సాక్షి, కొరాపుట్: ఒకవైపు పీఎల్‌జీఏ వారోత్సవాలు కొనసాగుతుండగా మావోయిస్టు ప్రభావిత మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు కొరాపుట్ ఎస్పీ ముకేశ్‌కుమార్ భాము ముందు స్వచ్ఛందంగా లొంగిపోవడం ప్రధాన్యత సంతరించుకుంది. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ.. వివరాలను వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబ గ్రామానికి చెందిన శుక్ర మడ్కామి కుమార్తె.. రామె మడ్కామీ. 2013లో సాంస్కృతిక జన నాట్యమండలి బృందంలో చేరి అనంతరం, తన 16వ ఏట మావోయిస్టులకు దగ్గరైంది.
మిలటరీ శిక్షణ, 303 రైఫిల్ వినియోగంపై పూర్తి శిక్షణ పొందింది. అనంతరం ఇన్సాస్ రైఫిల్ శిక్షణ కూడా పూర్తి చేసి, ఏసీఎం కేడర్ వరకు ఎదిగింది. ఈ నేపథ్యంలో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం ఏఓబీఎస్‌జెడ్‌సీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా, ప్రముఖ మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ పార్టీలో క్రియాశీలక పాత్రను వహిస్తూ.. ఏసీఎం కేడర్‌లో పనిచేస్తోంది. ఆమెపై కొరాపుట్, మలకనగిరి జిల్లాల్లో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై రూ.4 లక్షల రివార్డును కూడా ప్రభుత్వ ప్రకటించింది.
సిద్ధాంతాలను నీరు గార్చుతున్నారు..
రామె మడ్కామీ స్వచ్ఛందంగా లొంగిపోవడంతో ఆమెకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు సొమ్ము, పునరావాస సదుపాయాలను అందించనున్నట్లు ఎస్పీ భాము వెల్లడించారు. అలాగే పూర్తిగా విచారణ చేపట్టి, మావోయిస్టుల కార్యకలాపాల వివరాలను రాబట్టనున్నట్లు తెలిపారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. ఈ సందర్భంగా మహిళా మావోయిస్టు రామె మడ్కామీ మీడియా ప్రతినిధులకు తన లొంగుబాటుకు గల కారణాలను వివరించింది. ప్రస్తుతం మావోయిస్టులు ఆదివాసీ అభ్యుదయ సిద్ధాంతాలకు తిలోదకాలు పలికి, గిరిజనులపై పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి, హత్యకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
పోలీసులతో ఎదురు కాల్పుల సమయంలో పెద్ద కేడర్‌లో ఉన్నవారు తప్పుకుని, చిన్న చిన్న కేడర్ వారిని తుపాకీ గుళ్లకు బలి చేస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ గ్రామీణ, ఆదివాసులకు తీరని అన్యాయం చేయడం దారుణమని పేర్కొంది. తెలిసో.. తెలియకో మావోయిస్టుల మాయాజాలంలో చిక్కుకుని క్షణక్షణం భయం గుప్పెట్లో.. అటవీ ప్రాంతంలో అజ్ఞాతంగా 7 ఏళ్లు నరకయాతన చూశానని, జనజీవన స్రవంతిలోకి వచ్చి కుటుంబంతో పాటు జీవించాలన్న ఆశతో పోలీసుల ముందు లొంగిపోయినట్లు వెల్లడించారు. తన వంటి వారు విజ్ఞతతో మేల్నొని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని మడ్కామీ పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment