ఇదో రకం ‘కార్’చిచ్చు
► తహసీల్దార్లకు ఏజెన్సీల ద్వారా అద్దె కార్లు
►కలెక్టరుకు ప్రభుత్వం ఉత్తర్వులు
విజయనగరం గంటస్తంభం: అద్దె వాహనాల బిల్లులు డ్రా చేసుకుంటూ సొంత వాహనాల్లో తిరగడం తహసీల్దార్లకు ఇకపై కుదరదు. ఏజెన్సీల ద్వారానే అన్ని మండలాల తహసీల్దార్లుకు వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఏజెన్సీల ద్వారా వాహనాలను సమకూర్చాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టరు వివేక్‌యాదవ్ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. విధుల నేపథ్యంలో తహసీల్దార్లు పర్యటించడానికి ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిన విషయం విదితమే. తాలూకా కేంద్రాల్లో ఇందుకు ప్రభుత్వ వాహనాలుండగా మిగతా చోట్ల అద్దె వాహనాలు ఉండేవి. ప్రస్తుతం పురపాలకసంఘాల్లో మినహా ఎక్కడా సొంత వాహనాలు లేవు. ఈనేపధ్యంలో అందరూ అద్దె వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
సగానికిపైగా సొంత వాహనాలే
జిల్లాలో 34మండలాలు ఉండగా అందులో 30మండలాల్లో అద్దె వాహనాలను వాడుతున్నట్లు తహసీల్దార్లు బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్కో తహసీల్దారుకు ఇందుకు రూ.24వేలు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం బడ్జెట్ తక్కువగా విడుదల చేస్తున్నందున నెలకు రూ.16వేల నుంచి రూ.22వేల మధ్య బిల్లును ప్రభుత్వం ఇస్తోంది. అరుుతే ఈ బిల్లులు డ్రా చేస్తున్న సగం మందకి పైగా తహసీల్దార్లు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా వాడుతున్నారు. మరి కొందరు వాహనాలు వాడకుండా ద్విచక్ర వాహనాలపై తిరిగేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. 10శాతం మంది మాత్రమే అద్దె వాహనాలను నిజంగా వాడుతున్నారు.
ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు
ఇకపై జిల్లా వ్యాప్తంగా ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం కలెక్టరుకు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, వారు సమకూర్చే వాహనాలు తహసీల్దార్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వాహనానికి రూ.36వేలు బిల్లు చెల్లించాలని, నెలకు ఆవాహనం 2,200 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుందని సూచించింది. ఈనేపథ్యంలో ఇక అందరూ ఏజెన్సీ సమకూర్చే వాహనాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు కలెక్టరు వివేక్‌యాదవ్ కూడా రంగంలోకి దిగారు. పారదర్శకంగా ఏర్పాటు చేయాలని సూచించడంతో టెండర్ల పక్రియ ద్వారా ఏజెన్సీని నిర్ణరుుంచాలని కలెక్టరు భావిస్తున్నారు.
టెండరు నోటిఫికేషన్‌కు కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరుుతే ఎటువంటి వాహనాలు సమకూర్చాలో చెప్పకపోవడంతో దీనిపై స్పష్టత లేదు. టెండరు విడుదల నాటికి ఒక నిర్ణయానికి వస్తారని అధికార వర్గాలు చెబుతున్న మాట. అరుుతే తహసీల్దార్లు మాత్రం బోలెరో వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంత మొత్తానికి ఆ వాహనాలు ఏజెన్సీలు సమకూరుస్తాయో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా డ్రైవర్లను తాము సూచించిన వారినే పెట్టాలని తహసీల్దార్లు అడుగుతున్నారు. రెవెన్యూలో కొన్ని బయటకు చెప్పలేని విషయాలు ఉంటాయని, వాటిని వాహనాల్లో డిస్కస్ చేస్తే బయటకు పొక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తానికి తహసీల్దార్లకు బల్క్‌గా అద్దె వాహనాలు సమకూర్చడం ఖాయం.