మావోయిస్టుకు జవాన్ల రక్తదానం | CRPF Jawans Donate Blood To Save Maoist | Sakshi
Sakshi News home page

మావోయిస్టుకు జవాన్ల రక్తదానం

Published Mon, Feb 18 2019 8:21 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

CRPF Jawans Donate Blood To Save Maoist - Sakshi

జంషెడ్‌పూర్‌: కేంద్ర రిజర్వు పోలీస్‌ దళం(సీఆర్పీఎఫ్‌) జవాన్లు మానవత్వం చూపారు. ఎన్‌కౌంటర్‌లో తీవ్ర గాయాలతో పట్టుబడ్డ ఓ మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయమై జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ) చందన్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. ‘పశ్చిమ సింగ్‌భమ్‌లోని ఓ ప్రాంతంలో జోనల్‌ కమాండర్‌ కండే హోన్హగా నేతృత్వంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు 14వ తేదీన సమాచారం అందింది. దీంతో ఏఎస్పీ(ఆపరేషన్స్‌) మనీశ్‌ రమణ్‌ నేతృత్వంలో సీఆర్పీఎఫ్, పోలీసుల బృందం ముఫ్పస్సిల్‌–గోయిల్కెరా ప్రాంతంలో కూంబింగ్‌ ప్రారంభించింది. ఈ సందర్భంగా మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు లొంగిపోవాల్సిందిగా కోరాయి. అయితే మందుపాతరను పేల్చిన మావోలు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ సందర్భంగా ఘటనాస్థలంలో బుల్లెట్‌ తగిలి రక్తస్రావమవుతున్న మహిళా మావోయిస్టును బలగాలు గుర్తించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ మావోయిస్టు ప్రాణాలను కాపాడేందుకు ఏఎస్సై పంకజ్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ బిచిత్ర కుమార్, కానిస్టేబుల్‌ బిర్‌బహదూర్‌ యాదవ్‌ రక్తదానం చేశారు’ అని తెలిపారు. ఓ దాడికి ప్రణాళిక రచించేందుకు అక్కడ సమావేశమయ్యామనీ, పోలీసుల కాల్పులు ప్రారంభం కాగానే తన తుపాకీని వాళ్లు తీసేసుకున్నారని ఆ మావోయిస్టు చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement