని మ్యాచ్‌ను చూశారు. వీరిలో 16 మంది మహిళ నక్సలైట్లు ఉన్నారు. ఇటీవల లొంగిపోయిన నక్సల్స్ తమకు హాకీ మ్యాచ్ చూడాలని కోరికగా ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. వారి కోరిక మేరకు ఇతర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన మల్కాన్‌గిరి ఎస్పీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళింగ స్టేడియంకు వెళ్లిన మాజీ నక్సల్స్ తాము సీఎం పక్కన కూర్చుని మ్యాచ్ వీక్షించబోతున్నామనే విషయం తెలుసుకుని మరింత ఆనందపడ్డారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు జీవితకాలం గుర్తిండి పోతుందని పేర్కొన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేము నిజంగా జనజీవన స్రవంతిలో(సమాజంలో) కలిశామని భావిస్తున్నాం. లొంగిపోయిన నక్సల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చాలా తోడ్పాటు అందిస్తుంద’ని తెలిపారు. -
మావో కీలకనేతల లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక నేతలు కోటి పురుషోత్తం(68), వినోదిని(63) దంపతులు మంగళవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఎదుట లొంగిపోయారు. వీరు మావోయిస్టు పార్టీ యాజిటేషన్ ప్రాపగాండ కమిటీ(ఏపీసీ)లో కీలకంగా వ్యవహరించారు. వీరు పార్టీ అగ్రనేతలు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు. రీజనల్ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న పురుషోత్తంపై రూ.8 లక్షలు, దళ కమాండర్ హోదాలో ఉన్న వినోదినిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వీరు ఏ విధ్వంసంలోనూ పాల్గొనలేదని, రివార్డులు వారి హోదాలపై మాత్రమే ఉన్నాయని అంజనీకుమార్ తెలిపారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తి నుంచే... నగరంలోని భోలక్‌పూర్‌కు చెందిన పురుషోత్తం 1974లో నల్లకుంట కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బ్యాచులర్ డిగ్రీ, 1987లో ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1981లో అడ్డగుట్టలోని ఓ స్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఈ వృత్తిలో ఉండగానే ఈయనకు అప్పటి నక్సలైట్ నేతలు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, కేజీ సత్యమూర్తిలతో పరిచయం ఏర్పడింది. వారి ప్రభావంతో 1981లో పురుషోత్తం తన 31వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు. నగరంలోని అడ్డగుట్టకు చెందిన వినోదిని అలియాస్ విజయలక్ష్మి అలియాస్ భారతక్క తండ్రి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఆమె చిన్నతనంలోనే కన్నుమూశారు. ఆమె 1982లో అడ్డగుట్టలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. వృత్తుల నేపథ్యంలోనే పరిచయమైన వీరు 1982లో వివాహం చేసుకున్నారు. శివశంకర్ కుమారుడి కిడ్నాప్‌తో విడుదల పురుషోత్తం 1981 నుంచి 1986 వరకు మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. వివాçహానంతరం వినోదిని సైతం తన 27వ ఏట మావోయిస్టు పార్టీలో చేరడంతో భార్యాభర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా పార్టీలో పనిచేశారు. 1991 మార్చ్‌లో వీరిద్దరితోపాటు అప్పటి రాష్ట్ర కమిటీ సభ్యుడు నిమ్మలూరి భాస్కర్‌రావు, జిల్లా కమిటీ సభ్యుడు సమ్మిరెడ్డి అరెస్టు అయ్యారు. అదే ఏడాది మేలో నాటి కేంద్రమంత్రి పి.శివశంకర్ కుమారుడు, యూత్ కాంగ్రెస్‌నేత పి.సుధీర్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కిడ్నాప్ చేశారు. వారి డిమాండ్ మేరకు విడుదలైన నలుగురు నక్సలైట్ నేతల్లో పురుషోత్తం, వినోదిని సైతం ఉన్నారు. బయటకు వచ్చాక మళ్లీ పార్టీ వైపు... జైలు నుంచి బయటకు వచ్చిన పురుషోత్తం 1996 వరకు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వినోదిని నల్లమల అటవీ ప్రాంత ప్రకాశం, ఆంధ్రా ఒడిశా బోర్డర్, అనంతగిరి, ఉద్దానం, శ్రీకాకుళం దళాల్లో 1996 వరకు పనిచేశారు.1996 నుంచి 2005 వరకు సబ్–కమిటీ ఆన్ పొలిటికల్ ఎడ్యుకేషన్(స్కోప్)లో విధులు నిర్వర్తించారు. చెన్నైకు వెళ్లి అక్కరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతి ఆదేశాల మేరకు కొంతకాలం పనిచేశారు. పురుషోత్తం 13 ఏళ్లపాటు కొరియర్లు అందించే లేఖల ద్వారా ఆర్కేతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ సమయంలో వినోదిని డీటీపీ వర్క్ చేసేవారు. ఈమె అనారోగ్యం కారణంగా ఇద్దరూ 2014లో హైదరాబాద్‌కు వచ్చేశారు. వినోదిని గత ఏడాది నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతోపాటు ఇతర కారణాలతో వీరిద్దరూ మంగళవారం నగర పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయారు. -
మావోయిస్టు నేత ఆర్కే అసమర్థుడు
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన మావోయిస్టుపార్టీ కీలకనేత కోటి పురుషోత్తం ఆ పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్కే అసమర్థుడని, ఆయనకు స్వార్థం ఎక్కువని, ఎదుటివారిని ఎదగనీయడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో పాత్రధారులం కావాలనే ఆకాంక్షతోనే జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. ఇటీవల ఏపీలోని విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు ఘోర తప్పిదాలని అన్నారు. వీటిపై పార్టీలో విభేదాలు ఉన్నాయని, అందుకే ఇప్పటివరకు ఈ హత్యలపై మావోయిస్టులు ప్రకటన చేయలేకపోయారన్నారు. పాతికేళ్లు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగానంటున్న పురుషోత్తం మీడియా సమావేశంలో పలు విషయాలు చెప్పారు... ‘స్వయంగా ఎదిగిన ఏకలవ్యుడి వేలు కోరే ద్రోణాచార్యులు, నమ్మించి చంపే బాహుబలిలోని కట్టప్ప లాంటి వాళ్లకు పార్టీలో కొదవ లేదు. కొన్నేళ్లుగా నేను, నా భార్య వినోదిని ఈ రెంటికీ గురయ్యాం. సుదీర్ఘకాలం ఆర్కే, గణపతిలతో కలసి ఉన్నా పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. వేరే రాష్ట్రంలో ఉంచి అక్కడ నుంచి రావద్దంటూ డబ్బు పంపకుండా వేధించింది. అక్కడ ఎలా ఉండా లో అర్థం కాక ఎన్నో లేఖలు రాశాం. ఏ జవాబు లేదు. పార్టీలో ఎవరి మేలు వారు చూసుకుంటున్నారు. అగ్రనాయకత్వం ఒడిదుడుకుల్లో ఉంది. పదేళ్లుగా ఆర్కే, గణపతి మారతారని ఎదురుచూశాం. అనేక సందర్భాల్లో వారిద్దరూ నా భార్య వినోదిని చేతివంట తిన్నారు. ఆమె పదేళ్లుగా అనారోగ్యంతో ఉందని తెలిసినా వారు పట్టించుకోలేదు. పార్టీలో మానవసంబంధాలు కనుమరుగయ్యాయి. అందుకే ఉద్యమం ప్రస్తుతం ఆదివాసీలకే పరిమితమైంది. కార్యక్రమాల్లో ఉన్న లోపాల కారణంగానే యువత, విద్యార్థులు పార్టీలోకి రావట్లేదు. వారు లేకుండా ఉద్యమం ఎక్కువకాలం నడవదు. అగ్రనేతలు 2007 లో ఏపీ(ఉమ్మడి) నుంచి సెట్‌బ్యాక్, రిట్రీట్ అంటూ ప్రకటించారు. వారి విజన్ దెబ్బతినడంతోనే అప్పటి నుంచి ముందుకు పోలేకపోతున్నారు. మాలాగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్యాడర్ మమ్మల్ని కలిసినప్పుడు బాధపడ్డారు. పదేళ్లుగా సెంట్రల్ కమిటీకీ ఉత్తరాలు రాస్తున్నా స్పందనలేదు. 1969, 1972ల్లో జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా జీవితంలో తెలంగాణ వస్తుందని అనుకోలేదు. 