
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా రాష్ట్ర మల్కన్‌గిరి జిల్లా జంతురాయి ఘటనపై మావోయిస్టులు స్పందించారు. ఏవోబీ ఎస్‌జడ్‌సీ ఆధికార ప్రతినిధి గణేష్ పేరుతో బుధవారం ఆడియో టేపులు విడుదల అయ్యాయి. జంతురాయి ఘటనపై పోలీసులు అసత్య ప్రచారం చేశారు. పోలీసు ఏజెంట్లు అదమ, జిప్రోను పట్టకొని కొట్టారు. నిరాయుధులు అయిన దళ సభ్యుల్ని చిత్ర హింసలకు గురిచేశారని గణేష్ ఆరోపించారు. అదమను హత్య చేసి.. జిప్రోను పోలీసులకు అప్పగించారన్నారు. పార్టీ ప్రజల పక్షానే ఉంది.. కటాఫ్‌లో పార్టీ సహకారంతో ప్రజలే 50 కిలోమీటర్ల రోడ్డును వేసుకున్నారని అయన తెలిపారు.
దీన్ని ఓర్వలేక ప్రజలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని గణేష్ మండిపడ్డారు. చుట్టు పక్కల గ్రామస్తులు వ్యతిరేకించినా చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిగా పోలీసు ఏజెంట్ల ఇళ్లను ప్రజలే తగలబెట్టారు. చేసిన తప్పును జొడంబో గ్రామస్తులు ఒప్పుకున్నారని.. వారిని ప్రజా జీవితంలో జీవించేందుకు పార్టీ ఒప్పుకుందని ఆయన తెలిపారు. పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్షవేస్తారు. ప్రజలపై పోలీస్ దాడులు ఆపకపోతే ప్రతిఘటన తప్పదు అని ఆ ఆడియో టేపుల్లో గణేష్ హెచ్చరించారు.