లొంగిపోయిన మావో నేతలను మీడియాకు చూపిస్తూ వారి వివరాలు వెల్లడిస్తున్న అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక నేతలు కోటి పురుషోత్తం(68), వినోదిని(63) దంపతులు మంగళవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఎదుట లొంగిపోయారు. వీరు మావోయిస్టు పార్టీ యాజిటేషన్ ప్రాపగాండ కమిటీ(ఏపీసీ)లో కీలకంగా వ్యవహరించారు. వీరు పార్టీ అగ్రనేతలు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు. రీజనల్ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న పురుషోత్తంపై రూ.8 లక్షలు, దళ కమాండర్ హోదాలో ఉన్న వినోదినిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వీరు ఏ విధ్వంసంలోనూ పాల్గొనలేదని, రివార్డులు వారి హోదాలపై మాత్రమే ఉన్నాయని అంజనీకుమార్ తెలిపారు.
ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తి నుంచే...
నగరంలోని భోలక్‌పూర్‌కు చెందిన పురుషోత్తం 1974లో నల్లకుంట కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బ్యాచులర్ డిగ్రీ, 1987లో ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1981లో అడ్డగుట్టలోని ఓ స్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఈ వృత్తిలో ఉండగానే ఈయనకు అప్పటి నక్సలైట్ నేతలు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, కేజీ సత్యమూర్తిలతో పరిచయం ఏర్పడింది. వారి ప్రభావంతో 1981లో పురుషోత్తం తన 31వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు. నగరంలోని అడ్డగుట్టకు చెందిన వినోదిని అలియాస్ విజయలక్ష్మి అలియాస్ భారతక్క తండ్రి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఆమె చిన్నతనంలోనే కన్నుమూశారు. ఆమె 1982లో అడ్డగుట్టలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. వృత్తుల నేపథ్యంలోనే పరిచయమైన వీరు 1982లో వివాహం చేసుకున్నారు.
శివశంకర్ కుమారుడి కిడ్నాప్‌తో విడుదల
పురుషోత్తం 1981 నుంచి 1986 వరకు మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. వివాçహానంతరం వినోదిని సైతం తన 27వ ఏట మావోయిస్టు పార్టీలో చేరడంతో భార్యాభర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా పార్టీలో పనిచేశారు. 1991 మార్చ్‌లో వీరిద్దరితోపాటు అప్పటి రాష్ట్ర కమిటీ సభ్యుడు నిమ్మలూరి భాస్కర్‌రావు, జిల్లా కమిటీ సభ్యుడు సమ్మిరెడ్డి అరెస్టు అయ్యారు. అదే ఏడాది మేలో నాటి కేంద్రమంత్రి పి.శివశంకర్ కుమారుడు, యూత్ కాంగ్రెస్‌నేత పి.సుధీర్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కిడ్నాప్ చేశారు. వారి డిమాండ్ మేరకు విడుదలైన నలుగురు నక్సలైట్ నేతల్లో పురుషోత్తం, వినోదిని సైతం ఉన్నారు.
బయటకు వచ్చాక మళ్లీ పార్టీ వైపు...
జైలు నుంచి బయటకు వచ్చిన పురుషోత్తం 1996 వరకు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వినోదిని నల్లమల అటవీ ప్రాంత ప్రకాశం, ఆంధ్రా ఒడిశా బోర్డర్, అనంతగిరి, ఉద్దానం, శ్రీకాకుళం దళాల్లో 1996 వరకు పనిచేశారు.1996 నుంచి 2005 వరకు సబ్–కమిటీ ఆన్ పొలిటికల్ ఎడ్యుకేషన్(స్కోప్)లో విధులు నిర్వర్తించారు. చెన్నైకు వెళ్లి అక్కరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతి ఆదేశాల మేరకు కొంతకాలం పనిచేశారు. పురుషోత్తం 13 ఏళ్లపాటు కొరియర్లు అందించే లేఖల ద్వారా ఆర్కేతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ సమయంలో వినోదిని డీటీపీ వర్క్ చేసేవారు. ఈమె అనారోగ్యం కారణంగా ఇద్దరూ 2014లో హైదరాబాద్‌కు వచ్చేశారు. వినోదిని గత ఏడాది నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతోపాటు ఇతర కారణాలతో వీరిద్దరూ మంగళవారం నగర పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment