తెలంగాణ వైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ముమ్మర యత్నాలు
సరిహద్దుల్లో కాచుక్కూర్చున్న పోలీసు బలగాలు... మావోయిస్టు కీలక నేతలకు వృద్ధాప్యం..అనారోగ్య సమస్యలు
సేఫ్ జోన్లు చేజారుతుండడంతో అంతర్మథనం
2026 టార్గెట్ అని మరోసారి స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు సేఫ్ జోన్ వెతుకులాటలో పడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ ఎత్తున ఎరివేతకు దిగడంతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతోపాటు, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పైగా రాష్ట్రాల పోలీసు బలగాలకుతోడు కేంద్ర సాయుధ బలగాలను మరింత ఎక్కువగా కదన రంగంలోకి దింపుతున్న వేళ మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంటున్నారు.
ఇందుకు రెండు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం వృద్ధాప్యంతోపాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. అదే సమయంలో తమకు దశాబ్దాలుగా సేఫ్‌జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని కోల్పోతున్నారు. దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న అబూజ్‌మడ్ సైతం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళుతుండటం మావోయిస్టు నాయకత్వాన్ని మరింత కలవర పరుస్తోంది. మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో ఉన్నారు.
మరోవైపు రిక్రూట్‌మెంట్లు తగ్గటం, విచ్చినవారు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడా పట్టున్న ప్రాంతాలూ ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్‌గా మార్చుకునే యోచనలో మావోయిస్టులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆరుగురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ కావడం, గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలు నిత్యం జల్లెడపడుతుండటాన్ని ఉదహరిస్తున్నారు.
ఆరు పదుల వయసు దాటిన అగ్రనేతలు
మావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది ఆరుపదుల వయస్సు దాటిన వారే ఉన్నారు. ఈ వయస్సులో వారికి మెరుగైన వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కరీంనగర్‌కు చెందిన భూపతి అలియాస్ లచ్చన్న వయస్సు 63 ఏళ్లు, తిప్పరి తిరుపతికి 60 ఏళ్లు, నల్లగొండకు చెందిన పాక హన్మంతుకు 60 ఏళ్లు, హైదరాబాద్‌కు చెందిన మోడెం బాలకృష్ణకు 59 ఏళ్లు, పెద్దపల్లికి చెందిన పుల్లూరి ప్రసాదరావుకు 62 ఏళ్లు.
విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు అగ్రనేతల ఆరోగ్య పరిస్థితి ఇలా..
⇒ మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అలియాస్ రామన్న అలియాస్ దయానంద్ అలియాస్ గుడ్సా దాదా అలియాస్ చంద్రశేఖర్ 74 ఏళ్లకు చేరారు. ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా. ఆయన లో బీపీ, డయాబెటిస్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్ సమస్యలతో ఇప్పుడు దాదాపు మంచానికే పరిమితమయ్యారు.
⇒ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ అలియాస్ ఆనంద్ అలియాస్ సొమ్రు దాదా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. భూపాలపల్లికి చెందిన రవికి 59 ఏళ్లు, డయాబెటిస్‌కు ఇన్సులిన్ వాడుతున్నారు. కిడ్నీలు చెడిపోయి కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
⇒ సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు అలియాస్ గోపన్నకు ఇప్పుడు 66 ఏళ్లు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న కోస ఒబెసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
⇒ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు అలియాస్ చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కర్రల సాయంతో నడుస్తున్నారు.
⇒ హైదరాబాద్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ డయాబెటిస్, గ్యాంగ్రిన్‌తో బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment