![‘భద్రత’ నిర్ణయం ప్రధాన కార్యదర్శులదే.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41415778153_625x300.jpg.webp?itok=p0qGkqp4)
‘భద్రత’ నిర్ణయం ప్రధాన కార్యదర్శులదే..
సాక్షి, ముంబై: రాజకీయ ప్రముఖులకు ఏ స్థాయి భద్రత కల్పించాలో ప్రధాన కార్యదర్శులే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తనకు శత్రువులెవరూ లేరని, జెడ్ ప్లస్ స్థాయి భద్రత అవసరం లేదని ఇదివరకే ఫడ్నవిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారాలు తమవద్ద ఉంచుకోకుండా ప్రధాన కార్యదర్శులకే బాధ్యత అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా రాజకీయ నాయకులకు, ఇతర రంగాల వీవీఐపీ, వీఐపీలకు జెడ్ ప్లస్, జెడ్ లేదా వై, ఎక్స్ స్థాయి.. ఇలా వివిధ స్థాయిల్లో భద్రత కల్పించే అధికారం ఇదివరకు ముఖ్యమంత్రికి లేదా హోం శాఖ వద్ద ఉండేవి. భద్రత కంటే ‘స్టేటస్ సింబల్’కు ప్రాధాన్యత ఇచ్చే మంత్రులు జెడ్ ప్లస్, జెడ్ భద్రత కావాలని ప్రయత్నాలు చేస్తుండేవారు. అందుకు ముఖ్యమంత్రి లేదా హోం శాఖతో ఉన్న సంబంధాలను సద్వినియో గం చేసుకునేవారు. కాని ఇప్పడా అధికారాలు ప్రధాన కార్యదర్శుల చేతుల్లోకి వెళ్లాయి.
సంబంధిత వీఐపీలు, కీలక నాయకులకు భద్రత కల్పించే ముందు వారి ప్రాణాలకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉంది...? ఏ స్థాయి భద్రత కల్పించాలి తదితర అంశాలను పరిగణంలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఆ ప్రకారం అవసరాన్ని బట్టి ఆ స్థాయి భద్రత వారికి సమకూర్చి ఇవ్వాలి. కాగా, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీలో ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని ఫడ్నవీస్ తెలిపారు.
అడ్వకేట్ జనరల్‌గా సునీల్ నియామకం..
రాష్ట్రంలో కీలకమైన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది సునీల్ మనోహర్ నియమితులయ్యారు. ఇక్కడ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న అడ్వకేట్ దరాయస్ ఖంబాటా రాజీనామాను స్వీకరించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. సీనియర్ లాయరైన సునీల్ మనోహర్ నాగపూర్ యూనివర్సిటీలో లా పట్టా పొందారు.
ముంబై హైకోర్టులోని నాగపూర్ బెంచిలో కీలక న్యాయవాదిగా ఉన్నారు. 27 సంవత్సరాలకు పైగా ఆయన న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. మంచి అనుభవమున్న వ్యక్తిగా ఇదివరకు హైకోర్టులో అనేక కీలక కేసులను వాధించారు. కాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉత్తమ సేవలందించినందుకుగాను దరాయస్ ఖంబాటాను కేబినెట్ సమావేశంలో అభినందించారు.
కరువుపై సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీ
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనేలా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు అవసరమైతే వెంటనే కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై ఓ కమిటీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు.