ఎన్‌కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ధ్రువీకరించిన సోదరులు 29 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడి
మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం టాప్ కమాండర్, ఆయన భార్య
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్‌ఎంజీ, ఇన్‌సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.
మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు
ఈ ఎన్‌కౌంటర్‌లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్‌కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
గుర్తించిన మృతులు
1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్
2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు
3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్‌చార్జి
4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్
5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ
6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్
7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్
8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్
9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్
Comments
Please login to add a commentAdd a comment