1946 నుంచి 2014 వరకు తెలంగాణ విధ్వంసమైంది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వల్ల 2014 నుంచి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగింది. ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అద్భుతం గా ఉన్నాయి. రాష్ట్రం కోసం మా వంతుగా సాయం చేయాలని ఆశిస్తున్నాం’అని పురుషోత్తం అన్నారు. బయటి రాష్ట్రంలో ఉండగా తాను ప్రింటింగ్ ప్రెస్ నడిపానని వినోదిని చెప్పారు. 2000లో తాను అనారోగ్యానికి గురైనా పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం తమను పట్టించుకుంటే అందులో కొనసాగేవారమే. కానీ, ఇప్పుడిక సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరింత మంది ముందుకు రావాలి ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తి చూపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న మరికొంత మంది మావోయిస్టు పార్టీ నేతలు పురుషోత్తం, వినోదినిలను స్ఫూర్తిగా తీసుకుని బయటకు రావాలి. బయటికి వచ్చినవారికి పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాలు వారికే అందించడంతోపాటు చిన్న, చిన్న ఉద్యోగాలు సైతం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. – అంజనీకుమార్, పోలీసు కమిషనర్ -
ఇద్దరు ఆజాద్ దళ సభ్యుల అరెస్ట్
సాక్షి, పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) ఆజాద్ దళానికి చెందిన ఇద్దరు అజ్ఞాత దళ సభ్యులను, ఒక తుపాకీతో పాటు అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఐ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, ఉల్వనూరు గ్రామాలకు చెందిన పూనెం నర్సింహారావు, అలియాష్ రమేష్, నెట్టి అమృతరావు కొంతకాలంగా ఎన్డీ ఆజాద్ దళంలో అజ్ఞాత దళ సభ్యులుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఎస్ఐ అనిల్ పెట్రోల్ నిర్వహిస్తుండగా బం జర ఏరియాలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో కన్పించిన ఇరువురుని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. నర్సింహారావు 1998–2005 వరకు జనశక్తి గ్రూపు రాజన్న దళంలో పనిచేశాడు. 2005లో పోలీసులకు లొంగిపోయిన తర్వాత మళ్లీ ఎన్డీ రాయల వర్గంలో ఆర్గనైజర్‌గా పనిచేస్తూ ఆజాద్ దళంలో పని చేస్తున్నాడు. అతని వద్ద 303 తూపాకీ, రైఫిల్ బుల్లెట్లు 30, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ.రాఘవేంద్రరావు, ఎస్ఐ.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
పాలకులు మోసం చేశారు
- పునరావాసం కల్పించాలి - మాజీ మావోరుుస్టుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష ప్రగతినగర్ : లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి పాలకులు తమను మోసం చేశారని మాజీ మావోయిస్టుల ఫోరం ఆరోపించింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాము జనజీవన స్రవంతిలో కలిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఉపాధి అవకాశాలు చూపిస్తామని గత పాలకులు హామీ ఇచ్చారని, అరుుతే ఇప్పటివరకూ తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. రాజీవ్ యువశక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంతా తమను మోసం చేస్తూనే ఉన్నారని వాపోయూరు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకున్నామని, మాజీ నక్సల్స్‌ను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చందు, ఫిరోజ్‌ఖాన్, బంజారరెడ్డి,చందర్, లక్షయ్య పాల్గొన్నారు.